ఖాళీ క్యూ

ABN , First Publish Date - 2022-09-27T06:07:07+05:30 IST

ఖాళీ క్యూ

ఖాళీ క్యూ

ఘాట్‌రోడ్డులో ఏర్పాటు చేసిన వీఐపీ క్యూ లైన్‌ వృథా

వీఐపీలందరినీ నేరుగా చినరాజగోపురం వరకు అనుమతి

టోల్‌గేట్‌, ఓం టర్నింగ్‌ వద్ద పోలీసులు, అధికారుల విఫలం 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వీఐపీల కోసం ఏర్పాటుచేసిన రూ.500 క్యూలైన్‌ మొదటి రోజే వృథాగా మారింది. డిజిగ్నేటెడ్‌ వీఐపీలు తప్ప నాన్‌ డిజిగ్నేటెడ్‌ వీఐపీలందరికీ ఘాట్‌ మార్గంలో ఓం టర్నింగ్‌ దగ్గర నుంచి ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశారు. ఈ క్యూను చాలా తక్కువ సంఖ్యలో నాన్‌ డిజిగ్నేటెడ్‌ వీఐపీలు ఉపయోగించుకున్నారు. నాన్‌ డిజిగ్నేటెడ్‌ వీఐపీలు కూడా నేరుగా ఇంద్రకీలాద్రి చినరాజగోపురం వరకు వచ్చి అక్కడి నుంచి రాజగోపుర మార్గంలోనే దర్శనానికి వెళ్లడానికి పోటీ పడ్డారు. దీంతో ఉత్సవాల ముందు చెప్పిన మాటలన్నీ నీరుగారి పోయాయి. ఈ దర్శనాల వల్ల ఆదాయానికి భారీగా గండి పడింది. 

నేరుగా కొండపైకే..

పూర్తిగా పోలీసుల చేతిలో పెత్తనం లేకుండా అన్ని శాఖలు సమన్వయం చేసుకునేలా జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు ఆచరణలో అమలుకాలేదు. ప్రధానంగా టోల్‌గేట్‌, ఓం టర్నింగ్‌ వద్ద విధులు సక్రమంగా పాటించలేదు. టోల్‌గేట్‌ రాజగోపురం మార్గంలో డిజిగ్నేటెడ్‌ వీఐపీలతో పాటు నాన్‌ డిజిగ్నేటెడ్‌ వీఐపీలనూ పైకి పంపుతున్నారు. ఇలా నేరుగా చినరాజగోపుర ం సమీపం వరకు వస్తున్నారు. జడ్జిలు లేకుండా వారి అధికారిక కార్లలో వచ్చిన వారిని కూడా నేరుగా పైకి పంపిస్తున్నారు. పోలీసులు తమ బంధుమిత్ర సపరివారాన్ని వాహనాల్లో నేరుగా చినరాజగోపురం సమీపం వరకు అనుమతించేస్తున్నారు. దీంతో వీఐపీ క్యూలైన్‌ అనేది ఘాట్‌ మార్గంలో నామమాత్రంగా మారింది. 

వృద్ధులు, దివ్యాంగుల బస్సుల్లోకి అందరికీ అనుమతి

వృద్ధులు, దివ్యాంగులను చేరవేసే పేరుతో ఘాట్‌ మార్గంలో కొండపైకి బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సుల్లో వృద్ధులు, దివ్యాంగుల కంటే పెద్దసంఖ్యలో ఇతర భక్తులు వస్తున్నారు. వీరంతా కూడా ఓం టర్నింగ్‌ బారికేడ్ల నుంచి పైకి వచ్చేస్తున్నారు. చినరాజగోపురం, దాని పక్కనే ఉన్న వీఐపీల క్యూ నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. రెవెన్యూ అధికారులతో పోలీసులు సమన్వయం చేసుకోకపోవటం వల్ల ఈ సమస్య ఏర్పడుతోంది. దేవస్థాన సిబ్బందికి విధులు అప్పగించినా వారు సమాచారం కేంద్రం దాటి బయటకు రాకపోవటం, వారికి సంబంధించిన ప్రొటోకాల్‌ దర్శనాల వ్యవహారాలను మాత్రమే చూస్తుండటం వల్ల సమస్య మరింత జఠిలమైంది. వీఐపీలకు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌ కల్పిస్తామని చెప్పినా ఆ ప్రక్రియ విఫలమైంది.  ఈ కారణం వల్ల కూడా ముందస్తు సమాచారం లేకుండా వీఐపీలు నేరుగా కొండ మీదకు వచ్చేస్తున్నారు. 


Updated Date - 2022-09-27T06:07:07+05:30 IST