సీపీఎస్‌పై తూచ్‌

ABN , First Publish Date - 2022-05-25T08:08:06+05:30 IST

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) అమలుపై వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసింది.

సీపీఎస్‌పై తూచ్‌

దానిని రద్దు చేయలేం: సర్కారు

ఆర్థికంగా ఓపీఎస్‌ పెనుభారం

ఉద్యోగులకు ‘జీపీఎస్‌ ది బెస్ట్‌’ 

ఉద్యోగ సంఘాల నేతలకు తేల్చి చెప్పిన మంత్రుల కమిటీ

సీపీఎస్‌ రద్దు.. జీపీఎస్‌ వద్దు

సంఘాల నేతల ఉడుం పట్టు

జీపీఎస్‌ అంటే చర్చలకే రాం

ఓపీఎ్‌సపై అధ్యయనానికి సూచన

మూడు గంటల సుదీర్ఘ చర్చలు

ఎటూ తేలకుండానే భేటీ ముగింపు.. ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల ఫైర్‌


అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) అమలుపై వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. అదేసమయంలో పాత పింఛన్‌ స్కీం(ఓపీఎస్‌) అమలు చేస్తే సర్కారుపై పెనుభారం పడుతుందని తేల్చి చెప్పింది. ఇక, ఆది నుంచి సర్కారు చెబుతున్న ప్రభుత్వ పింఛన్‌ స్కీం(జీపీఎ్‌స)కు ఒప్పుకోవాలని ఉద్యోగులపై ఒత్తిడి తేవడం ప్రారంభించింది. మంగళవారం సచివాలయంలో సీపీఎ్‌సపై ఉద్యోగ సంఘాలతో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు సుదీర్ఘంగా చర్చించారు. అయితే.. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు సీపీఎస్‌ రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. కానీ, ఈ మంత్రుల కమిటీ.. మాత్రం జీపీఎ్‌సకే మొగ్గుచూపాలని తేల్చి చెప్పింది. దీంతో సుదీర్ఘంగా జరిగిన సమావేశం ఏమీ తేల్చకుండానే ముగిసింది. సమావేశం అనంతరం బయటకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘జీపీఎస్‌ ది బెస్ట్‌’ అని మేం అనుకుంటున్నాం’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఉద్యోగులు, సంఘాల నాయకులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. 


ఆరంభం నుంచి అదే పట్టు!

ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ప్రారంభం నుంచి జీపీఎ్‌సపైనే మంత్రులు, సలహాదారు పట్టుబట్టారు. ‘‘గత సమావేశంలో జీపీఎ్‌సపై పీపీటీ ఇచ్చాం కదా? అభిప్రాయాలు చెప్పండి’’ అని ఉద్యోగ సంఘాల నేతలను మంత్రులు కోరారు. అయితే, ఏ ఒక్క సంఘం కూడా జీపీఎ్‌సపై అభిప్రాయం చెప్పేందుకు ముందుకు రాలేదు. అంతేకాదు, జీపీఎ్‌సపై చర్చించేందుకు తమను పిలవొద్దని కుండబద్దలు కొట్టారు. సీపీఎ్‌సలో ఉన్న లోపాలు.. భారాలు అన్నీ జీపీఎ్‌సలో ఉన్నాయన్నారు. జీపీఎ్‌సపై అధ్యయనం చేసినట్లు ఓపీఎ్‌సపై అధ్యయనం చేసి, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో రావాలని మంత్రుల కమిటీకి ఉద్యోగ సంఘాల నేతలు సూచించారు. 


ఆ రాష్ట్రాల్లో ఎలా సాధ్యం?

‘రాజస్థాన్‌ ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు చేసిందని అక్కడ సాధ్యమైంది ఏపీలో ఎందుకు కాద’ని ఉద్యోగ సంఘాల నేతలు మంత్రుల కమిటీని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా మంత్రుల కమిటీ.. ఓపీఎస్‌ ఆర్థిక భారమని, జీపీఎ్‌సలో మార్పులు, చేర్పులు సూచించాలని ఒత్తిడి తెచ్చినా ఉద్యోగ సంఘాల నేతలు ససేమిరా అన్నారు. అవసరమైతే ఓపీఎ్‌సపై చర్చ పెట్టాలని డిమాండ్‌ చేసినట్టు సమాచారం.  తాము ఓపీఎ్‌సపై కూడా స్టడీ చేశామని.. ఎన్‌ఎ్‌సడీఎల్‌లో ఇప్పటివరకు ఉన్న డబ్బులు వెనక్కి రావని ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్‌ తెలిపారు. తాము దాచుకున్న డబ్బు ఎందుకు వెనక్కి రాదని సంఘాల నేతలు ప్రశ్నించారు. 


సంఘాల్లో కట్టుబాటు

పీఆర్సీ విషయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని సంఘాల నేతలపై ఉద్యోగ, ఉపాధ్యాయులకు నమ్మకం సన్నగిల్లింది. సీపీఎ్‌సపై కూడా ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గితే ఉద్యోగుల్లో తమపై పూర్తి వ్యతిరేకత వస్తుందని గ్రహించిన సంఘాల నేతలు సీపీఎస్‌ రద్దుపై ఒకేతాటిపైకి వచ్చారు.  సీపీఎస్‌ రద్దు ఓపీఎస్‌ పునరుద్ధరణకు ముక్తకంఠంతో పట్టుబట్టారు. ఇదిలావుంటే, సమస్య సీపీఎస్‌ ఉద్యోగులదని.. దీనిపై పోరాటం చేసే సంఘాలకు ఆహ్వానం పంపకుండా సమావేశాలు నిర్వహించడం దారుణమని మరికొందరు వ్యాఖ్యానించారు.   


ఉద్యోగులను ఒప్పిస్తాం: సజ్జల 

సీపీఎ్‌సను రద్దు చేస్తామని వైసీపీ హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే సీపీఎస్‌ వల్ల నష్టం జరిగే అవకాశం ఉన్నందున జీపీఎ్‌సను ప్రతిపాదించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మంగళవారం ఉద్యోగ సంఘాలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జీపీఎ్‌సపై ఉద్యోగ సంఘాలతో చర్చించామని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఆలోచించాలని కోరామని చెప్పారు. జీపీఎ్‌సపై ఉద్యోగులను ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. సీపీఎస్‌ రద్దు వల్ల ఇప్పటికప్పుడు ప్రభుత్వంపై భారం ఉండదని, 30-40 ఏళ్ల తర్వాత భారం పడుతుందన్నారు. కానీ, ఓపీఎ్‌సతో ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుందని తెలిపారు. భవిష్యత్‌ గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే.. సమస్య వస్తుందనే సీఎం ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆదాయం పెరిగే పరిస్థితి లేదని చెప్పారు. ఈ విషయాన్ని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని కోరారు. జీపీఎ్‌సలో అదనపు ప్రయోజనాలు కావాలంటే పరిశీలిస్తామన్నారు.  

Updated Date - 2022-05-25T08:08:06+05:30 IST