సమర సమ్మె..ట

ABN , First Publish Date - 2022-01-29T06:21:04+05:30 IST

సమర సమ్మె..ట

సమర సమ్మె..ట
విజయవాడ ధర్నాచౌక్‌లో జరిగిన రిలే నిరాహార దీక్షల్లో నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం

సమర శంఖారావంతో హోరెత్తుతున్న విజయవాడ

వైద్య ఆరోగ్య శాఖ సమ్మె నోటీసు జారీ

ఏ క్షణంలోనైనా సమ్మెకు సై.. బస్సులు ఆపేస్తామంటున్న ఆర్టీసీ ఉద్యోగులు

మంత్రులకు స్ట్రగుల్‌ కమిటీ కౌంటర్లు

వెలగపూడి సచివాలయంలో ఉద్యోగుల భారీ ర్యాలీ

బెజవాడ, బందరులో కొనసాగిన రిలే దీక్షలు


పోరు నినాదాలతో బెజవాడ హోరెత్తుతోంది. ఉద్యోగుల ఉద్యమాలతో ఉక్కు పిడికిలి బిగుస్తోంది. సమర నినాదాలు.. సమ్మెల పిలుపులతో శంఖారావాన్ని పూరిస్తోంది. వివిధ సంస్థల ఉద్యోగుల ఐక్య కార్యాచరణకు విజయవాడే కేంద్రంగా పోరు సాగుతోంది. ఓవైపు వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాలు, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పథకాల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, సర్వీస్‌ ప్రొవైడర్ల ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు నోటీసు ఇచ్చారు. మరోవైపు ఏ క్షణంలో అయినా సమ్మెకు పిలుపునిచ్చి, బస్సులు ఆపేస్తామంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఐక్యంగా హెచ్చరించారు. ఇంకోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ స్ట్రగుల్‌ కమిటీ నేతలు మంత్రుల కమిటీకి ధీటైన కౌంటర్లు ఇవ్వగా, ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విద్యాధరపురం వేదికగా పిలుపునిచ్చింది.  ఇక వెలగపూడి సచివాలయంలోని ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. విజయవాడ, బందరులో రెండోరోజూ కొనసాగిన రిలే నిరాహార దీక్షల్లో ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమ స్ఫూర్తిని నింపారు. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

------------------------------------------------------------------------------------------

సమ్మెకు సిద్ధం.. బస్సులు ఆపేస్తాం.. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక హెచ్చరిక

‘మాతో పెట్టుకోవద్దు. ఈ పీఆర్సీ వల్ల తీవ్రంగా నష్టపోయేది మేమే. నాలుగేళ్లకోసారి పీఆర్సీ తీసుకునేవాళ్లం. ఇప్పుడు పదేళ్లకు తీసుకోవాలా? ఇప్పటికే ఒక పీఆర్సీని కోల్పోయాం. మీరిచ్చిన  పీఆర్సీలో మాకెలాంటి ప్రయోజనాలున్నాయి? ఆర్టీసీ గురించి అశుతోష్‌ మిశ్రా ఇచ్చిన నివేదిక ఏమిటో తెలియదు. ఇలాంటి విలీనాన్నా మేము కోరుకునేది. కొత్త ప్రయోజనాలు వస్తాయనుకుంటే ఉన్న వాటిని తొలగిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల నష్టాన్ని సరిచేయటం లేదన్న కారణంతోనే మేము ఉద్యమ పథంలోకి అడుగు పెడుతున్నాం. బస్సులు ఆపేస్తాం. సమ్మెలోకి ఏ క్షణంలో అయినా దిగుతాం..’ అంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఏపీ పీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌, కార్మిక పరిషత్‌, ఓస్వా, ఏపీపీటీజీఈఏ, క్లాస్‌-2 సూపర్‌వైజర్ల అసోసియేషన్‌, వీఎస్‌ఎస్‌డబ్ల్యూఏ, రిటైర్డ్స్‌ ఎంప్లాయీస్‌ ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఐక్య కార్యాచరణగా ఆవిర్భవించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పీఆర్సీ సాధన సమితి ఆందోళనలకు మద్దతు పలకాలని నిర్ణయించారు. ఎప్పుడైనా బస్సులు నిలుపుదల చేసి సమ్మెకు వెళ్లేందుకు సిద్ధం కావాలని తీర్మానించారు.

