కేంద్రం కనుసన్నల్లో ‘ఉపాధి’

ABN , First Publish Date - 2022-01-18T05:43:04+05:30 IST

ఉపాఽధిహామీ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం పెత్తనానికి బ్రేక్‌ పడింది. ఇక నుంచి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలోనే పనులు కొనసాగనున్నాయి.

కేంద్రం కనుసన్నల్లో ‘ఉపాధి’

- ఉపాధిహామీ పథకంపై పూర్తి అజమాయిషీ

- అమల్లోకి వచ్చినా ఎన్‌ఐసీ సర్వర్‌ 

- ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త విధానం 

- పల్లె ప్రగతి పనులపై ప్రభావం 

- జిల్లాలో 100178 జాబ్‌ కార్డులు 

-  2.22 లక్షల మంది కూలీలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఉపాఽధిహామీ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం పెత్తనానికి బ్రేక్‌ పడింది. ఇక నుంచి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం  అజమాయిషీలోనే పనులు కొనసాగనున్నాయి. ఇందుకోసం నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సర్వర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు టీజీఏ సాప్ట్‌వేర్‌ ద్వారా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులకు, కూలీల వేతనాలకు చెల్లింపులు జరిగాయి. ఉపాధి హామీ పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం డిజైన్‌ చేసి అనుమతి ఇచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వం సూచించిన పనులే చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా కూలీలకు పనులు పెంచడంతో పాటు గ్రామాన్ని యూనిట్‌గా  పనులు నిర్ణయించనున్నారు. దీంతో ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కల్లాల నిర్మాణం వంటి పనులు, పల్లె ప్రగతి పనులకు ఉపాధి హామీ పథకాన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు మంజూరు చేస్తున్నా నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పనులను చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయడం ద్వారా పల్లె ప్రగతి పనులకు అటంకాలు ఏర్పడుతాయని భావిస్తున్నారు. ధాన్యం కల్లాలు, రైతు వేదికలు, డంపింగ్‌ యార్డులు  ప్రకృతి వనాలు, శ్మశాన వాటికల నిర్మాణం వంటి పనులకు తెలంగాణ ప్రభుత్వమే నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు  చేపట్టిన పనులకు ఇబ్బందులు లేకపోయినా ప్రారంభంకాని పనులు రద్దు చేసే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు  ఉపాధి హామీ పనుల నిధులను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం ఇక నుంచి సాధ్యం కాదని తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిసెంబరు చివరి నాటికి 255 కంపోస్ట్‌ షెడ్‌లు, 73 వైకుంఠధామాలు, 267 పల్లె ప్రకృతి వనాల పనులను పూర్తి చేశారు.  1681 ధాన్యం కల్లాలు మంజూరవగా 342 పూర్తి చేశారు. 1105 పనులు ప్రగతిలో ఉన్నాయి.  1269 పాడి పశువుల పాకల నిర్మాణాలు మంజూరయ్యాయి. 253 ప్రగతిలో ఉండగా 592 పూర్తి చేశారు. గొర్రెలు, మేకల పాకల నిర్మాణాలకు సంబంధించి 421 మంజూరవగా 137 ప్రగతిలో ఉన్ననయి. 23 పూర్తి చేశారు. ఫాంపాండ్‌లు 2163 మంజూరవాగా 402 ప్రగతిలో ఉన్నాయి. 1227 పూర్తయ్యాయి. గ్రామ సంతలు 20 మంజూరువగా ఒకటి మాత్రమే పూర్తయ్యింది. 3 ప్రగతిలో ఉన్నాయి. కొత్త విధానంతో ప్రగతిలో ఉన్న పనులకు ఎలాంటి అటంకాలు ఎదురవుతోయననే  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కూలీలకు పెరగనున్న ఉపాధి 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఉన్న కూలీలకు గ్రామం యూనిట్‌గా పనులు కేటాయించడం ద్వారా మరింత ఉపాధి పెరగనుంది. జిల్లాలో 1,00చ178 జాబ్‌ కార్డులు ఉండగా 2 లక్షల 22 వేల 342 మంది కూలీలు ఉన్నారు. 6,190 శ్రమశక్తి సంఘాలు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 1,20,063 మంది కూలీలు ఉన్నారు. దివ్యాంగులకు 2103 జాబ్‌ కార్డులను జారీ చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 50,742 కుటుంబాలు 77,098 మంది కూలీలకు ఉపాధిని అందించారు. 46.49 లక్షల పనిదినాలు ఈ సంవత్సరం కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు 39.99 లక్షల పనిదినాలను కల్పించారు. దాదాపు 63 శాతం పూర్తి చేశారు. కూలీలకు వేతనాల కింద రూ.48.19 కోట్లు, అందించగా మేటీరియల్‌ కింద రూ.23.60 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలో సరాసరి కూలీ రూ.202.37 అందించారు. జిల్లాలో వంద రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలు 6,655 ఉన్నాయి. ప్రస్తతతం ఊళ్లోనే ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రానున్న నేపఽథ్యంలో ఇప్పటివరకు టీసీఏ సాఫ్ట్‌వేర్‌ చేపట్టిన పనులకు సంబంఽధించిన పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 

రాజకీయ సమస్యకు తెరపడేనా?

ఉపాధిహామీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడుతూ ప్రచారం చేసుకుంటున్న తీరును బీజేపీ రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి.   అధికార పక్ష టీఆర్‌ఎస్‌ కేంద్రాన్ని విమర్శిస్తూ ఎంతో ఆదర్శంగా పనులు చేపడుతున్నట్లు చెబుతోంది. కొంత కాలంగా రెండు పార్టీల మధ్య పోటా పోటీ విమర్శలు, నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రైతు వేదికలపై కేసీఆర్‌ బొమ్మలు మాత్రమే వేయడంపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం  ఉపాధి హామీ పనులను పూర్తిగా కేంద్రమే చేపడుతున్న క్రమంలో రాజకీయ విమర్శలకు తెరపడుతుందని భావిస్తున్నారు. 


Updated Date - 2022-01-18T05:43:04+05:30 IST