’ఆన్‌లైన్‌’లో ఉపాధి

ABN , First Publish Date - 2020-11-08T10:10:53+05:30 IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టేందుకు మేడ్చల్‌ జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

’ఆన్‌లైన్‌’లో ఉపాధి

గామపంచాయతీల్లో పనులు చేపట్టేందుకు ప్రణాళిక 

పూర్తిచేసిన పనులు జియోట్యాగింగ్‌

ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ రూపొందించిన కేంద్ర ప్రభుత్వం

చేపట్టిన పనులన్నీ ఇంటర్నెట్‌లో పొందుపరచాలని ఆదేశం

నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు

ఎక్కడి నుంచైనా చూసుకునే అవకాశం

ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ కింద వ్యవసాయ అనుబంధ పనులు


చేపట్టబోయే పనులు....

 పంట కాల్వలు తీయడం

ఫీడర్‌కాల్వలు పంటకాల్వల్లో పూడిక తీయడం

 పశువులకు నీటితొట్టెలు, తాగునీటి పైపులైన్లు, మినీవాటర్‌ ట్యాంకులు, ఆర్వోప్లాంట్ల ఏర్పాటు

సహజ వనరుల కింద నీటి నిల్వ కందకాలు, మట్టికట్టలు ఏర్పాటు చేయడం

 విడి రాళ్లకట్టుట, ఫాంపాండ్లు, ఊటకుంటలు, చెక్‌డ్యాంలు, పశువుల పాకల నిర్మాణం, 

కోళ్లఫారాలు, ఫిట్‌ల నిర్మాణం 


ఇప్పటి వరకు ఇలా..

జిల్లాలో ఉన్న జాబ్‌కార్డులు 1,749 

పూర్తిచేసిన పనిదినాలు    1,26,346  

ఉపాధి పొందిన కూలీలు   9,855


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టేందుకు మేడ్చల్‌ జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం కూలీలకు తగ్గట్టుగా నైపుణ్యం లేని పనులను, గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పన పనులు గుర్తించి బడ్జెట్‌ను రూపొందిస్తారు. ఈ మేరకు డీఆర్‌డీఓ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.  మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో మొత్తం 15 రెవెన్యూ మండలాలు ఉండగా వీటిలో ఐదు మండలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో కీసర మండలంలో 11, శామీర్‌పేట్‌ మండలంలో 10, మేడ్చల్‌లో 17, ఘట్‌కేసర్‌లో 11, మూడుచింతలపల్లిలో 12 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అయితే ఈ పథకం కింద పనులు చేపట్టాలంటే జాబ్‌కార్డులు తప్పనిసరిగా ఉండాలి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 15వేల కార్డులను జారీ చేశారు. అయితే 40గ్రామపంచాయతీలు మునిసిపాలిటీల పరిధిలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐదు మండలాలు, 61 గ్రామపంచాయతీల్లో పలు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 1,749 జాబ్‌కార్డులు ఉన్నాయి. 1,26,346 పనిదినాలు పూర్తిచేశారు.


9855మంది కూలీలకు ఉపాధి కల్పించారు. ఉపాధి పనిచేసేందుకు ముందుకొచ్చే వారికి కార్డులు జారీ చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలో ఈ పథకం కింద పలు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ పనులు పాంపాండ్ల నిర్మాణం, హరితహారం పథకం కింద మొక్కలు నాటేందుకు గుంతలను తవ్వడం, స్వచ్ఛభారత్‌ మిషన్‌లో మరుగుదొడ్ల నిర్మాణం, భూగర్భజలాలను పెంపొందించేందుకు పలు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకం కింద చేపట్టిన పనులను ఇంటర్నెట్‌లో నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇప్పటివరకు జిల్లాలో చేపట్టిన ఉపాధిహామీ పథకం పనుల వివరాలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఈ పథకం కింద దాదాపు వేయికి పైగా పనులు చేపట్టారు. చేసిన పనుల ఫొటోలను జియోట్యాగింగ్‌ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. నాలుగునెలల నుంచి జిల్లాలోని పలు పంచాయతీల్లో పూర్తయిన పనుల వివరాలు సేకరించి ఇంటర్నెట్‌లో నమోదు చేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికగా చేపట్టిన పనులను మాత్రమే నిక్షేపించి, జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల ఎక్కడి నుంచైనా ఈ పథకం కింద చేపట్టిన పనులను సులువుగా చూసుకోవచ్చు. 


చేపట్టనున్న పనులు...

ఉపాధిహామీ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించనున్నారు. మండలాల వారీగా గ్రామసభలు నిర్వహిస్తారు. ఈ సభల్లో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, డీఆర్‌డీఓ అధికారులు పాల్గొంటారు. రైతులతో, కూలీలతో చర్చించి మండలాల వారీగా గ్రామసభలు పూర్తిచేసి గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై పూర్తిస్తాయి నివేదికను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో భూగర్భజలాల పెంపునకు సమగ్ర వాటర్‌షెడ్‌ పనులు చేపడతారు. గ్రామాల్లో అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేసి ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతుల బంజరు భూముల అభివృది ్ధపనులు చేపట్టనున్నారు. 


అదేవిధంగా ఉత్పాదక పెంపు కింద వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యానవన, మత్స్యశాఖ తదితర సంఘాలకు కొంత రుణాన్ని కూడా అందజేస్తారు. చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం, మైనర్‌ ఇరిగేషన్‌ కాలువల్లో పూడికతీత, మంచినీటి చెరువులు, రజక చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టనున్నారు. బంజరు భూముల్లో, రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటడం వంటి పనులు చేపట్టేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు.

Updated Date - 2020-11-08T10:10:53+05:30 IST