Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఉద్యోగులందు సద్యోగులు వేరయా!

twitter-iconwatsapp-iconfb-icon
ఉద్యోగులందు సద్యోగులు వేరయా!

ఒకడీఈఓ నిర్లక్ష్య ధోరణి గురించి చెప్తాను. ఈ మధ్య మా నియోజకవర్గంలోని ఒక యువ బృందం ఎంతో ఉత్సాహంతో ఒక ప్రాజెక్టును నా దగ్గరికి తీసుకొని వచ్చారు. సాఫ్ట్‌వేర్ నిపుణులైన వారు దాదాపు ఆరు నెలలు కష్టపడి ఒక ఆన్‍లైన్ టీచింగ్ సాఫ్ట్‌వేర్ యాప్ తయారు చేశారు. వారు తయారు చేసిన ఈ యాప్, ఆన్లైన్ టీచింగ్ సాఫ్ట్‌‌వేర్ సులభతరంగా ఉన్నవో లేవో తెలుసుకోవాలన్నది వారి కోరిక. ఈ పరీక్షకు గాను ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల దగ్గర అవసరమయ్యే సాంకేతికత అంతటినీ తామే భరిస్తామనీ, కేవలం ఆ యాప్ యోగ్యత తమకు తెలిస్తే చాలని విజ్ఞప్తి చేశారు. ఇదంతా ఆ బృందంలోని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి నాకు వివరించాడు. ఉద్యోగం వదిలి పెట్టి, ఉన్న రెండెకరాల్లో కొంత అమ్మి, ఈ సాఫ్ట్‌‍వేర్ తయారు చేసాడు. నేను మా బోనగిరి పార్లమెంట్ పరిధిలోని ఒక డీఈఓ గారికి ‘ఏమైనా సహాయం చేయగలరా’ అని ఫోన్ చేశా. ఆయన రెండు మూడు రోజులు ఫోన్ ఎత్తలేదు. తదుపరి నేను స్థానిక కలెక్టరుకు ఇదే విషయం చెప్తే, వారు వెంటనే సదరు డీఈఓకు చెప్పారు. అప్పుడు ఫోన్ చేస్తే ఎత్తారు. ‘‘మీ ఫోన్ నెంబరు నా దగ్గర లేదండి’’ అని చెప్పి, ఆ పిల్లవాడిని పంపమన్నారు. అప్పటికే ఆ యువకుడు ఆ డీఈఓ దగ్గరికి కనీసం ఐదారుసార్లు వెళ్ళాడట. ఆ అబ్బాయి చెప్పిన విషయం, ‘‘సార్ నేను ఒకరోజు ఉదయం 11గంటలకు వెళ్లాను, డీఈఓ రూములోనే ఉన్నారు, ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు, మధ్యాహ్నం 3–4 గంటల సమయంలో కేవలం 2 నిముషాలు టైం నాకు ఇచ్చారు. అప్పటివరకు లాప్‍టాప్ పట్టుకొని 6 గంటలు రూమ్ బయటనే కూర్చున్నాను’’ అని వాపోయాడు. అప్పటికీ స్పందన సరిగ్గా లేకపోయేసరికి ఎడ్యుకేషన్ కమిషనర్‌కు చెబితే, వారి స్పందనా అంతంతమాత్రమే.


ఒక కలెక్టరు చిత్తశుద్ధి గురించి చెప్తాను. మా మిత్రులకు ఒక విచిత్రమైన భూమి సమస్య ఉంది. ఆ ఊరిలో పాత సర్వే నంబర్లు మారి కొత్త సర్వే నంబర్లు వచ్చాయి. ఆ పాత సర్వే నెంబరుకు, ఈ కొత్త సర్వే నెంబరుకు మధ్య లింక్ మిస్ అయింది. అదేవిధంగా ఆ ఉరి భూమి గుర్తింపు పట్టా(నక్ష) మొత్తం మిస్ అయింది. నాకు ఉద్యమకాలం నుంచి పరిచయం ఉన్న ఒక కలెక్టరుకు ఈ సమస్య తెలియచేశాను. మా మిత్రులను అక్కడికి పంపించాను. వారు మూణ్ణాలుగు నెలలు కష్టపడి, సీసీఎల్ఏ నుంచి, ఇతర డిపార్టుమెంట్ల నుంచి మ్యాపులు తెప్పించి, క్రోడీకరించి, ఆ ఉరికి సరైన నక్ష తయారు చేపించి, ఆ ఉరి సమస్య తీర్చారు. వారు ఒక్కటే మాటన్నారు– ‘‘ఒక ఉరికి రెవిన్యూ నక్ష లేదంటే అది మా మొత్తం డిపార్టుమెంటు సమర్థతకే చెడ్డ పేరు తెస్తుంది. అది మీ మిత్రుల సమస్య కాదు, ప్రభుత్వ సమస్య’’. ఇలా చెప్పటమే కాదు, చేసి చూపించారు. ఒక్క రూపాయి ఖర్చు లేదు.