------------------------------------------------------------------------------------------

ఉద్యోగుల్లారా మేల్కొనండి.. విజయవాడలో జరిగిన రిలే దీక్షల్లో పిలుపు 

విజయవాడ సిటీ : ‘ఉద్యోగుల్లారా మేల్కొనండి. మన సమస్య లంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. మెరుగైన పీఆర్సీ ఇవ్వమంటే గొంతెమ్మ కోర్కెలు అంటున్నారు. ప్రజలారా మీరైనా చెప్పండి. ఎవరిది న్యాయమో తెలపండి. రెండున్నరేళ్లుగా ఎదుర్కొం టున్న సమస్యలపై సహనం నశించి పోరాడుతున్నాం.’ అంటూ ఉద్యోగ సంఘ నేతలు తమ ఆవేదన తెలిపారు. నగరంలోని ధర్నాచౌక్‌లో ఉద్యోగులు చేపట్టిన రెండోరోజు రిలే నిరాహార దీక్షలు ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ స్ట్రగుల్‌ కమిటీ అగ్రనేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు సంఘాలతో నాలుగు స్తంభాలాట ఆడిందని, ఇక అలాంటి ఆటలు సాగబోవన్నారు. ప్రభుత్వం మన చుట్టూ ఇంటెలిజెన్స్‌, సొంత మనుషులను పంపిందని, కాబట్టి ఉద్యమ సెగ ఏమిటో గట్టిగా తెలియజేయాల న్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ చీకటి జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ జేఏసీ అమరావతి నేత ఈశ్వర్‌  మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు చర్చలకు వచ్చేది లేదని స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా నేత ఏ.విద్యాసాగర్‌ మాట్లాడుతూ ఉద్యోగుల జీతాలు, సమస్యల పట్ల సరైన అవగాహన లేకుండా కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారన్నారు. 


ఇలాంటి విలీనాన్ని కాదు  మేం కోరుకున్నది..

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమంటూ ఉద్యోగుల హక్కులకు భంగం కలిగిస్తున్నారు. కొత్త సమస్యలను సృష్టిస్తున్నారు. ఆర్టీసీ కార్యవర్గాన్ని ఉద్యమం వైపునకు బలవంతంగా నెడుతున్నారు. దశాబ్దాల ఉద్యోగ సంఘాల పోరాటం వల్ల సాధించుకున్న ఎస్‌ఆర్‌బీఎస్‌ పెన్షన్‌ సౌకర్యాన్ని తొలగించడమే కాకుండా ఇతర ప్రయోజనాలను తీసేస్తున్నారు.

- పి.దామోదరరావు, ఈయూ ప్రధాన కార్యదర్శి 


అన్నింటా నష్టమే..

పీటీడీలోకి మారాక పీఆర్సీలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తే అందులో కూడా తీవ్రమైన నష్టం జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు జీతాల మధ్య వ్యత్యాసముంది. ఎలా భర్తీ చేస్తారో తెలియట్లేదు. - వై.శ్రీనివాసరావు, పీటీడీ ఎన్‌ఎంయూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 


సమ్మెకు సన్నద్ధం చేస్తాం..

ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. లేదంటే పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు సమ్మెకు సిద్ధంగా ఉన్నాం. ఫిబ్రవరి 3న ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటాం. 7న సమ్మెను జయప్రదం చేసేందుకు ఉద్యోగులను సన్నద్ధం చేస్తాం. - వైవీ రావు, ఏపీ పీటీడీ, ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు


విలీనంతో కోరి కష్టాలు

పాత పెన్షన్‌ కోసం ప్రభుత్వంలో విలీనాన్ని కోరుకున్నాం. ఆ పరిస్థితి లేకపోగా, సీపీఎస్‌ ఉద్యోగుల పరిస్థితి మాకు ఎదురవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెరుగుతాయని భావించాం. అలా జరగకపోగా, వేతన వ్యత్యాసం మరింత పెరుగుతోంది. - పీవీ రమణారెడ్డి, ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు


సమస్యలు పరిష్కరించాల్సిందే.. 

ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె తప్పదు. విలీనానంతరం అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలను ఎవరూ పరిష్కరించట్లేదు. ప్రభుత్వంపై అసంతృప్తిని చల్లార్చాలంటే మెరుగైన పీఆర్సీతో పాటు ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. - సీహెచ్‌ సుందరయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు


రిటైరైన వారికి పెన్షన్‌ ఏదీ?

ఆర్టీసీలో రిటైరైన వారికి పెన్షన్‌ ఉండదు. ప్రభుత్వంలో విలీనం అయితే పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్‌ వస్తుందని భావిస్తే ఏ పెన్షన్‌ కూడా రావటం లేదు. ఆర్టీసీలో ఉన్నప్పుడు ఉద్యోగుల డబ్బుతో ఏర్పాటు చేసుకున్న పెన్షన్‌ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఉద్యమానికి మేము మద్దతు తెలుపుతున్నాం.

- కేఆర్‌ ఆంజనేయులు, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం



Updated Date - 2022-01-29T06:21:04+05:30 IST