బదిలీల ఇక్కట్లు!

ABN , First Publish Date - 2021-08-27T05:47:09+05:30 IST

పరిపాలన సౌలభ్యం, కారణాల పేరుతో రెవెన్యూ శాఖలో జరుగుతున్న బదిలీలు సంబంధిత ఉద్యోగులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.

బదిలీల ఇక్కట్లు!

పరిపాలన కారణాలతో రెవెన్యూలో ట్రాన్స్‌ఫర్లు

ర్యాటిఫికేషన్‌ చేయకుండా సీసీఎల్‌ఏ తాత్సారం

ట్రెజరీల నుంచి విడుదల కాని జీతాలు

ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు


గుంటూరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): పరిపాలన సౌలభ్యం, కారణాల పేరుతో రెవెన్యూ శాఖలో జరుగుతున్న బదిలీలు సంబంధిత ఉద్యోగులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఆయా బదిలీలను రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్‌ కార్యాలయం ఆమోదించకుండా జాప్యం చేస్తుండటంతో కొంతమంది ఉద్యోగులు ఇంచుమించు ఏడాది నుంచి జీతాలు పొందలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము చేసిన బదిలీ ఉత్తర్వులను ర్యాటిఫై చేయాల్సిందిగా విజ్ఞప్తిచేస్తూ జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీకి లేఖ రాయడం ఆ శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

గత ఏడాది జూన్‌, ఆగస్టు, సెప్టెంబరు, నెలల్లో అప్పటి కలెక్టర్‌ పరిపాలన కారణాలను పేర్కొంటూ ఏడుగురిని బదిలీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ జి.నాగరాజును వెల్దుర్తి నుంచి భట్టిప్రోలుకు, ఆర్‌ఐ టీఎల్‌ ఫణికుమార్‌ను  నగరం నుంచి అమర్తలూరు, సీనియర్‌ అసిస్టెంట్‌ కె.నరసయ్యను చేబ్రోలు నుంచి వేమూరు, జూనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ జహ్రాబానును డీఎస్‌వో, గుంటూరు నుంచి చెరుకుపల్లికి, టైపిస్టు ఎం.శ్రీనివాసరావును అమర్తలూరు నుంచి వేమూరు, ఆఫీసు సబార్డినేట్‌ ఎ.నాగభూషణంను రేపల్లె నుంచి తెనాలి, మరో ఉద్యోగి ఎన్‌.వెంకటరావును తెనాలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి అమర్తలూరుకు బదిలీ చేశారు. వీరంతా అప్పట్లో విధుల్లో చేరారు. అయితే ఆ రోజు నుంచి ఇప్పటివరకు జీతభత్యాలను ట్రెజరీ వర్గాలు తిరస్కరించాయి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేదం ఉన్న సమయంలో వారిని బదిలీ చేసినందుకు కారణంగా పేర్కొంటున్నాయి. దీనిపై ఆయా ఉద్యోగులు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు కూడా చేశారు. ఎట్టకేలకు తెనాలి సబ్‌ కలెక్టర్‌ ఆయా ఉద్యోగుల పరిస్థితిని వివరిస్తూ జాయింట్‌ కలెక్టర్‌కి నివేదించారు. దీనిపై ఆయన స్పందించి తాము పరిపాలన సౌలభ్యం కోసం ఖాళీలున్న స్థానాల్లో వారిని బదిలీ చేశామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాము తీసుకొన్న చర్యలను ర్యాటిఫై చేస్తే ఆయా ఉద్యోగులు ప్రస్తుతం పని చేస్తున్న ప్రదేశాల్లో జీతాల బిల్లులు తీసుకోగలరని పేర్కొంటూ జేసీ లేఖ రాశారు. 


సీసీఎల్‌ఏ స్పందన ఎలా ఉండబోతోందో..!

రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి ఏ వ్యవహారమైనా అమరావతి రాజధాని సచివాలయంలోని సీసీఎల్‌ఏ కార్యాలయం చూస్తోంది. అక్కడ రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. దీంతో వారు ఏ ఫైలు వెళ్లినా కొన్ని నెలల పాటు తాత్సారం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తమ ఫైలు త్వరగా క్లియర్‌ కావాలని ఆయా ఉద్యోగులు కోరుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని పరిపాలన సౌలభ్యం పేరుతో బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ట్రాన్స్‌ఫర్లు చేయొద్దని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 

Updated Date - 2021-08-27T05:47:09+05:30 IST