ఇళ్లు ఖాళీ చేయండి.. లేకుంటే కూల్చేస్తాం

ABN , First Publish Date - 2022-05-23T07:17:38+05:30 IST

పట్టణంలోని ఎన్పీ కాల్వ కట్ట, లింగగిరి మేజర్‌ కాల్వపై ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని, లేదంటే బుల్‌ డోజర్లతో కూల్చి వేస్తా మని రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

ఇళ్లు ఖాళీ చేయండి.. లేకుంటే కూల్చేస్తాం
హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఎన్‌ఎస్పీ కాలువ కట్టలపై ఉన్న పేదల ఇళ్లు

 హుజూర్‌నగర్‌లో ఎన్‌ఎస్పీ కాల్వ కట్ట బాధితులకు రెవెన్యూ, మునిపిపల్‌ అధికారుల మౌఖిక ఆదేశాలు 

ఆక్రమణలతో పాటు పట్టా ఇళ్లకూ మార్కింగ్‌ వేసిన అధికారులు

క్షణం క్షణం... భయం భయంతో పేదలు

హుజూర్‌నగర్‌ , మే 22: పట్టణంలోని ఎన్పీ కాల్వ కట్ట, లింగగిరి మేజర్‌ కాల్వపై ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని, లేదంటే బుల్‌ డోజర్లతో కూల్చి వేస్తా మని  రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.  దీంతో పేదలు ఆందోళన చెందుతున్నారు.

40శాతం మంది కాల్వ కట్టపై.. 

 హుజూర్‌నగర్‌కు రింగ్‌రోడ్డు నిర్మాణానికి 2013లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.22కోట్లు మంజూరు చేసింది. పలు ప్రాంతాల్లో రోడ్డును నిర్మించ,  శ్రీనగర్‌ కాలనీ నుంచి చింతలబజారు, ఎన్టీఆర్‌ కాలనీ, సీతారాంనగర్‌, దీక్షిత్‌నగర్‌ మల్లన్నగర్‌ వరకు. ఎన్‌స్పీ కాల్వ కట్టల మీద రోడ్డు వేయాల్సి ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎన్‌స్పీ కాల్వ కట్టలపై నివసిస్తున్న 60 శాతం మందికి ఫణిగిరి గట్టు వద్ద ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. వీరిలో చాలామంది ఇళ్లు నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నారు. మిగిలినవారు కాల్వ కట్టలపైనే నివసిస్తున్నారు.

అధికారుల వద్ద సర్వే రిపోర్టు

 టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిగిలిన రెండు కిలోమీటర్లకు ఇటీవల రూ.6 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఎంతమంది కాల్వ కట్టలపై ఉన్నారనే అంశంపై  గత మూడు నెలల్లో మూడు సర్వేలు చేశారు. ఇతర మండలాల నుంచివచ్చిన రెవెన్యూ అధికారులు వారం రోజుల క్రితం  ఫైనల్‌ సర్వే చేశారు. నివేదిక మాత్రం అధికారుల వద్ద ఉంది.

పట్టా స్థలాలకూ మార్కింగ్‌..

ఎన్‌ఎస్పీ కాల్వ రోడ్డుకు ఆనుకుని ఉన్న కుడి వైపున ఉన్న పట్టా స్థలాల్లో కూడా అధికారులు మార్కింగ్‌ చేసి ఖాళీ చేయమని చెబుతు న్నారని స్థానికులు తెలిపారు. చింతలబజారుతో పాటు మల్లన్ననగర్‌ ప్రాంతంలో దశాబ్దాల క్రితం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకున్నారు. వాటికి కూడా అధికారులు మార్కింగ్‌ చేశారు. అదేవిధంగా కాల్వ కట్టలు ఆక్రమించుకుని జీవిస్తున్న పేదలు ఆందోళన చెందుతున్నారు. 

ఇటీవల పట్టణంలోని ఎస్‌బీహెచ్‌ రోడ్డులో10 ఇళ్లను, 14 దుకాణాలను, మునిసిపల్‌ అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఇప్పుడు ఎన్‌ఎస్పీ కాలువ కట్టపై ఇళ్లను, లింగగిరి మేజర్‌పై ఇళ్లను మూడు రోజుల్లో కూల్చివేస్తామని పేర్కొనడంతో పేదల క్షణక్షణం భయంభయంతో గడుపుతున్నారు. 

విస్తరణపై స్పష్టత కరవు

గతంలో లింగగిరి మేజర్‌ కాల్వ సెంటరు నుంచి  70 అడుగులు, ఆ తర్వాత కాలువ కట్ట చివరి నుంచి 100అడుగులు మార్కింగ్‌ వేశారు. మరో విడత కాలువ కట్ట నుంచి 50 అడుగులే అన్నారు. ఇప్పుడు అసలు ఎంత రోడ్డు విస్తరణ ఎన్ని అడుగులో  స్పష్టత లేదు. దీంతో పట్టణంలో కాల్వ కట్టలపై నివసిస్తున్న 320ఇళ్ల కుటుంబాలవారు ఆందోళన చెందుతున్నారు.  

వేరోచోట స్థలాలు ఇవ్వండి

 మా అమ్మానాన్నలు కాల్వ కట్టలపై ఇళ్లు వేసుకున్నారు. అప్పటి నుంచి నేను కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాను. ఇల్లు కూలిస్తే మరోచోట స్థలమైనా చూపండి. కష్టపడితేనే కటుంబం గడుస్తోందది.  మాకు ఉన్న ఒక్క ఆధారం కూడా లేకుండా చేయొద్దు.

 - రేపన జానకమ్మ

ఎన్‌ఎస్పీ స్థలాలు కావడంతోనే మార్కింగ్‌ చేశాం 

 ఎన్‌ఎస్పీ స్థలాలని ఆ అధికారులు చెప్పినందునే స్థలాలకు, ఇళ్లకు మార్కింగ్‌ వేశాం. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే చాలామందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కొద్ది మందికి మాత్రమే పట్టాలు ఇవ్వాల్సి ఉంది. గతంలో పట్టాలు ఇచ్చిన కుటుంబ సభ్యులు ఉన్నారు. పట్టాలు పొందాల్సిన వారు కేవలం 50 మంది కూడా లేరు. కాలువ కట్టలపై నివసించే వారికి ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయంలో తనకెలాంటి సమాచారం లేదు. 

- జయశ్రీ,  తహసిల్దార్‌





Updated Date - 2022-05-23T07:17:38+05:30 IST