పోరాటానికి సై

ABN , First Publish Date - 2022-01-24T05:11:43+05:30 IST

పీఆర్సీ సాధన సమితి జిల్లాలో సమర శంఖం పూరించింది. ఏలూరులోని ఎన్‌జీవో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉద్యోగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆ మేరకు తీర్మానం చేసింది.

పోరాటానికి సై
ఏలూరు సమావేశంలో ఉద్యోగ సంఘాలు

పీఆర్సీ సాధన సమితి రౌండ్‌  టేబుల్‌ తీర్మానం

ఏలూరులో 50కి పైగా సంఘాల హాజరు

సంఘీభావ ఉద్యమంపై దృష్టి

రేపు ఏలూరులో భారీ ర్యాలీ

27 నుంచి 30 వరకు రిలే దీక్షలు

3న చలో విజయవాడ

6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి..

ఆర్టీసీ, ఆశ, మునిసిపల్‌, పంచాయతీ కార్మికుల భాగస్వామ్యం

ట్రేడ్‌ యూనియన్ల సంపూర్ణ మద్దతు


రివర్స్‌  పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి.. ఇక సమరమే అంటూ పోరుబాటకు సిద్ధమయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. జిల్లాలో ఉన్న 50కి పైగా ఉద్యోగ సంఘాలు ఏలూరులో జరిగిన సమావేశంలో భాగస్వామ్యమయ్యాయి. ప్రభుత్వం దిగి వచ్చేవరకు తగ్గేదేలే అంటూ ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. ప్రభుత్వంలో పనిచేసే అన్ని వర్గాల ఉద్యోగులు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని సమావేశం కోరింది.  కార్మిక సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు వీరికి అండగా నిలిచాయి. 

ఏలూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీ సాధన సమితి జిల్లాలో సమర శంఖం పూరించింది. ఏలూరులోని ఎన్‌జీవో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉద్యోగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆ మేరకు తీర్మానం చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సీపీఎస్‌ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, న్యాయ శాఖ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, పీటీడీ ఉద్యోగులు.. ఇలా ఎన్నో సంఘాల పునరేకీకరణకు రౌండ్‌ టేబుల్‌ వేదికైంది. అంతా ఏకతాటిపై నిలిచి న్యాయ పోరాటానికి పిలుపునిచ్చారు. సమావేశం నినాదాలు, శపథాలతో హోరెత్తింది.  

రేపు ఏలూరులో భారీ ప్రదర్శన

జిల్లాలోని ఉద్యోగులందరితో కలిసి ఈనెల 25న ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించింది. ‘ఆఫీసుల్లో నిల్‌ అటెండెన్స్‌.. ఆందోళనలో ఫుల్‌ అటెండెన్స్‌’ అనే నినాదాన్ని అమలు చేయాలని పిలుపు నిచ్చింది.  ప్రభుత్వం ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తోందని, అలాంటి సమయంలో ప్రతి ఉద్యోగి ఒక నాయకుడై ఉద్యమాన్ని విజయవంతం చేసుకోవాలని, క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని తలపించేలా ఉప్పెనలా ఉద్యోగులు కదలాలని సమావేశం నిర్ణయించింది. ఈనెల 27 నుంచి 30 వరకూ రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని తీర్మానించింది. వచ్చే నెల 3న జరిగే చలో విజయవాడలో వేలాది మంది ఉద్యోగులు పాల్గొనాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లాలని సూచించింది. వేతనాల పెంపుపై అసత్యాలను ప్రచారం చేస్తూ సచివాలయాలకు  ప్రభుత్వం పంపిన 17 పేజీల కరపత్రాన్ని దీటుగా ఎదుర్కొని ఉద్యోగ సంఘాలు తిప్పికొట్టాలని సమావేశం తీర్మానించింది. కొత్త పీఆర్సీ ప్రకారం వచ్చే వేతనాలను ఉద్యోగులు తిరస్కరించాలని సమావేశం నిర్ణయించింది. కొత్త పీఆర్సీ ప్రకారం వేతన బిల్లులు పంపకూడదని డ్రాయింగ్‌ అధికారులను సమావేశం కోరింది. పంపిన బిల్లులను వెనక్కి తీసుకోవాలని సూచించింది. ట్రెజరీ ఉద్యోగులు బిల్లులను చేయకూడదని సమావేశం తీర్మానించింది. 


సమస్తం స్తంభించిపోయేలా..

జిల్లాలో సమస్తం స్తంభించిపోయేలా ఉద్యమాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సచివాలయ, కాంట్రాక్టు,  ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ ప్రాతిపదికన వారిని కూడా ఉద్యమంలో భాగస్వాములను చేసుకుంది. జిల్లా ఉద్యోగుల్లో సగభాగంగా ఉన్న సీపీఎస్‌ ఉద్యోగులను ముందు భాగానికి తెచ్చింది. పీఆర్సీ ఉద్యమానికి అండగా  బలమైన సంఘీభావ ఉద్యమాన్ని  నిర్మించాలని సమావేశం తీర్మానించింది. జిల్లాలోని ఆశ, అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్‌, పంచాయతీ పారిశుధ్య కార్మికులు, ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల మద్ధతును కూడగట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు వారందరినీ కూడా సమ్మెలో భాగస్వామ్యులను కావాలని కోరింది. ఏఐటీయూసీ, సీఐటీయూ వంటి ట్రేడ్‌ యూనియన్ల మద్ధతు కోరింది. అయితే ఇప్పటికే పారిశుధ్య కార్మికులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగస్వామ్య మయ్యేందుకు నోటీసులు సిద్ధం చేసుకున్నారు. న్యాయ శాఖ ఉద్యోగులు ఇప్పటికే మద్ధతు ప్రకటించారు. ఏఐటీయూసీ నేత బండి వెంకటేశ్వర్లు, సీఐటీయూ నేత సోమయ్యలు ఉద్యమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించాయి. 



  ఉద్యోగులు శపిస్తున్నారు

రివర్స్‌ పీఆర్సీ ఉద్యోగులందరినీ ఏకం చేసింది. కానీ ఐఏఎస్‌ అధికారులు మాకు ద్రోహం చేస్తున్నారు. వీలైతే మేలు చేయండి. ద్రోహం చేయకండి. మా మీదకి పోలీసులను పంపుతోంది. రేపు వారి మీదకి సైన్యాన్ని పంపుతుందా? ఉద్యోగులు శపిస్తున్నారు. 2024 కోసం ఎదురు చూస్తున్నారు. దాన్ని ఆపే శక్తి సంఘాలకు లేదు. మీరే తేల్చుకోండి 

– విద్యాసాగర్‌, ప్రభుత్వోద్యోగుల సంఘం


 1700 కోట్ల హెచ్‌ఆర్‌ఏ అమలు చేయండి

ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా మరో రత్నం కింద ఉద్యోగులకు 1700 కోట్ల రూపాయలతో హెచ్‌ఆర్‌ఏ స్కీమ్‌ను అమలు చేయాలి. ఎందుకంటే మేం కూడా ప్రజల్లో భాగమే..రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులు, గత 10 పీఆర్సీల్లో సాధించుకున్న ప్రయోజనాలను రాబట్టుకోవడానికే మా పోరాటం. 

– సీహెచ్‌ శ్రీనివాసరావు, ఏపీజేఏసీ



  సీపీఎస్‌ ఉద్యోగులు ముందు నిలవాలి

రాష్ట్ర ఉద్యోగుల్లో సగం మంది సీపీఎస్‌ ఉద్యోగులే. వారు ఉద్యమం లో ముందు భాగానికి రావాలి. ఉద్యమాన్ని ఏకతాటిపై నడపాలి. లేదంటే ఇప్పటి వరకూ సాధించుకున్న ప్రయోజనాలు   అన్నీ కోల్పోతాం. 

– షేక్‌ ముస్తఫా అలీ, యూటీఎఫ్‌


  అరెస్టులకు జంకేదే లేదు

ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని నిలువరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి జంకేదే లేదు. నాయకులను ముందస్తుగా అరెస్టు చేసినా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. ఉద్యోగులే నాయకులుగా ముందుకు వచ్చిన ఉద్యమం ఇది. 

– రమేశ్‌, ఏపీజేఏసీ అమరావతి


  త్రిశంకు స్వర్గంలో ఉన్నాం

ఆర్టీసీ విలీనం మమ్మల్ని త్రిశంకు స్వర్గంలోకి నెట్టింది. మా పరిస్థితి ఏమిటో మాకే తెలియని గందరగోళంలోకి నెట్టింది ఈ ప్రభుత్వం. రెండింటికి చెడ్డ రేవడిలా ఉంది మా పరిస్థితి. పీఆర్సీ ఉద్యమానికి మేమూ తోడుంటాం. 

– రాంబాబు, పీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌


  రెగ్యులర్‌ అయ్యేవరకు ఉద్యమం

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. పీఆర్సీ మాకు వర్తిస్తుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. పీఆర్సీ జీవోలో సబ్‌ క్లాజుల్లో చిన్న చిన్న అక్షరాలతో మమ్మల్ని గందరగోళ పరుస్తోంది. మా ఉద్యోగాలను రెగ్యులర్‌ చేసి, స్కేలు ప్రకారం వేతనాలు ఇచ్చే వరకూ ఉద్యమం ఆగదు.

– కెనడీ ప్రసాద్‌, సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌


  మేలు చేస్తాడనుకుంటే.. కీడు పరిస్థితి

ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎంతో మేలు చేస్తాడని భావించాం. మేలు చేయకపోయినా పర్వాలేదు. కానీ కీడు చేసే పరిస్థితి ఉండకూడదు. పీఆర్సీ కోసం చేసే న్యాయ పోరాటంలో మేమూ కలిసి నడుస్తాం.

– బెన్ని, రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు


   పరీక్షల పేరుతో నాటకాలు

రెండేళ్ల ప్రొబేషన్‌ పిరియడ్‌ పూర్తయ్యాక ప్రభుత్వం కొత్త నాటకం మొదలు పెట్టింది. ఇప్పుడు పరీక్షలు పెట్టి అవి ఉత్తీర్ణత అయితేనే రెగ్యులర్‌ చేస్తానంటోంది. ఈ విష యం ముందుగా ఎందుకు చెప్పలేదు ? తక్షణం మమ్మల్ని రెగ్యులర్‌ చేయాలి. పరీక్షలు రద్దు చేయాలి.

– శ్రీలక్ష్మి, ఏఎన్‌ఎం ఉద్యోగుల సంఘం


  మేం కూడా ఉద్యమంలోనే..

పీఆర్సీ పేరుతో ఉద్యోగులను వంచించిన ప్రభుత్వం ఉద్యోగులందరినీ ఏకం చేసింది. పీఆర్సీ సాధన సమితి చేసే ఉద్య మంలో  న్యాయ శాఖ ఉద్యోగులు కూడా మమేకమవ ుతున్నాం. ఎంతటి పోరాటానికైనా సిద్ధం

– మాదిరెడ్డి రాము, ఏపీ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం


Updated Date - 2022-01-24T05:11:43+05:30 IST