ఉపాధి సంక్షోభం

ABN , First Publish Date - 2022-06-17T06:32:57+05:30 IST

రాబోయే పద్దెనిమిదిమాసాల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీచేయబోతున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఇటీవల ట్వీట్ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో మానవవనరుల స్థితిగతులను సమీక్షించిన తరువాత...

ఉపాధి సంక్షోభం

రాబోయే పద్దెనిమిదిమాసాల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీచేయబోతున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఇటీవల ట్వీట్ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో మానవవనరుల స్థితిగతులను సమీక్షించిన తరువాత, యుద్ధప్రాతిపదికన ఏడాదిన్నరలోగా పదిలక్షల ఉద్యోగాలు నింపేయాలని నరేంద్రమోదీ ఆదేశించారన్నది ఆ ట్వీట్ సారాంశం. ప్రభుత్వరంగంలో ఉన్న వివిధ ఖాళీల గురించి మోదీని విపక్షాలు అడపాదడపా ప్రశ్నిస్తుంటాయి కనుక, ఈ మిలియన్ ఉద్యోగాలూ తమ ప్రభావం వల్లనేనని అవి చెప్పుకోవడం సహజం. ఒక పక్కన ఈ భర్తీ ప్రక్రియను మరో జుమ్లా అని తీసిపారేస్తూనే కొన్ని పార్టీలు క్రెడిట్‌ను మాత్రం తమఖాతాలో వేసుకుంటున్నాయి. దాదాపుగా ఇదే సమయంలో దేశ రక్షణ రంగంలోకి స్వల్పకాలిక కాంట్రాక్టు సైనికులను తీసుకువచ్చే అగ్నిపథాన్ని పాలకులు ఆవిష్కరించడంతో అగ్నివీరులుగా మారవలసిన యువత రైళ్ళనూ బస్సులనూ తగులబెడుతున్నందున కాబోలు, మోదీ మిలియన్ ఉద్యోగాల ప్రకటన ప్రజల మనసులను పెద్దగా దోచుకున్నట్టు కనిపించడం లేదు.


జాబ్ కాలెండర్ ఉండాలనీ, ఎన్నికలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా అది ఏటా విధిగా అమలవుతూ ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీచేస్తూ పోవాలన్నది ఓ ఆదర్శం. కానీ, ఏ ముడులూ లేకుండా ఉద్యోగాల భర్తీ దానికదే జరిగిపోవటం కనిపించదు. ఎన్నికలు ముంచుకొస్తూ, ముందుకొస్తూ విపక్షాల దాడి అధికమైనప్పుడో, వేరే కారణాలవల్ల తాము ఆత్మరక్షణలో పడినప్పుడో, ప్రజల దృష్టిని మరల్చాల్సి వచ్చినప్పుడో ఈ ప్రకటనలు వెలువడుతుంటాయని అంటారు. ఏ కారణం వల్లనైతేనేమి, మోదీ ఈ ఉద్యోగ భర్తీకి సంకల్పించినందుకు మెచ్చవలసింది పోయి విపక్షాలు అదే పనిగా విమర్శలు చేస్తున్నాయి. ఎనిమిదేళ్ళక్రితం ఆయన ఎన్నికల ప్రచారంలో ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు నింపుతానని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. ఆయన ఉద్యోగాలు సృష్టించలేడు, ఉద్యోగాలపై వార్తలు మాత్రం సృష్టించగలడు అని రాహుల్ విమర్శిస్తున్నారు.


ఏటా రెండుకోట్ల ఉద్యోగాల 2014 నాటి జుమ్లాను అటుంచినా, మరో రెండేళ్ళలోనే తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం పేదల ఉపాధిని పెద్దగా దెబ్బతీసి, వారి కడుపుకొట్టిన మాట నిజం. నగదులావాదేవీలను తగ్గించడం, నల్లడబ్బును, ఉగ్రడబ్బును నిరోధించడం వంటి మాటలు చెప్పి తీసుకున్న ఈ నిర్ణయం అంతిమంగా ఏ ఫలితమూ ఇవ్వలేదని అనతికాలంలోనే తేలిపోయింది. కనీసం 20లక్షల మంది ఉపాధికోల్పోయారని, అసంఘటితరంగం చావుదెబ్బతిన్నదని ఆర్థిక నిపుణులు తేల్చేశారు. ఆ తరువాత కోట్ల ఉద్యోగాల లెక్కలు పక్కకుపోయి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఐదేళ్ళలో 60లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు 10లక్షల ఉద్యోగాలను ఏడాదిన్నరలో నింపబోతున్నామని అంటున్నారు. ఈ ఉద్యోగాల్లో 90శాతం ఖాళీ అయిన కుర్చీలను భర్తీచేసేవే తప్ప, కొత్తగా ఉపాధినిచ్చేవి కావు. దేశాన్ని కాపాడవలసిన సైనికుడిని కూడా నాలుగేళ్ళు ఉద్యోగంలో ఉంచి, ఆ తరువాత ఓ నాలుగురాళ్ళు చేతికిచ్చి పంపించేస్తానని చెబుతున్నప్పుడు ఈ ప్రభుత్వం స్వల్పకాలిక ఉపాధి మీదే శ్రద్ధపెడుతున్నదని అనిపించకమానదు.


దేశంలో నిరుద్యోగిత ఏడుశాతం దగ్గర ఉంటూ, లక్షలాదిమంది మహిళలు ఉపాధికి దూరమైపోతున్న స్థితి నేడు ఉంది. గత ఏడాదితో పోల్చితే నిరుద్యోగం రెట్టింపయింది. ఏటా కోటిన్నరమంది శ్రమచేయగల వయసులోకి అడుగిడుతుంటే, యాభైలక్షల మంది శ్రామికులుగా మారుతున్నారు. ఆర్థికవ్యవస్థ మొత్తంగా కార్పొరేట్లకు అనుకూలంగా మారిపోవడంతో, చట్టాలు వారి చుట్టాలుగా తయారవుతూండటంతో శ్రమకు తగిన ఫలం దక్కని ఉద్యోగాలే ఇప్పుడు ఎక్కువైనాయి. కార్పొరేట్ల నుంచి స్టార్టప్పుల వరకూ ఒకచేత్తో ఇచ్చినట్టే ఇచ్చి, స్వల్పకాలంలోనే మరోచేత్తో లాక్కుంటున్నాయి. ఎంతో ఘనంగా చెప్పుకొనే స్టార్టప్పుల్లో హైర్ తక్కువ ఫైర్ ఎక్కువ. కరోనా మిగల్చిన విషాదాలు, విధ్వంసాలతో పాటు మనం చేజేతులా చేసిన పాపాలను సరిదిద్దుకోవాలంటే, ఉద్యోగ ఉపాధి కల్పనలు వాస్తవాల ప్రాతిపదికన జరగాలి. ఒకపక్కన యుద్ధం, మరోపక్కన మహమ్మారి, అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు సామాన్యుడిని కుదిపేస్తున్నాయి. రిజర్వుబ్యాంకు క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా, నిపుణుల సూచనలతో, ఎన్నికల ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా ప్రణాళికాబద్ధంగా ఉద్యోగ ఉపాధి కల్పన జరిగిపోవాలి.

Updated Date - 2022-06-17T06:32:57+05:30 IST