ఒక సెక్రటరీ ‘సార్డోనిక్ ఫేస్’ గురించి చెప్తాను. ప్రజలతో బాగా సంబంధం ఉండే ఒక డిపార్టుమెంటు సెక్రటరీకి నేను ఒక సమస్య మీద ఫోన్ చేశాను. వారు మాట్లాడే తీరు ‘‘ఎస్ – చెప్పు – ఓకే’’ ఇలా ఉంది. మాట తీరులో మర్యాద లేదు, ఒక ఉన్నత అధికారి భాషలో ఉండాల్సిన రిఫైన్మెంటు లేదు. సమస్య మీద స్పందన తర్వాత గానీ, ఏదో నాతో మాట్లాడితేనే వారి ఆస్తి అంతా నాకు రాసి ఇస్తున్నట్లు ఉంది వ్యవహారం. ఇక ఈ విషయాన్ని ఆ విభాగ మంత్రికి చెపుకున్నాను. ఆయన ‘‘అన్న అనుభవించక తప్పదు. సార్ దగ్గర అతి వినయం చూబెడతాడు. తాను చాల స్ట్రిక్ట్ అన్న బిల్డప్ ఇస్తాడు. బయట అందరికీ చుక్కలు చూపెడతాడు’’ అని వారి బాధ వారు చెప్పుకున్నారు. మా మెడికల్ భాషలో ఆ సెక్రటరీ ముఖాన్ని ‘సార్డోనిక్ ఫేస్’ అంటారు. 


ఒక రిజిస్ట్రార్ ఉద్యోగ దక్షత గురించి చెప్తాను. ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సందర్బంగా హైదరాబాదులోని ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లాను. ఆఫీసు దగ్గర అన్నీ ఇరుకైన వీధులు, కారు కూడా వెళ్లలేదు. చిన్నప్పుడు మోరీలు, నీటి గుంటల మీద నుంచి దూకినట్లు దూకి పోవాలి. ఆఫీసు మొదటి అంతస్తులో ఉంది. ఇరుకైన మెట్లు, చుట్టూ దుర్గంధం, ఎవరైనా బాత్రూంకి వెళ్తే మూత్రకోశ ఇన్ఫెక్షన్ ఖాయం. లోపల గుడ్డి లైట్స్, ఫిష్ మార్కెట్లో ఉన్నట్లు ఒకళ్ళను ఆనుకొని ఒకళ్ళు నిలబడాలి. పైగా కరోనా భయం! మొత్తానికి పని ముగించుకొని, ఆ రిజిస్ట్రారుతో మాట ముచ్చట పెట్టాను: ‘‘ఎంతో ఆదాయం వచ్చే ఆఫీసు కదా– ఒక విశాలమైన ప్లేసు, మంచి కుర్చీలు, ఒక ఏసీ రూమ్, ఒక క్యాఫీటేరియా ఉండేటట్లు ప్లాన్ చేయొచ్చుగా? అలా చేస్తే అటు కొందరికి ఉపాధి కల్పించినవారమవుతాం, ఇటు వచ్చిన కస్టమర్లకు మంచి వాతావరణం కల్పించనవారమూ అవుతాం’’ అని సలహా ఇచ్చాను. తర్వాత ఎప్పుడో ఒకసారి రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి అంతా మారిపోయింది. ఆ రిజిస్ట్రారే చొరవ తీసుకొని, కొంత దూరమైనా ఒక విశాలమైన ప్రదేశమూ, డాక్యుమెంట్ రైటర్స్‌కు ఏసీ గదులు, వెయిటింగ్ హాల్స్, స్నాక్స్, కాఫీ బార్... అన్నీ ఏర్పాటు చేసాడు. విశాలమైన పార్కింగ్ స్థలం కూడా ఉంది.


ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ (రిటైర్డ్) బాధ్యతారాహిత్యం గురించి చెప్తాను. ఒక ప్రత్యేకమైన సమస్య వల్ల ఆయన్ను కలవాల్సి వచ్చింది. మాస్టర్ ప్లాన్‌లో అదివరకే హుడా అధికారికంగా ఇచ్చిన లేఔట్‌లో బిల్డింగు మీద నుంచి అనాలోచితంగా ఒక రోడ్ గీశారు. గీసినవాడు, గీయించినవాడు కచ్చితంగా బుద్ధిమాంద్యం ఉన్నవాళ్ళే అయివుంటారు. ఆ లేఔట్‌లో అప్పటికే 60 అడుగుల రోడ్లు ఉన్నాయి. ఒకవైపు జాతీయ రహదారి, ఇంకోవైపు రాష్ట్ర రహదారి, మధ్యలో ఈ లేఔట్ కేవలం 30 ఎకరాలు. అందులో ఒక రోడ్డు గీసి, దాన్ని తీసుకెళ్ళి చెరువులో ఎండ్ చేసారు. ఆ సంగతి ముఖ్యమంత్రికి తెలియచేస్తే– గూగుల్లో చూసి, ‘‘పిచ్చోళ్ళు అట్లా ఎట్లా గీసారు’’ అని చెప్పి, ప్రిన్సిపాల్ సెక్రటరీని స్వయానా వెళ్ళి చూసి రిపోర్టు ఇవ్వమన్నారు. వారు వచ్చి, చూసి, ‘‘ప్రభుత్వం ఎక్కడైనా గీయవచ్చు, వేయవచ్చు, అడగటానికి ప్రజలకు హక్కులేదు. మా ఇష్టం! రిజిస్ట్రేషన్ వేల్యూ కట్టిస్తాం కదా’’ అన్నారు. ఈ మాటలు ఆయన బాధ్యతారాహిత్యాన్ని పట్టి చూపించాయి.


ఈ ఉదంతాలన్నింటినీ చూస్తే– వేమన పద్యంలా– ‘‘చూడ చూడ ఉద్యోగులంతా ఒక్క తీరు ఉందురు, మాట్లాడగా మాట్లాడగా వారి ప్రవర్తన వేరు’’ అని అర్థమవుతుంది. ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధి ప్రభుత్వ ఉద్యోగులు. పథకాలు ఎన్ని పెట్టినా, పైసలు ఎన్ని ఖర్చు చేసినా, పరిపాలనా సౌలభ్యం ముఖ్యం. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన అతి ముఖ్యం. దీనికి ఖర్చేం కాదు. అందరికీ ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసే అవకాశం లేదు. గతంలో రాజులు మఫ్టీలో ప్రభుత్వ అధికారుల పనితీరును ప్రత్యక్షంగా చూసి దిద్దుబాటు చర్యలు తీసుకునేవారు. ఒక సామాన్యుడిగా అనుభవించినప్పుడే ప్రజల సమస్య, ప్రభుత్వ ఆఫీసుల పనితీరు తెలుస్తోంది గనక, అలాంటి ప్రక్రియ ఏదైనా నెలకొల్పటం అవసరం. అంతేగాక, మానవ సంబంధాలను గౌరవించే విధంగా ప్రభుత్వోద్యోగులకు శిక్షణ ఇవ్వటం కూడా ముఖ్యం. ఇందులో కొన్ని: 1) ప్రభుత్వోద్యోగులు ప్రజలు కట్టే పన్నులతో జీతభత్యాలను పొందుతున్నారు గనుక వారిరువురి మధ్య ఉన్నది యజమాని – ఉద్యోగుల సంబంధం అని తెలియచేయాలి. అవసరం అయితే ఈ మాటను ప్రతి ఆఫీసులో కనపడే విధంగా రాయించాలి. 2) ప్రభుత్వోద్యోగులు ప్రజలను ఫీజు చెల్లిస్తున్న క్లయింట్స్‌లా చూడాలి. వారితో మాట్లాడే భాషలోను, వారి ముందు కూర్చునే తీరులోను గౌరవం చూపించాలి. 3) ప్రతి పనికి జవాబుదారీతనం అవసరం. ప్రతి డిపార్టుమెంట్లో ఒక మధ్యవర్తి అవసరం. 4) ప్రతి పని పూర్తికీ ఒక నిర్ణీత కాలపరిమితిని నిర్దేశించాలి. 5) ఇల్లుని చూస్తే ఇల్లాలిని చూసినట్లే అంటారు కదా. అలా, ఆఫీసును చూస్తే ఆఫీసరును చూసినట్లే అన్నట్లు ఉండాలి. 6) ప్రభుత్వోద్యోగులకు వారి ప్రవర్తన లేదా పనితనాన్ని బట్టి గ్రేడింగ్ ఇవ్వాలి. అవసరమైతే ప్రజలతో సంబంధం ఉన్న ప్రతి ఉద్యోగికి ‘పర్సనాలిటీ టెస్ట్’ పెట్టి పబ్లిక్ రిలేషన్స్‌లో అంత సఫలత కనిపించని వారిని వారి మైండ్‌సెట్‌కు సరిపోయే పోస్టులే ఇవ్వాలి. ప్రతి ఉద్యోగి ప్రభుత్వానికి ఒక పీఆర్‌ఓ లాంటివారు. ఒక చిరునవ్వు, సమయపాలన, జవాబుదారీతనం... వీటికి డబ్బేం ఖర్చుపెట్టనక్కర్లేదు. సంస్కారమే పెట్టుబడి. ఇప్పుడిది భారతదేశ బ్యూరోక్రసీలో అత్యంత అవసరం. 

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

మాజీ ఎంపీ, బోనగిరి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.