అదరం.. బెదరం!

ABN , First Publish Date - 2022-01-26T07:06:51+05:30 IST

‘మీరు బెదిరిస్తే మేము బెదరం. పోరాటంలోకి దిగామంటే సాధించే వరకూ విశ్రమించం.

అదరం.. బెదరం!
చీకటి పీఆర్సీని రద్దు చేయాలనే ప్ల కార్డులతో ఆయా సంఘాల నేతలు

ఒక్కసారి మా ఉద్యమ చరిత్రను తెలుసుకోండి

ప్రజలకు, ఉద్యోగులకు నడుమ అగాధం సృష్టించొద్దు 

మీ కాకి లెక్కలు వద్దు.. వాస్తవాలు చెప్పండి 

అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే సహించేది లేదు

మహా ధర్నాలో ఉద్యోగ సంఘాల నేతల ఆగ్రహం


‘మీరు బెదిరిస్తే మేము బెదరం. పోరాటంలోకి దిగామంటే సాధించే వరకూ విశ్రమించం. ప్రజలకు, ఉద్యోగులకు నడుమ అగాఽఽధం సృష్టించి పబ్బం గడుపుకోవాలనుకోవద్దు. ఆదాయం లేదని, మాకు జీతాలుగా పంచేస్తున్నామని వంచన చేయొద్దు. కాకి లెక్కలు కాదు. వాస్తవ లెక్కలు తీయండి. మౌనంగా ఉన్నామని మా హక్కులనే కాలరాస్తారా? మీరు అరెస్టులు చేస్తామన్నా భయపడం.. ఉద్యోగాల నుంచి తొలగించినా ఉద్యమం ఆపుతామనుకోకండి..’ అంటూ మంగళవారం విజయవాడలో జరిగిన మహాధర్నాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు గర్జించారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడలో ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా నేతృత్వంలో మంగళవారం విజయవాడ ధర్నాచౌక్‌ ఆవరణలో మహాధర్నా జరిగింది. ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు విద్యాసాగర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూటీఎఫ్‌  అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, పెండింగ్‌ లేకుండా డీఏలు, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు - అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల క్రమబద్ధీకరణ చేస్తామని హామీలు ఇచ్చి, అమలు చేయాలని గుర్తుచేస్తే బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు, మంత్రి ఉద్యోగులను బెదిరిస్తున్నారని బెదరటానికి తాము సిద్ధంగా లేమన్నారు. ప్రజలకు, ఉద్యోగులకు మధ్య అగాధం సృష్టించి పబ్బం గడుపుకునే ఆలోచనను ప్రభుత్వం చేస్తోందన్నారు. 


 రాష్ట్ర ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు పాండురంగ వర ప్రసాద్‌ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం గురించి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు చెప్పవలసిన అవసరం లేదన్నారు. ఎవరిది ప్రజాస్వామ్యమో, ఎవరిది అప్రజాస్వామికమో ప్రజలు గుర్తించాలన్నారు. ఎన్జీవో నేత విద్యాసాగర్‌ మాట్లాడుతూ పీఆర్సీలో ఫిట్‌మెంట్‌ మొదలు, హెచ్‌ఆర్‌ఏ స్లాబులు రద్దు, సీసీఏ రద్దు వంటివన్నీ చేశాక .. పదేళ్ళకోసారి పీఆర్సీ అంటే ఉద్యోగుల వేతనాలు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. పీఆర్సీ జీవోలను బలవంతంగా అమలు చేయటానికి డీడీవోల మీద ఒత్తిడి తెస్తున్నారని, వారు చేయటం లేదని ట్రెజరరీ ఉద్యోగుల మీద ఒత్తిడి పెంచారని, వారూ చేయటం లేదని పే అండ్‌ అక్కౌంట్స్‌ ఉద్యోగుల మీద ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు వారు కూడా చేయమనేసరికి చివరికి తామే చేసుకుంటామనే పరిస్థితికి వచ్చిందన్నారు. 


 సీఐటీయూ రాష్ట్ర నాయకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం సక్రమంగా పీఆర్సీలు ఇస్తే ఉద్యోగులు 13వ పీఆర్సీ అందుకునే  వారని, రెండు పీఆర్సీలను కోల్పోయారని తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేసింది ఉద్యోగులు కాదా? అని ప్రశ్నించారు. ఒక్కసారి ఉద్యమ చరిత్ర పేజీలను తిరగేయాలని సూచించారు. రాష్ట్ర ఏఐటీయూసీ  నాయకుడు రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం కోరుకున్న దాని కంటే ఎక్కువ చేస్తుందని ఆశిస్తే.. అందుకు భిన్నంగా కోతలు పెడుతోందన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 29న తాము తలపెట్టే కార్యక్రమాల్లో ఉద్యోగులంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఆల్‌రౌండ్‌ అటాక్‌ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాధించుకున్న హక్కుల మీద దాడి చేసిందన్నారు. ఉద్యోగులు సంఘటితంగా కదలాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు నాగసాయి మాట్లాడుతూ, సమ్మెకు వెళ్లకముందే ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలన్నారు. ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దాసు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేస్తారా? గద్దె దిగుతారా? అని ప్రశ్నించారు. 


మచిలీపట్నంలో కదంతొక్కిన ఉద్యోగులు

మచిలీపట్నం టౌన్‌, జనవరి 25 : పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీవోలను రద్దు చేసేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తూర్పు కృష్ణా జేఏసీ, అమరావతి జేఏసీ, ఫ్యాప్టోతో పాటు పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మంగళవారం ఆర్టీసీ బస్‌స్టాండ్‌ నుంచి ధర్నా చౌక్‌ వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు భ్యారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని చీకటి జీవోలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. 



Updated Date - 2022-01-26T07:06:51+05:30 IST