రక్షణ ఏది?

ABN , First Publish Date - 2020-07-09T09:19:08+05:30 IST

నగర నడిబొడ్డున ఉన్న సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా, అధికారులు స్పందించకపోవడం ఉద్యోగులను

రక్షణ ఏది?

సబ్‌కలెక్టరేట్‌లో  ఉద్యోగుల హాహాకారాలు 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నగర నడిబొడ్డున ఉన్న సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా, అధికారులు స్పందించకపోవడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులకు ఒక్కరోజే 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమై ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ చేయాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించడం, తాము హోమ్‌ క్వారంటైన్‌కు వెళతామని ఇతర ఉద్యోగులు విన్నవించుకుంటున్నా అనుమతించకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. 


సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలోని ఏసీ సమావేశ మందిరంలో కొవిడ్‌ కేసులను దృష్టిలో ఉంచుకుని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలూ పనిచేస్తుంది. పాతిక మందికి పైగా ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తుంటారు. వీరంతా కొవిడ్‌ సంబంధిత విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక వైద్యాధికారి, రెవెన్యూ సిబ్బంది, పోలీసుశాఖ సిబ్బందితో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు. మార్చిలో కరోనా కేసులు నమోదవడం మొదలైన నాటి నుంచి ఈ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ పనిచేస్తోంది. ఇటీవల ఇక్కడ ఓ సూపర్‌ వైజర్‌కు కరోనా సోకింది. దీంతో సిబ్బంది తాము హోమ్‌  క్వారంటైన్‌కు వెళతామని కోరారు. ఉద్యోగుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా సోకిన ముగ్గురికి మినహాయింపు ఇచ్చి, మిగిలిన సిబ్బంది విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ఏసీ గదుల్లో విధులు నిర్వహిస్తున్న తమకు వైరస్‌ సోకే ప్రమాదం ఉన్నదని ఉద్యోగులు మొరపెట్టుకున్నా ఉన్నతాధికారులు వినడం లేదు. దీంతో వీరంతా భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు.


తాజాగా సబ్‌ కలెక్టరేట్‌ సముదాయంలో పనిచేసే వారికి ఏకంగా 11 మందికి ఒక్క రోజే పాజిటివ్‌ రావటంతో ఉద్యోగుల్లో మరింత ఆందోళన మొదలయింది. తమకు హోమ్‌ ఐసోలేషన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఉన్నతాధికారులకు విన్నవించుకుంటున్నా ఆమోదించడం లేదని వారు వాపోతున్నారు. ఏసీ కాన్ఫరెన్స్‌ హాల్లో ఒకే చోట భౌతిక దూరం లేకుండా పనిచేస్తున్నందున తమకు వైరస్‌ వేగంగా సోకే ప్రమాదం ఉన్నదని, నగరంలోని విద్యాసంస్థలు ఖాళీగా ఉన్నాయని, ఒక్కో విభాగానికి ఒక్కో చోట పనిచేసే అవకాశం కల్పించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-07-09T09:19:08+05:30 IST