మహిళకు ‘ఉపాధి’

ABN , First Publish Date - 2022-06-26T06:30:18+05:30 IST

ఉపాధిహామీ పనులు గ్రామీణ ప్రాంతాల్లోని వలసలకు అడ్డుకట్ట వేస్తోంది. ఉన్న ఊళ్లలోనే ఉపాధి పొందే వెసులుబాటు కల్పిస్తోంది. పెద్ద పెద్ద చదువులు చదువుకోని మహిళలకు, ఇతర ప్రాంతాల్లో పనిచేయలేని మహిళలలకు ఉపాధి హామీ ఆర్థికంగా ఊతం ఇస్తోంది. కుటుంబ పోషణలో ఆర్థికంగా మహిళలు చేదోడుగా నిలుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపడుతున్న ఉపాధిహామీ పనుల్లో మహిళల హాజరు శాతమే ఎక్కువగా ఉంది. అన్ని పనుల్లోనూ భాగస్వాములు అవుతున్నారు.

మహిళకు ‘ఉపాధి’
జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో మహిళలు

- జిల్లాలోని ఉపాధిహామీ పనుల్లో అతివలే అధికం

- కుటుంబ ఆర్థిక అవసరాలకు చేదోడు 

- జిల్లాలో 2.31 లక్షల ఉపాధిహామీ కూలీలు 

- మూడు నెలల ఉపాధి పనుల్లో 49,605 మంది మహిళలు

- పురుషులు 27,220 మంది

 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఉపాధిహామీ పనులు గ్రామీణ ప్రాంతాల్లోని వలసలకు అడ్డుకట్ట వేస్తోంది. ఉన్న ఊళ్లలోనే ఉపాధి పొందే వెసులుబాటు కల్పిస్తోంది. పెద్ద పెద్ద చదువులు చదువుకోని మహిళలకు, ఇతర ప్రాంతాల్లో పనిచేయలేని మహిళలలకు ఉపాధి హామీ ఆర్థికంగా ఊతం ఇస్తోంది. కుటుంబ పోషణలో ఆర్థికంగా మహిళలు చేదోడుగా నిలుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపడుతున్న ఉపాధిహామీ పనుల్లో మహిళల హాజరు శాతమే ఎక్కువగా ఉంది. అన్ని పనుల్లోనూ భాగస్వాములు అవుతున్నారు. వ్యవసాయ పనుల కంటే ఉపాధి పనులకే ఎక్కువ మంది మహిళలు వెళ్లడం గమనార్హం. జిల్లాలో 1,0,60,00 జాబ్‌ కార్డులు ఉండగా 2.31 లక్షల ఉపాధి కూలీలు ఉన్నారు. 6,195 శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. సంఘాల పరిధిలో 1,20,303 మంది కూలీలు ఉన్నారు.  2022-23 సంవత్సరంలో 46.49 లక్షల పనిదినాలు కల్పించే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఉపాధి హామీ ద్వారా 32,975 కుటుంభాల్లో 45,758 కూలీలకు ఉపాధి కల్పించారు. 


జిల్లాలో 49,605 మంది మహిళలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలోని ఉపాధి హామీ కూలీల్లో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 76,825 మంది కూలీలకు ఉపాధి అందించారు. ఇందులో మహిళలు 49,605 మంది ఉపాధి పనులకు వెళ్తే పురుషులు 27,220 మంది ఉన్నారు. మహిళలు 8 లక్షల పనిదినాలు, పురుషులు 4 లక్షల పనిదినాలను పొందారు. మహిళలు రూ. 14.40 కోట్ల కూలీని పొందారు. పురుషులు రూ.7.94 కోట్ల కూలి పొందారు.  పాంఫాండ్‌, మ్యాజిక్‌ సోప్‌ కిట్‌, పల్లె ప్రకృతి వనాలు, కందకాలు, హరితహారం వంటి పనుల్లు పనిచేస్తున్నారు. 

కొత్త విఽధానంతో నేరుగా వేతనాలు 

ఉపాధిహామీ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనానికి బ్రేక్‌ పడింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అజమాయిషీ చేస్తోంది. ఇందుకోసం ఎన్‌ఐసీ సర్వర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కూలీలకు సంబంధించిన వేతనాలు, పనుల వివరాలు నేరుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్‌లోనే అప్‌లోడ్‌ చేస్తున్నారు. వేతనాలు కూడా కూలీల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కూలీలు సరాసిరి 187.46 రోజుకు కూలి పొందుతున్నారు. జిల్లాలో గత మే వరకు ఉపాధి హామీ ద్వారా కంపోస్ట్‌ షెడ్‌లు 255, వైకుంఠధామాలు 73, పల్లె పకృతి వనాలు 267 నిర్మించారు. వ్యవసాయ కల్లాలు 1681 మంజూరు కాగా 342 పూర్తి చేశారు. 1105 ప్రగతిలో ఉన్నాయి. 1269 పశువుల పాకల నిర్మాణాలకు 586 పూర్తి చేశారు. 297 ప్రగతిలో ఉన్నాయి. గొర్రెలు, మేకల పాకల నిర్మాణాలు 421 మంజూరు కాగా 21 పూర్తి చేశారు. 171 ప్రగతిలో ఉన్నాయి. మ్యాజిక్‌ సోప్‌కిట్‌లు 47,241 మంజూరు కాగా 26,974 పూర్తి చేశారు. 905 ప్రగతిలో ఉన్నాయి. ఫాంపాండ్‌ 2167 మంజూరు కాగా 1227 పూర్తి చేశారు. 423 ప్రగతిలో ఉన్నాయి. గ్రామ సంతలు 20 మంజూరు కాగా ఒకటి మాత్రమే పూర్తి చేశారు. ఐదు ప్రగతిలో ఉన్నాయి. 



Updated Date - 2022-06-26T06:30:18+05:30 IST