ఉద్యోగుల.. ఉద్యమం

ABN , First Publish Date - 2021-12-07T06:19:55+05:30 IST

పీఆర్సీ, సీపీఎస్‌ రద్దుతోపాటు పలు న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యోగులు ఉద్యమం చేపట్టేందుకు సమాయత్తమయ్యారు.

ఉద్యోగుల.. ఉద్యమం
సమావేశంలో సంఘీభావం ప్రకటిస్తున్న ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు

సమస్యలపై నేటి నుంచి నిరసనలు

కరపత్రాలను ఆవిష్కరించిన జేఏసీ నేతలు

కార్యక్రమాల్లో ప్రతి ఉద్యోగి పాల్గొనాలని పిలుపు

గుంటూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీ, సీపీఎస్‌ రద్దుతోపాటు పలు న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యోగులు ఉద్యమం చేపట్టేందుకు సమాయత్తమయ్యారు. ఈ నెల 7 నుంచి ఉద్యోగ సంఘాలు తలపెట్టిన ఉద్యమ కార్యాచరణ విజయవంతం చేయాలని ఆయా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఎన్జీవో కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ కె.సంగీతరావు, కన్వీనర్‌ కె.శ్రీనివాసశర్మ, ఏపీ జేఏసీ చైర్మన్‌ ఘంటసాల శ్రీనివాసరావు, కన్వీనర్‌ శెట్టిపల్లి సతీష్‌కుమార్‌ తదితరులు మాట్లాడుతూ 7 నుంచి దశలవారీగా జరిగే ఆందోళన కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 7 నుంచి 10 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలన్నారు. 13న నిరసన ప్రదర్శనలు, సమావేశాలను అన్ని తాలూకా, డివిజన్‌ కార్యాలయాలు, బస్సుడిపోల్లో నిర్వహించాలన్నారు. 16న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తాలూకా, డివిజన్‌,వివిధ శాఖల ప్రధాన విభాగాలు, ఆర్టీసీ డిపోల్లో ధర్నాలు నిర్వహించాలన్నారు. 21న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలన్నారు. ఉద్యమ కార్యాచరణ పోస్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్జీవో అసోసియేషన్‌ నగర అధ్యక్షుడు కె.సుకుమార్‌, నాయకులు జి.వేణుగోపాల్‌, సోమేశ్వర్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, పీఆర్‌టీయూ నాయకులు రామకృష్ణ, ఏపీఎస్‌ ఆర్టీసీ నాయకులు రవీంద్రారెడ్డి, ఏపీటీఎఫ్‌ నాయకులు బసవలింగంరాజు, నాల్గోతరగతి ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.మల్లేశ్వరరావు, ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్‌పర్సన్‌ సుశీల, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కె.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:19:55+05:30 IST