‘ఉపాధి’ పనులు రైతులకు ఉపయోగపడాలి

ABN , First Publish Date - 2021-06-13T06:44:22+05:30 IST

ఉపాధి హామీ పథకంలో చేపట్టే ప్రతి పనీ రైతులకు ఉపయోగపడాలి.

‘ఉపాధి’ పనులు రైతులకు ఉపయోగపడాలి
మీడియాతో మాట్లాడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

‘జగనన్న పచ్చతోరణం’లో జిల్లాను ఆదర్శంగా నిలపండి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 


తిరుపతి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో చేపట్టే ప్రతి పనీ రైతులకు ఉపయోగపడాలి. ‘జగనన్న పచ్చతోరణం’లో ఈ పనులకు ప్రాధాన్యమిచ్చి జిల్లాను ఆదర్శంగా నిలపాలి’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. శనివారం తిరుపతిలోని ఆర్డీవో కార్యాలయంలో 2021-22లో జగనన్న పచ్చతోరణం పథకం కార్యాచరణ అమలుపై కలెక్టర్‌ హరినారాయణన్‌, ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌ చినతాతయ్య, స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ విశ్వనాఽథ్‌, అనుబంధశాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక మేరకు రాష్ట్రంలో 26వేల కిలోమీటర్లు గుర్తించి జాతీయ, రాష్ట్ర, పంచాయతీరాజ్‌ రహదారుల వెంబడి, రైల్వే ట్రాక్‌ ఇరువైపులా మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. నాటే ప్రతి మొక్కా కనీసం ఆరడుగుల ఎత్తు ఉండాలన్నారు. నాటి వదిలేయకుండా సిబ్బందికి బాధ్యత అప్పజెప్పాలన్నారు. మూడేళ్లపాటు సంరక్షణ చర్యలు చేపట్టేలా చూడాలన్నారు. సోషల్‌ ఫారెస్టరీ ఆరడుగుల మొక్కలు పంపిణీ చేయకుంటే.. బయట నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే జగనన్న కాలనీల్లో ఇళ్లు పూర్తయిన చోట సీఎంకు డిప్యూటీసీఎం నారాయణస్వామి సూచించిన విధంగా కొబ్బరిచెట్లు అందించాలన్నారు. రిటైర్డ్‌ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేలా ప్రాజెక్టు రూపొందించారన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఉపయోగపడేలా చెరువులు, కాలువల మరమ్మతులు, చెట్ల పెంపకంపై వందరోజుల ప్రాజెక్టు అమలు చేయాలన్నారు. ఫలితాలను చూశాక తదుపరి కార్యాచరణకు సిద్ధం కావాలన్నారు. గతంలో చేసిన ఉపాధి పథకం పెండింగ్‌ బిల్లులు రూ.5లక్షల్లోపున్నవి చెల్లించేశామన్నారు. అంతకన్నా ఎక్కువ ఉన్నవాటిపై విజిలెన్స్‌ విచారణ జరిగిందని, వారి నివేదిక మేరకు చెల్లిస్తామని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మామిడి రైతులకు ప్రస్తుతం కిలో రూ.11లు ధర వస్తోందని, మరో రూ.2 అదనంగా అడుగుతున్నారని, పరిశీలిస్తామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి పనీ మంత్రి సూచించిన విధంగా రైతుకు మేలు కలిగేలా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జగనన్న పచ్చతోరణంపై చినతాతయ్య పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  డ్వామా పీడీ చంద్రశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీపీవో, డీఎఫ్‌వో, ఆర్‌డబ్ల్యూఎస్‌, పీఆర్‌, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ శాఖల ఎస్‌ఈలు, సాంఘిక సంక్షేమశాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-13T06:44:22+05:30 IST