పాశ్చాత్య దేశాల్లో ఉద్యోగుల మహా రాజీనామాలు

ABN , First Publish Date - 2021-11-11T20:41:30+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి వేధింపుల తర్వాత ఇప్పుడిప్పుడే

పాశ్చాత్య దేశాల్లో ఉద్యోగుల మహా రాజీనామాలు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వేధింపుల తర్వాత ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకునే దారిలో ఉందనే నమ్మకం కలుగుతున్న తరుణంలో అమెరికా, యూరోపు దేశాల్లో ఉద్యోగులు పని చేయడానికి ఆసక్తి కనబరచడం లేదు. పని పట్ల వ్యతిరేక ధోరణితో ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్ఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో 4.3 మిలియన్ల మంది ఉద్యోగాల నుంచి తప్పుకున్నారు. అంటే జూలైలో కన్నా ఆగస్టులో రాజీనామాల సంఖ్య  2,42,000 పెరిగింది. గత ఏడాది అమెరికాలో నిరుద్యోగం రేటు తీవ్రంగా కనిపించింది. ఈ ఏడాది ఓ నెలలో ఉద్యోగాలకు రాజీనామాలు 2.9 శాతానికి పెరిగాయి. 


అమెరికన్ సైకాలజిస్ట్ ఆంథోనీ క్లోట్జ్ ఈ పరిణామాలను ‘‘గ్రేట్ రిజిగ్నేషన్’’గా అభివర్ణించారు. పని-జీవితం సమీకరణంలో ప్రాధాన్యాలను రీమ్యాప్ చేసుకోవాలన్నారు. రిటెయిల్, హాస్పిటాలిటీ రంగాల్లోనివారు ఎక్కువగా తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నట్లు వెల్లడైంది. చాలా మంది ఇతర ఉద్యోగాలకు మారేందుకు ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ విద్యా రంగంలో పని చేసేవారు కూడా ఉద్యోగాల నుంచి వైదొలగుతుండటం గమనార్హం. 


ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)లో దాదాపు 40 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో సుమారు 14 మిలియన్ల మంది తమ ఉద్యోగాల నుంచి వైదొలగారు. వీరిని ‘‘నాట్ వర్కింగ్’’, ‘‘నాట్ లుకింగ్ ఫర్ వర్క్’’గా వర్గీకరించారు. మధ్య, తూర్పు యూరోపు దేశాల్లోనూ, జర్మనీలోనూ నైపుణ్యంగల కార్మికులు, ఉద్యోగులు తగ్గిపోయినట్లు ఓ నివేదిక వెల్లడించింది. 


మన దేశంలో సాంఘిక భద్రత, నిరుద్యోగులకు ప్రయోజనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగాలకు రాజీనామాలు చేసే పరిస్థితి లేదు. 


Updated Date - 2021-11-11T20:41:30+05:30 IST