విద్యతోనే దళితులకు సాధికారత

ABN , First Publish Date - 2021-07-02T06:29:11+05:30 IST

విద్యతోనే దళితుల సాధికారత సాధ్యం తప్ప ఇతర పథకాలేవీ వారి ఆత్మగౌరవాన్ని పెంచలేవని, సాధికారతను కల్పించలేవని ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు...

విద్యతోనే దళితులకు సాధికారత

విద్యతోనే దళితుల సాధికారత సాధ్యం తప్ప ఇతర పథకాలేవీ వారి ఆత్మగౌరవాన్ని పెంచలేవని, సాధికారతను కల్పించలేవని ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు గుర్తించాలి. అత్యధిక దళిత కుటుంబాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల స్థితిగతులు దయనీయంగా ఉన్నాయి. కొన్ని పాఠశాలలు కూలిపోయే దశలో ఉండగా, మరికొన్నిటికి తలుపులు కిటికీలు, మరుగుదొడ్లు లేవు. తాగునీరు కూడ కరువే. 2018వ సంవత్సరం ప్రభుత్వ లెక్కలను పరిశీలిస్తే 100 మంది ఒకటవ తరగతిలో చేరితే ఐదవ తరగతి చేరే వరకు 28 మంది, 10వ తరగతి చేరే వరకు దాదాపు 36 మంది దళిత విద్యార్థులు బడి మానేస్తున్నారు. వీరు బాలకార్మికులుగా మారుతున్నారని పలు ప్రభుత్వ, ప్రైవేటు అధ్యయనాలలో తేలింది. వీరిని తిరిగి బడికి తీసుకురావడమే ఒక సాధికారత అని గుర్తించాలి. దళితుల దుస్థితికి అసలు కారణం తెలిసీ ముఖ్యమంత్రి ఎందుకు విద్య మీద దృష్టి సారించడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గురుకుల పాఠశాలలతో వారికి నాణ్యమైన విద్య లభిస్తోందని కొంత మంది నాయకులు పేర్కొంటున్నారు. కాని రాష్ట్రం మొత్తం మీద 268 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదువుకుంటోంది కేవలం 1,50,000 మంది దళిత విద్యార్థులు మాత్రమే. రాష్ట్రంలో ఉన్న దాదాపు 16 లక్షల మంది ఎస్సీ బాలల్లో మిగిలిన వారందరికీ నాణ్యమైన విద్య అందించిన నాడే నిజమైన సాధికారత లభించినట్లని గమనించాలి. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలను గురుకుల పాఠశాలలతో సమానంగా మెరుగుపరచాలి. దళితులకు సంబంధించి ఇంతకాలం చేసిన కేంద్రీకృత ప్రణాళిక ప్ర‌య‌త్నాలు పూర్తిస్థాయిలో ఫ‌లితాలివ్వలేదని స్పష్టమవుతోంది. అందుకు భిన్నంగా జిల్లా ఒక యూనిట్‌గా ప్రత్యేక నిధులు కేటాయించి జిల్లాకొక ప్రత్యేక ప్రణాళిక‌ను చేయాలి. పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలి. 

ఆర్. వెంకట్ రెడ్డి, జాతీయ కన్వీనర్, ఎం.వి ఫౌండేషన్

Updated Date - 2021-07-02T06:29:11+05:30 IST