Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేటి నుంచే జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళన

భానుగుడి(కాకినాడ), డిసెంబరు 6: ఉద్యోగులు వివిధ డిమాండ్ల సాధనకు మంగళవారం నుంచి ఆందోళన బాట పట్టనున్నారు. ఈ మేరకు  ఏపీ జేఏసీ- ఏపీ జేఏసీ అమరావతి సంయుక్తంగా సోమవారం కాకినాడ రెవెన్యూ అసోసియేషన్‌ భవన్‌లో సమావేశం నిర్వహించాయి.  ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్‌ గుద్దాటి రామ్మోహన్‌రావు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ పి.త్రినాథరావు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెలలో మొదటి రెండు రోజుల్లో అందుకోవాల్సిన జీతాలు, పెన్షన్లు సకాలంలో పొందలేని పరిస్థితి నెలకొందన్నారు. డీఏలు పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తానని ఇచ్చిన హామీ గాలిలోనే పెట్టారన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా వేధించడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పొందాల్సిన రాయితీలను ఆర్టీసీ ఉద్యోగులు నేటికీ పొందడం లేదన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు ప్రారంభమవుతాయన్నారు. 7వ తేదీ నుంచి 9 వరకు నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు విధులకు హాజరవుతారన్నారు. 10 నుంచి మధ్యాహ్న భోజన విరామ సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ డిపోల ఎదురుగా నిరసన, 13 నుంచి తాలూకా కేంద్రాలలొ ర్యాలీలు, ప్రదర్శనలు, సమావేశాలు, 16న తాలూకా కేంద్రాల వద్ద మధ్నాహ్నం 2గంటల వరకూ ఽధర్నా, 21న జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకూ ధర్నా, 2022 జనవరి 3న ఏలూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తామన్నారు. ఏపీ జేఏసీ జనరల్‌ సెక్రటరీ ఎన్‌వీఎస్‌ఎస్‌ఆర్‌కే దుర్గాప్రసాద్‌, గెజిటెడ్‌ అధికారుల రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడు వర్మ, ఏపీఎన్‌జీవో అసోసియేషన్‌ జిల్లా సెక్రటరీ పాలపర్తి మూర్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement