డొమెస్టిక్ వర్కర్లకు UAE తీపి కబురు.. ఇకపై జీతాలు చేతికి ఇవ్వరట..!

ABN , First Publish Date - 2022-01-28T16:50:03+05:30 IST

డొమెస్టిక్ వర్కర్లకు యూఏఈ తీపి కబురు చెప్పింది. ఇకపై వారికి జీతాలు చేతికి ఇవ్వకుండా ఆల్‌లైన్ ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

డొమెస్టిక్ వర్కర్లకు UAE తీపి కబురు.. ఇకపై జీతాలు చేతికి ఇవ్వరట..!

అబుదాబి: డొమెస్టిక్ వర్కర్లకు యూఏఈ తీపి కబురు చెప్పింది. ఇకపై వారికి జీతాలు చేతికి ఇవ్వకుండా ఆల్‌లైన్ ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. దీని కోసం వేజ్ ప్రొటెక్షన్ సీస్టం(డబ్ల్యూపీఎస్)ను అమలు చేస్తున్నట్లు మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖలోని గృహ కార్మికుల వ్యవహారాల విభాగం వెల్లడించింది. దీని వల్ల ప్రతి నెల ఒకే సమయానికి కార్మికులకు శాలరీలు అందుతాయని పేర్కొంది. జనవరి 27వ తేదీ నుంచి డొమెస్టిక్ వర్కర్లకు ఈ విధానం అమలు అవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ విధానం యజమానులకు బ్యాంక్ బదిలీలు, ఎక్స్చేంజి కార్యాలయాలతో పాటు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ ద్వారా గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లో జీతాలు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. కాగా, యూఏఈ 2009లో మొదటిసారి ఈ విధానాన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది. గత 13 ఏళ్లుగా ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు ఈ విధానం ద్వారానే జీతాలు చెల్లిస్తోంది. 


ఈ సందర్భంగా హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖలోని గృహ కార్మికుల వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఖలీల్ ఖౌరీ మాట్లాడుతూ.. గృహ కార్మికుల కోసం డబ్ల్యూపీఎస్‌ని ఐచ్ఛికంగా అమలు చేయడం వల్ల కార్మికులు, వారి యజమానుల హక్కులను కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ఇది యజమానులకు వారు జీతం సకాలంలో చెల్లించినట్లు నిరూపించడంలో సహాయపడుతుందన్నారు. అదే సమయంలో గృహ కార్మికులు ప్రతి నెలా వారి జీతాలను సకాలంలో అందుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుందని పేర్కొన్నారు. ఈ విధంగా ఈ వ్యవస్థ డొమెస్టిక్ వర్కర్లు వారి యజమానుల మధ్య స్థిరమైన, ఆరోగ్యకరమైన పని సంబంధాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుందని ఖౌరీ చెప్పారు. హౌస్‌మెయిడ్‌లు, నానీలు, హౌస్‌కీపర్‌లు, కుక్‌లు, ఫ్యామిలీ డ్రైవర్‌లు, సెక్యూరిటీ గార్డులు, తోటమాలి, రైతులు, ప్రైవేట్ కోచ్‌లు, ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ నర్సులు, ప్రైవేట్ ప్రతినిధులు, ఇంజనీర్లు, నావికులు, గొర్రెల కాపరులు, ఫాల్కన్ కేర్-టేకర్, ప్రైవేట్ వ్యవసాయంతో సహా చట్టంలో పేర్కొన్న కార్మికులందరికీ ఈ వ్యవస్థ వర్తిస్తుందని తెలిపారు. అంతేగాక డబ్ల్యూపీఎస్ సకాలంలో కార్మికులకు జీతాలు చెల్లించడానికి సులభమైన, వేగవంతమైన, డిజిటల్‌గా అధునాతన ఛానెల్‌ని అందిస్తుందని ఖౌరీ నొక్కిచెప్పారు. ఈ విధానం ప్రైవేట్ రంగంలో సానుకూల, స్థిరమైన, పారదర్శకమైన పని సంబంధాలను కొనసాగిస్తోందని చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-01-28T16:50:03+05:30 IST