కేంద్రం పర్యవేక్షణలో ‘ఉపాధి’

ABN , First Publish Date - 2022-01-19T06:16:43+05:30 IST

రాష్ట్రంలో చేపడుతున్న ఉపాధిహామీ పనులను ఇకనుంచి కేంద్రం నేరుగా పర్యవేక్షించనుంది. అన్ని రాష్ట్రాల మాదిరిగానే రాష్ట్రంలో కూడా ఏ రోజుకు ఆరోజు పనుల వివరాలను ఎంట్రీ చేయనుంది. అన్ని రాష్ట్రాలు ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌నే ఇకనుంచి అన్ని జిల్లాల్లో ఉపయోగించనున్నారు. గ్రామాల వారీగా ప్రతిరోజూ ఉపాధి హామీ పథకం కింద కూలీలు చేసిన పనులను ఎంట్రీ చేయనున్నారు.

కేంద్రం పర్యవేక్షణలో ‘ఉపాధి’

ముందుగా గుర్తించిన వాటికే అనుమతులు

కేంద్రం అనుమతితోనే పనుల మార్పులు

రాగాకు బదులు ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ వినియోగం

ఈ నెల 27 నుంచి పనుల వివరాల నమోదు

జిల్లాలో 2లక్షల 66వేల 282 మందికి జాబ్‌కార్డులు 

నిజామాబాద్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో చేపడుతున్న ఉపాధిహామీ పనులను ఇకనుంచి కేంద్రం నేరుగా పర్యవేక్షించనుంది. అన్ని రాష్ట్రాల మాదిరిగానే రాష్ట్రంలో కూడా ఏ రోజుకు ఆరోజు పనుల వివరాలను ఎంట్రీ చేయనుంది. అన్ని రాష్ట్రాలు ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌నే ఇకనుంచి అన్ని జిల్లాల్లో ఉపయోగించనున్నారు. గ్రామాల వారీగా ప్రతిరోజూ ఉపాధి హామీ పథకం కింద కూలీలు చేసిన పనులను ఎంట్రీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ‘రాగా’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పనుల వివరాలు నమోదు జరగగా.. ఈ నెల 27 నుంచి ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నారు. జాతీయస్థాయిలో ఉమ్మడి రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాలు ఎన్‌ఐసీ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ద్వారా ఇప్పటి వరకు అన్ని గ్రామాల్లో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అధికారులందరికీ శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌లో పనుల వివరాలను ఎంట్రీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర సాఫ్ట్‌వేర్‌కు అనుగుణంగా జిల్లాల్లో పనులను మార్పులు చేర్పులు చేసి పూర్తి చేయగా ఇకనుంచి కేంద్రం అనుమతి ఇస్తే తప్ప మార్పులకు అవకాశం లేదు. 

      ఇప్పటి వరకు ‘రాగా’ వినియోగం..

రాష్ట్రంతో పాటు ఏపీలో మాత్రం టీసీఎస్‌ రూపొందించిన రాగా సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఉపాధిపనులను చేపట్టి డాటాను ప్రతిరోజూ కేంద్రానికి అప్‌లోడ్‌ చేస్తున్నారు. అయితే అన్ని రాష్ట్రాల మాదిరిగానే రాష్ట్రంలో కూడా ఎన్‌ఐసీ రూపొందించిన డాటానే వినియోగించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వడంతో రాగాకు బదులుగా ఎన్‌ఐసీ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించనున్నారు. జిల్లాకు చెందిన ఎంపీడీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, ఏపీవోలు, కంప్యూటర్‌ ఆపరేటర్‌లకు శిక్షణను ఇచ్చారు. ఈ నెల 27 నుంచి ప్రతి గ్రామం పరిధిలో ఎన్‌ఐసీ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ద్వారానే ఈ పనులను ఎంట్రీ చేయనున్నారు.

       నిత్యం 10వేల మంది పనుల్లో..

జిల్లాలో ప్రస్తుతం ఉపాధిహామీ కింద ప్రతిరోజూ ఆయా గ్రామాల పరిధిలో 50 నుంచి వంద మంది వరకు పనిచేస్తున్నారు. జిల్లాలో నిత్యం 10వేల మంది వరకు పనుల్లో కొనసాగుతున్నారు. జిల్లాలో 2లక్షల 66వేల 282 జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరిలో సగానికి పైగా మందికి ఏటా ఉపాధి పనులను కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వంద రోజులు పూర్తిచేసిన కుటుంబాలు 11,494 ఉన్నాయి. ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీలకుకేంద్ర ప్రభుత్వం రూ.245 రూపాయలు వేతనంగా నిర్ణయించింది. ప్రస్తుతం చేస్తున్న పనులకు సరాసరిగా ఒక్కో కూలీకి రూ.175 నుంచి రూ.200 వరకు వస్తుంది. వ్యవసాయ పనులు ఎక్కువగా జరుగుతున్నందున కూలీ పనులకు మంది రావడంలేదు. వ్యవసాయ పనులు తప్పితే గ్రామీణ ప్రాంతంలో ఉపాధిహామీకి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. 

      జాబ్‌కార్డులు ఉన్నవారందరికీ..

జాబ్‌కార్డులు ఉన్నవారందరికీ వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి కల్పిస్తున్నారు. కేంద్రం నిర్ణయించిన నిర్ణీత వేతనానికి అనుగుణంగా ఉపాధి పనులు చేసిన కూలీలకు వారం వారం వారి ఖాతాల్లో డబ్బులను జమచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముందే పనులను గుర్తించి ఆయా గ్రామాల పరిధిలో అవసరమున్న పనులను చేపడుతున్నారు. పల్లెప్రకృతి వనాలు, రైతువేదికలు, కల్లాలు, గ్రామ పంచాయతీ భవనాలు, రోడ్లు, చెరువుల్లో పూడికతీత వంటి పనులను ఉపాధిలో చేపడుతున్నారు. ప్రతీ సీజన్‌లో వ్యవసాయదారులకు అవసరమైన కాల్వలను సరిచేయడం, గండ్లు పూడ్చడం, గట్లు వేయడం, కాంటూర్‌ కందకాల తవ్వకం వంటివి చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు, వన్యప్రాణులకు అవసరమైన నీటి తొట్టెలు, ఇతర నిర్మాణాలను ఉపాధిహామీ నిధులతో చేపట్టారు. ఇవేకాకుండా హరితహారం కింద మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించుకునేందుకు మూడేళ్ల పాటు నిర్వహణకు కూడా ఉపాధిహామీ ద్వారానే నిధులను ఇస్తున్నారు.  

అనుమతిస్తేనే మార్పుచేర్పులు..

ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ ప్రకారం ముందుగా నిర్ణయించిన పనులను గ్రామీణ ప్రాంతంలో చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలు మార్చుకుని ఆయా గ్రామాల పరిధిలో అవసరమైన పనులను చేయాలనుకుంటే కేంద్రం అనుమతులు తీసుకోవాలి. అనుమతులు వచ్చిన తర్వాతనే ఆయా గ్రామాల పరిధిలో పనులు చేయాలి.  ఒకవేళ గ్రామాల పరిధిలో అనుమతులు తీసుకోకుండా ఇతర పనులను చేస్తే సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీకి అవకాశం ఉం డదు. కేంద్రం అనుమతించి సాఫ్ట్‌వేర్‌లో ఆప్షన్‌ ఇస్తే గ్రామీణ ప్రాంతంలో పనులను మార్చుకుని చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వర కు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనుబట్టి పనులను చేపట్టారు.

Updated Date - 2022-01-19T06:16:43+05:30 IST