నేడు ఉద్యోగుల కలెక్టరేట్‌ ముట్డడి

ABN , First Publish Date - 2022-01-20T05:25:47+05:30 IST

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన షాక్‌తో రగిలిపోతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపిచ్చారు.

నేడు ఉద్యోగుల కలెక్టరేట్‌ ముట్డడి
సంఘీభావం తెలియజేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు

గుంటూరు(విద్య), జనవరి 19: పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన షాక్‌తో రగిలిపోతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపిచ్చారు. ఉదయం 9 గంటలకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు కలెక్టరేట్‌కు తరలివచ్చి ముట్టడిలో పాల్గొనాలని సంఘాల నాయకులు కోరారు.  బుధవారం ఎన్‌జీవో హోమ్‌లో నాయకులు సమావేశమై కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అర్ధరాత్రి జీవోలు జారీ చేసి మోసం చేసిందని, జీవోలన్ని రద్దుచేసే వరకు ఉద్యమాలు తప్పవన్నారు.  

కలెక్టరేట్‌ వద్ద కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమానపనికి సమాన వేతనం ఇస్తామన్న హామీని సీఎం నిలబెట్టుకోలేదంటూ జేఏసీ ఆఫ్‌ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ కార్యదర్శి బీ ముత్యాలరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌ వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలను నిలబెట్టుకోకపోతే ఛలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. హామీలు అమలు చేయలేదని అప్పటి చంద్రబాబునాయుడును విమర్శించిన జగన్‌ అధికారంలోకి వచ్చాక అదే తప్పు చేస్తున్నారని విమర్శించారు. పర్మినెంట్‌ చేయకుండా కాంట్రాక్టు ఉద్యోగులకు 30శాతం పెంచుతూ విడుదల చేసిన జీవోను వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, శివయ్య, పద్మ, కోటేశ్వరి, సుజాతరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-20T05:25:47+05:30 IST