నిధులు ఏట్లో పోస్తున్నారు..!

ABN , First Publish Date - 2020-06-03T10:06:41+05:30 IST

జిల్లాలో 794 గ్రామ పంచాయతీల పరిధిలో 4141 హ్యాబిటేషన్లలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలవుతోంది. 3,35,984 జాబ్‌కార్డులు

నిధులు ఏట్లో పోస్తున్నారు..!

  • పెన్నా నది ఇసుకలో ఉపాధి పనులు
  • నిబంధనలకు తూట్లు
  • అడుగంటుతున్న నదీ భూగర్భజలాలు
  • తుంగలో కలిపేసిన ఉపాధి హామీ పథకం లక్ష్యం


గ్రామీణ కూలీలకు ఉపాధి చూపాలి.. భూగర్భజలాలు పెంచేలా, వర్షం నీటిని నిలిపేలా పనులు చేపట్టాలి ఉపాధి హామీ పథకం లక్ష్యం. ఈ నిబంధనలు తుంగలో కలిపేశారు. పెన్నా నది మధ్యలో ఇసుకలో ఉపాధి పనులు చేపట్టారు. ప్రజాధనం ఏట్లో పోస్తున్నారు. ఇదేమిటని సిబ్బందిని ప్రశ్నిస్తే తాము ఈ పనులు చేయవద్దని చెబుతూనే.. చేసిన పనుల కొలతలు తీస్తున్నారు. ఇసుకలో ఉపాధి పనులు చేయకూడదనే నిబంధనలు గాలికొదిలేశారు. ఉపాధి పేరుతో ప్రజాధనం ఏట్లో పోస్తున్న బాగోతంపై ఆంధ్రజ్యోతి క్షేత్ర స్థాయి పరిశీలన కథనం.


కడప, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో 794 గ్రామ పంచాయతీల పరిధిలో 4141 హ్యాబిటేషన్లలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలవుతోంది. 3,35,984 జాబ్‌కార్డులు జారీ చేశారు. 29,179 శ్రమశక్తి సంఘాల పరిధిలో 4.94 లక్షల కూలీలు సభ్యులుగా ఉన్నారు. నిబంధనల ప్రకారం వారందరికీ ఏడాదిలో వంద రోజులు పనులు చూపాలి. వ్యవసాయ పనులు లేని వేసవిలోనే ఉపాధి పనులకు కూలీలు ఎక్కువ శాతం వస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ 2.50 లక్షల మంది వరకు కూలీలు పనులకు హాజరవుతున్నట్లు డ్వామా అధికారులు పేర్కొంటున్నారు. మంగళవారం 2.44 లక్షల మంది పనులకు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో ఇది రికార్డే. అయితే..చేస్తున్న పనుల్లో నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. పనుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.


ఇసుకలో ఉపాధి పనులు

కమలాపురం మండలం, సంబటూరు పంచాయతీ పరిధిలో ఉపాధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ గ్రామ సమీపంలోనే పెన్నానది ఉంది. వారం రోజులుగా నది మధ్యలో ఇసుకలో గుంతలు తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారో స్థానికులకు అర్థం కాలేదు. ఆరా తీస్తే ఉపాధి హామీ పథకం కింద నీటిని నింపేందుకు గుంతలు తీసి.. ఇసుక ఆ పక్కనే వేస్తున్నారు. ఇదేం చోద్యం అంటూ స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. 27 గ్రూపులకు చెందిన దాదాపు 320 మంది కూలీలు వారం రోజులుగా ఈ పనులు చేస్తున్నారు. ఫ్లడ్‌ కంట్రోల్‌ ఫండ్‌ కింద వరద కట్ట నిర్మించే పనులు చేస్తున్నట్లు ఉపాధి హామీ అధికారులు తెలిపారు. ఇసుకలో వరద కట్ట నిర్మాణమా..? ఏ చిన్న వర్షం వచ్చినా.. భారీ ఈదురు గాలులు వీచినా ఇసుక కొట్టుకుపోయి ఇసుకలో తీసిన గుంతలు పూడిపోతాయి. ప్రజా ధనం నీళ్లపాలు కాక తప్పదు. అంతేకాదు.. ఇసుకలో గుంతలు తీయడం వల్ల భూగర్భజలాలు అడుగంటి స్థానిక బోరుబావులు ఒట్టిపోయే ప్రమాదం లేకపోలేదు. 


చేయాల్సిన పనులు ఇవీ..

వంకలు, వాగులు అభివృద్ధి చేయడంతో చెరువుల్లో వర్షం నీరు పుష్కలంగా చేరి నీటి  సమస్య తీరుతుందని అధికారులు అంటున్నారు. అంతేకాదు.. రైతు పొలాలు కోతకు గురి కాకుండా పొలం గట్లు వేస్తున్నారు. పెన్నానది ఒడ్డున ఉన్న పొలాల్లో వరద నీరు చేరకుండా ‘ఫ్లడ్‌ కంట్రోల్‌ ప్రాజెక్టు’ కింద వరద కట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అంటే.. నది ఒడ్డున మట్టిని తీసి రైతు పొలం గట్టుపై వేసి బలోపేతం చేయాలి. నదికి వరద వచ్చినా ఆ పొలం కోతకు గురి కాకూడదన్నది వరద కట్ట లక్ష్యం. ఇందుకు విరుద్దంగా నది మధ్యలో ఇసుకలో గుంతలు తీసి మమ అనిపిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి పనులకు స్వస్తి చెప్పి.. నీటి నిల్వ, రైతు పొలం గట్లు కోతకు గురి కాని ప్రయోజనకరమైన పనులు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు. అయితే.. ఈ పనులు చేయవద్దని, తక్షణమే ఆపివేయమని చెప్పామని పనులు పర్యవేక్షించిన మండల ఉపాధి హామీ ఏపీవో శైలజ పేర్కొనడం కొసమెరుపు. 


ఇసుకలో పనులు చేయరాదు :యదుభూషణ్‌రెడ్డి, డ్వామా పీడీ, కడప 

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిబంధనల ప్రకారం ఇసుకలో ఉపాధి పనులు చేపట్టరాదు. కమలాపురం మండలంలో పెన్నానది ఇసుకలో పనులు చేపట్టిన విషయం తన దృష్టికి వచ్చింది. తక్షణమే ఏపీడీతో విచారణ చేపట్టి ఆ పనులు ఆపివేస్తాం. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎవరినీ ఉపేక్షించేది లేదు.

Updated Date - 2020-06-03T10:06:41+05:30 IST