బీహార్ అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు.. సీఎం రాజీనామాకు డిమాండ్

ABN , First Publish Date - 2021-11-30T22:18:10+05:30 IST

మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో, అందులోనూ అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు వెలుగు చూడడం కలకలం

బీహార్ అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు.. సీఎం రాజీనామాకు డిమాండ్

పాట్నా: మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో, అందులోనూ అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు వెలుగు చూడడం కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు.


మద్యంపై రాష్ట్రంలో పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్న తేజస్వీ యాదవ్.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం సీసాలు కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా మద్యాన్ని నిషేధించాలని కోరారు.


అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాలు బయటపడడంపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, దీనిపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ కనుక అనుమతిస్తే ముఖ్యకార్యదర్శి, డీజీపీని దర్యాప్తు కోరుతామని అన్నారు. మద్య నిషేధానికి అనుకూలంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రతిజ్ఞ చేసిన మరునాడే ఈ మద్యం సీసాలు వెలుగు చూడడం గమనార్హం.  


 అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో మద్యం మాఫియాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని దుమ్మెత్తిపోశాయి. మద్య నిషేధాన్ని ‘కంటితుడుపు’గా అభివర్ణించిన తేజస్వీయాదవ్.. నితీశ్ కుమార్ పోలీసులు మద్యం కొనే వినియోగదారులను మాత్రమే అరెస్ట్ చేస్తారని, అసలు దోషులైన లిక్కర్ మాఫియాపై కన్నెత్తి కూడా చూడరని మండిపడ్డారు. 

Updated Date - 2021-11-30T22:18:10+05:30 IST