సీఎం సహాయ నిధికి ఉద్యోగుల విరాళం

ABN , First Publish Date - 2020-03-27T09:01:21+05:30 IST

రోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ఉద్యోగ సంఘాలు తమ ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా అందిస్తూ...

సీఎం సహాయ నిధికి ఉద్యోగుల విరాళం

  • ముఖ్యమంత్రిని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు
  • 1.08 కోట్లు ఇచ్చిన సీపీడీసీఎల్‌ ఉద్యోగులు

అమరావతి, విజయవాడ, గుంటూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కరోనా  వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ఉద్యోగ సంఘాలు తమ ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా అందిస్తూ ప్రభుత్వానికి బాసటగా నిలిచాయి. ఈ మేరకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు సీఎం జగన్మోహన్‌రెడ్డిని గురువారం కలిశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులంతా ఒక్కరోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్టు లేఖ అందించారు. ఉద్యోగుల ఒక్కరోజు వేతనం సుమారు రూ.100 కోట్లు ఉంటుంది.


సీఎంను కలిసిన వారిలో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేత వైవీరావు, రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ సంఘం నేత సోమేశ్వరరావు ఉన్నారు. సీపీడీసీఎల్‌ ఉద్యోగులు కూడా ఉదారత  చాటారు. ఒక రోజు మూలవేతనం మొత్తం రూ.1.08 కోట్లను సీఎం సహాయ నిధికి అందజేశారు. ఏపీఎ్‌సపీడీసీఎల్‌ ఉద్యోగులు రూ.3.8కోట్లు ఇచ్చారు. తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ఏపీ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోన దేవదాసు, ప్రధాన కార్యదర్శి కొమ్మా శివశంకర ప్రసాద్‌, మధుసూదనరాజు తెలిపారు.

Updated Date - 2020-03-27T09:01:21+05:30 IST