ఊపందుకోనున్న ‘ఉపాధి’ పనులు

ABN , First Publish Date - 2022-08-12T05:35:26+05:30 IST

దాదాపు రెండేళ్ల తర్వాత ఉపాధిహామీ పనులు ఊపందుకోనున్నాయి.

ఊపందుకోనున్న ‘ఉపాధి’ పనులు

- ఫీల్డ్‌అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం

- 28 నెలల తర్వాత క్షేత్రస్థాయికి..

- పంచాయతీ కార్యదర్శులకు తగ్గిన భారం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

దాదాపు రెండేళ్ల తర్వాత ఉపాధిహామీ పనులు ఊపందుకోనున్నాయి. ఫీల్డ్‌అసిస్టెంట్లు విధులకు దూరంగా ఉండడంతో ఉపాధి హామీ పనులు నత్తనడకన సాగాయి. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనబాట పట్టిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఎట్టకేలకు ప్రభుత్వం 28 మాసాల తర్వాత విధుల్లోకి తీసుకున్నది. డిమాండ్లు ఏమోగానీ, తమనైతే ముందుగా విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్‌అసిస్టెంట్లు చేస్తున్న పోరాటం ఫలించింది. ఇప్పటివరకు ఫీల్డ్‌అసిస్టెంట్లు చేసే పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం నుంచి ఫీల్డ్‌అసిస్టెంట్లు విధుల్లో చేరారు. 

యూపీఏ హయాంలో నియామకం..

2005-06లో కేంద్రంలో అధికారంలో యూపీఏ ప్రభుత్వం ఉపాధిహామీ పథకానికి చట్టబద్ధత కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా నివారించేందుకు ఈ పథకం ద్వారా వారికి పనులు కల్పించాలని నిర్ణయించారు. ఏడాదిలో ఒక్కో జాబ్‌హోల్డర్‌కు తప్పసరిగా 100 రోజులు పని దినాలు కల్పించాలని చట్టంలో పేర్కొన్నారు. కూలీలను గుర్తించి జాబ్‌ కార్డులను జారీ చేయడం, గ్రామాల్లో పనులను గుర్తించి కూలీలకు పని కల్పించడం, రోజు వారీగా కూలీల హాజరు నమోదు చేయడం, ఇతరత్రా పనులను నిర్వహించేందుకు ప్రతి పంచాయతీకి ఒక ఫీల్డ్‌అసిస్టెంట్‌ను నియమించారు. ప్రస్తుతం వారికి ప్రభుత్వం నెలకు 10 వేల రూపాయల వేతనం ఇస్తున్నది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగాలను పర్మనెంట్‌ చేయాలని, కూలీలకు పనులు కల్పించేందుకు లక్ష్యాలను విధిస్తూ జారీ చేసిన జీఓను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫీల్డ్‌ అసిస్టెంట్లు 2020 మార్చిలో ఆందోళన బాట పట్టారు. ఎవరికి కూడా విధుల నుంచి తొలగించ వద్దని, ఇప్పటి వరకు తొలగించిన వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కానీ ప్రభుత్వం వారి డిమాండ్లను పట్టించుకోలేదు. 

జిల్లాలో 171 మంది..

ఉపాధి పనులకు విఘాతం కలుగుతున్నదని భావించిన ప్రభుత్వం 2020 మార్చి 18న రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 7651 మంది ఫీల్డ్‌అసిస్టెంట్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న 171 మందిని కూడా తొలగించారు. ఉపాధిహామీ పనులను నిర్వహించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. పంచాయతీ పనుల భారంతో అప్పటికే సతమతం అవుతున్న కార్యదర్శులు తమకు ఈ బాధ్యత వద్దు అంటూ ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. మరోవైపు ఫీల్డ్‌అసిస్టెంట్లు సైతం తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావుకు మొరపెట్టుకున్నారు. ఎట్టకేలకు 28నెలల తర్వాత స్పందించిన సీఎం కేసీఆర్‌ ఫీల్డ్‌అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని రెండు మాసాల క్రితం ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి విధులు నిర్వహిస్తామని ఫీల్డ్‌అసిస్టెంట్లు రాత పూర్వకంగా ఇవ్వడంతో వారిని విధుల్లోకి తీసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఫీల్డ్‌అసిస్టెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. 28 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడ్డ ఫీల్డ్‌అసిస్టెంట్లు వెంటనే కార్యక్షేత్రంలోకి దిగారు. తమ పరిధిలో ఏయే పనులు జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు. ఫీల్డ్‌అసిస్టెంట్లు విధుల్లో చేరడంతో గ్రామాల్లో ఉపాధిహామీ పనులు మరింత ఊపందుకోనున్నాయి. రెండేళ్లుగా పనులు నత్తనడకన సాగాయి. 2020-21లో 80.26 కోట్లు, 2021-22లో 77.13 కోట్ల రూపాయల పనులు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 38.69 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్ల రాకతో పనులు ముమ్మరంగా సాగనున్నాయి. 

Updated Date - 2022-08-12T05:35:26+05:30 IST