Advertisement
Advertisement
Abn logo
Advertisement

విధులకు అతిథులు.. కాలానికి అతీతులు

సమయపాలన పాటించని మర్రిపూడి రెవెన్యూ అధికారులు

అవస్థలలో గ్రామీణ ప్రజలు 

మర్రిపూడి, నవంబరు 26 : మండల కార్యాలయంలో కీలకమైన రెవెన్యూశాఖలో అధికారుల పనితీరు అస్తవ్యస్తంగా మారింది. విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వం అవసరార్థులను ఇబ్బందులపాలు చేస్తోంది. దీనికితోడు రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేకపోవడంతో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఎవరికి వారే యమునాతీరు అన్న చందంగా మారింది. ముఖ్యంగా వీఆర్వోలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు వారి కోసం మండల కేంద్రానికి పరుగులు పెడుతు న్నారు. తీరా వ్యయప్రయాసలకోర్చి మండల కేంద్రానికి చేరుకున్నప్పటికీ వీఆర్వోలు కనిపించక ప్రజలు ఉసూరుమని తిరిగి వెళుతున్నారు.

తహసీల్దార్‌ సువర్ణరావును బదిలీ చేసి ఏడాది దాటినప్పటికీ రెగ్యులర్‌ తహసీల్దార్‌ని నియమించలేదు. రెవెన్యూకు సంబంధించి చిన్నచిన్న పనులు కూడా జరగక అవసరార్థులు అవస్థలు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. కొంతమంది వీఆర్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో అటెండర్‌ పోస్టులు రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. వీఆర్‌ఏలను రోజువారి అటెండర్‌ విధులకు వినియోగించుకుంటున్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం ఒకరు మాత్రమే ఉన్నారు. తహసీల్దార్‌ లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్‌పైనే కార్యాలయ పనిభారమంతా పడింది. ప్రతి చిన్నపనికి ఇన్‌చార్జి తహసీల్దార్‌గా ఉన్న కొండపి తహసీల్దార్‌ వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తుంది. మరణ ధ్రువీకరణ పత్రం కోసం 20రోజులపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని కాకర్లకు చెందిన ఓ రైౖతు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం 11.20 నిమిషాల వరకు కార్యాలయానికి ఎవరు రాకపోవడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు సిబ్బంది లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగి వెళ్లడం పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది కొరతను తీర్చడంతో పాటు అధికారుల పనితీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement