Abn logo
Jun 22 2021 @ 00:12AM

అభివృద్ధికి దోహదపడేలా ఉపాధి పనులు చేపట్టాలి

వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ


అధికారులకు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఆదేశం

పాడేరు, జూన్‌ 21: మన్యంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి దోహదపడేలా   ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి సోమవారం ఏజెన్సీ మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ పథకం అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఉపాధి పనుల పురోగతి, లేబర్‌ మొబలైజేషన్‌,  అవెన్యూ ప్లాంటేషన్‌, ఉద్యాన తోటల పెంపకంపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ వ్యాప్తంగా ఒక లక్షా 45 వేల 255 జాబ్‌ కార్డులు జారీ చేశారని, వాటిలో ఒక లక్షా తొమ్మిది వేల మందికి మాత్రమే ఉపాధి పనులు కల్పిస్తున్నారన్నారు. మిగిలిన జాబ్‌ కార్డుదారులకు ఉపాధి పనులు కల్పించాలని ఐటీడీఏ పీవో సూచించారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలని  ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో ఎన్ని శ్రమశక్తి సంఘాలున్నాయని ఆరా తీశారు. ఉపాధి పనుల్లో సర్పంచులు, ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు.

రోడ్డు కిరు వైపులా 732 కిలో మీటర్ల అవెన్యూ ప్లాంటేషన్‌...

ఏజెన్సీలో రోడ్లకి ఇరుపైపులా 732 కిల్లోమీటర్ల అవెన్యూ ప్లాంటేషన్‌ లక్ష్యం కాగా ఇప్పటికి 437 కిలోమీటర్లకు అంచనాలు సమర్పించారని, మిగిలిన 295 కిలోమీటర్లకు అంచనాలు రూపొందించి తక్షణమే సమర్పించాలని పీవో గోపాలకృష్ణ అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని బతికించే విధంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఏజెన్సీలో 11 వేల ఎకరాలకు ఉద్యాన తోటల పంపకం లక్ష్యం కాగా, ఇప్పటికి 7,858 ఎకరాలకు మాత్రమే అంచనాలు సిద్ధం చేశారన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఎనిమిది రకాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రతీ మూడు నెలలకు పుస్తక నిర్వహణ పనులు సంపూర్ణంగా చేపట్టాలన్నారు. అలాగే పనులు పూర్తి చేసిన తరువాత డాక్యుమెంటేషన్‌ సక్రమంగా ఉండేలా ఎంపీడీవోలు దృష్టి సారించాలన్నారు. బ్యాంకు ఖాతాల్లో లోపాలను సవరణకు కృషి చేయాలన్నారు. త్వరలో మొబైల్‌ ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశంలో మెడికల్‌ కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పఽథకం ఏపీడీ వి.రాధాకృష్ణ, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈవోపీఆర్‌డీలు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.