100 రోజులు..1163 కేసులు

ABN , First Publish Date - 2020-07-02T10:58:41+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ బుధవారం నాటికి వంద రోజులకు చేరుకుంది

100 రోజులు..1163 కేసులు

లాక్‌డౌన్‌తో ఉపాధి కష్టాలు

సడలింపుతో కరోనా భయం

వంద రోజులుగా అవస్థలు పడుతున్న జనం


కడప, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ బుధవారం నాటికి వంద రోజులకు చేరుకుంది. జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా 1163కు చేరింది. లాక్‌డౌన్‌ వేళ ఉపాధి లేక జనం అవస్థలు పడితే అన్‌లాక్‌ 1.0, అన్‌లాక్‌ 2.0లతో కరోనా భయం జనాన్ని వెంటాడుతోంది. జిల్లాలో ఎక్కడ చూసినా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ తీవ్రమవుతుండడం కలవరపాటుకు గురి చేస్తోంది.


కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు గాను మార్చి 22న ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. 24వ తేదీ నుంచి కేంద్రం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలుకు శ్రీకారం చుట్టింది. దీంతో అన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూతబడ్డాయి. నిర్మాణరంగం నిలిచిపోయింది. వెరసి భవన నిర్మాణ కార్మికుల నుంచి రోజువారి కూలీలు ఇలా ఒకరేంటి.. పేద, మధ్యతరగతి కుటుంబాల వారు ఉపాఽధి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇంటీరియర్‌ డెకరేషన్‌, వివిధ సంస్థల్లో పనిచేసేందుకు పెద్ద ఎత్తున వలస వచ్చారు. వీరందరూ ఉపాధి కరువవడంతో వెనుదిరిగారు. రెండు నెలల అనంతరం ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా ప్రభుత్వం వీరిని స్వస్థలాలకు పంపించింది. స్థానికంగా ఉన్న కూలీలకు ఉపాధి దొరకని పరిస్థితి నెలకొంది.  పట్టణాల్లో తలదాచుకున్న పేదలకు దాతలు సహాయం అందించారు. లాక్‌డౌన్‌ కాలంలో అన్ని రంగాల వారు దారుణంగా నష్టపోయారు. దుకాణాలకు అద్దెలు చెల్లించుకోలేక వ్యాపారులు అవస్థలు పడాల్సిన స్థితి నెలకొంది. రోడ్లపై జనాలు లేకపోవడంతో ఆటోలు మూలనపడ్డాయి. ఎంతో మంది ఉపాధి లేక అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


జెట్‌ స్పీడ్‌లో కరోనా

లాక్‌డౌన్‌ సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత నెలలో అన్‌లాక్‌ 1.0అమలులోకి వచ్చింది. సడలింపు తరువాత జన సంచారం ఎక్కువైంది. వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగుతున్నాయి. వైరస్‌ కూడా జెట్‌ స్పీడ్‌లో జిల్లా అంతా చుట్టేసింది. జిల్లాలో మార్చిలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. ఏప్రిల్‌లో 15, మేలో 121 కేసులు నమోదు కాగా లాక్‌డౌన్‌ సడలించిన జూన్‌ మాసంలో 963 కేసులు నమోదయ్యాయి. కాగా జూలై 1న 64 కేసులు నమోదయ్యాయి. రోజుకు సరాసరిన 32 కేసులు నమోదయ్యాయి. తొలుత పట్టణాలకే పరిమితమైన వైరస్‌ నేడు జిల్లా అంతా చుట్టేసింది. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కేసులు చూస్తే సామాజిక వ్యాప్తి మొదలైందన్న ఆందోళన నెలకొంది. కట్టడి కోసం అఽధికార యంత్రాంగం నిర్విరామంగా కృషి చేసినప్పటికీ కొంతమంది జనం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వైరస్‌ వ్యాప్తికి దోహదపడిందనే చెప్పవచ్చు.


భయం భయం

లాక్‌డౌన్‌ వేళ ఉపాధి కరువైతే అన్‌లాక్‌ 2.0లో ఎవరికి కరోనా ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. మైలవరం మండలంలోని నవాబుపేటలో తొలుత ఒక పాజిటివ్‌ నమోదు అయింది. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలకు కూడా పాజిటివ్‌ రావడంతో పనులు నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. వాణిజ్య సముదాయాల్లో పనిచేసేవారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో తెలియని అయోమయంలో ఉన్నారు. వైరస్‌ కూడా లక్షణాలు మార్చుకుంటుండడంతో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ టెస్టు చేసినప్పుడు పాజిటివ్‌ అని తేలుతుండడం భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో ఏదైనా పనులకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి తలెత్తుతోంది. సడలింపు ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలుకాలేదు.


కరోనా లక్షణాలతో ఒకరు మృతి

కరోనా అనుమానిత లక్షణాలతో ముద్దనూరు మండలానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి కడపలోని ఫాతిమా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. కరోనా లక్షణాలు ఉండడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ వచ్చినట్లు తెలిసింది. ఇతను కరోనాతో మృతి చెందాడా, లేక సాధారణ మరణమా అనేది రిపోర్టు వచ్చిన తరువాత వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.


పాత్రికేయులూ జాగ్రత్త

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా సమాచార సేకరణ కోసం వెళ్లేటప్పుడు పాత్రికేయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీయుడబ్ల్యుజె జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సుండుపల్లెలో రెవెన్యూ అధికారులతో పాటు ఇద్దరు పాత్రికేయులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, కనుక సమాచారం సేకరించేటప్పుడు విధి నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.


మరో 64 పాజిటివ్‌ కేసులు

జిల్లాలో బుధవారం మరో 64 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరులో 26, కడపలో 4, చెన్నూరులో 4, పులివెందుల 4, సింహాద్రిపురం 9, వల్లూరు 1, రాజుపాలెం 1, దువ్వూరు 5, ముద్దనూరు 1, తొండూరు 2, రామాపురం 1, గాలివీడు 1, ఎర్రగుంట్ల 1, చక్రాయపేటలో 1, ఖాజీపేట 1 నమోదు కాగా విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌ నమోదైంది. జిల్లా కోవిడ్‌-19 ఆసుపత్రిలో చికిత్స పొంది 24 మంది డిశ్చార్జి అయ్యారని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు 460 మంది డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. కాగా.. కంటైన్మెంటు జోన్‌ ఆంక్షల్లో ఉన్న రాజంపేట అర్బన్‌లోని ఈడిగపాలెం గురువారం నుంచి నాన్‌ కంటైన్మెంటు జోన్‌గా మార్చుతున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.


కోవిడ్‌-19 సమాచారం

మొత్తం శాంపిల్స్‌  - 72816

రిజల్ట్‌ వచ్చినవి  - 69570

నెగటివ్‌ - 68407

పాజిటివ్‌ - 1163

డిశ్చార్జ్‌ అయినవారు - 460

రిజల్ట్‌ రావాల్సినవి - 3246

జూలై 1వ తేదీ తీసిన శాంపిల్స్‌  - 1952

Updated Date - 2020-07-02T10:58:41+05:30 IST