ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఎంతకైనా ఉద్యమిస్తాం..

ABN , First Publish Date - 2021-12-06T04:47:06+05:30 IST

ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఎంతకైనా ఉద్యమిస్తామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథ్‌ ప్రకటించారు.

ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఎంతకైనా ఉద్యమిస్తాం..
సమావేశంలో రెవిన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు త్రినాధ్‌, నాయకులు

రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు త్రినాథ్‌
కాకినాడ సిటీ, డిసెంబరు 5: ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఎంతకైనా ఉద్యమిస్తామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథ్‌ ప్రకటించారు. ముద్దాడ రవిచంద్ర రెవెన్యూ భవన్‌లో ఆదివారం ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు త్రినాథ్‌ అధ్యక్షత వహించగా పలు అంశాలపై విస్తృతంగా చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. పీఆర్‌సీ, డీఏ తదితర అంశాలపై ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి సంయుక్తంగా ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను అందరూ ఉద్యోగులు తు.చ. తప్పకుండా పాటించాలని తీర్మానించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని తీర్మానం చేశారు. 10వ తేదీ మధ్యాహ్నం భోజన సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా డివిజన్‌, జిల్లా కేంద్రాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, సమావేశాలు జరపాలన్నారు. 16వ తేదీన తాలూకా కేంద్రాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా, 21వ తేదీన జిల్లా కేంద్రంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2022 సంవత్సరం జనవరి 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని తీర్మానించారు.   ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రసాద్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు గోపాలకృష్ణ, కోశాధికారి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు శెట్టి, విజయకుమార్‌, సంయుక్త కార్యదర్శులు సత్యవేణి, వీరబాబు, కలెక్టరేట్‌ అధ్యక్షుడు సూరిబాబు, కాకినాడ డివిజన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T04:47:06+05:30 IST