జగన్‌పై ఉద్యోగోపాధ్యాయుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-01-21T07:27:38+05:30 IST

రివర్స్‌ పీఆర్సీ ఇచ్చి జగన్‌ నమ్మకద్రోహానికి పాల్పడ్డారంటూ ఫ్యాప్టో నాయకులు ధ్వజమెత్తారు.

జగన్‌పై ఉద్యోగోపాధ్యాయుల ఆగ్రహం
ఆందోళనకారుల నినాదాలు

పాదయాత్ర హామీలు మరిచిన సీఎం

నిర్బంధాల నడుమ కూడా కలెక్టరేట్‌ 

ముట్టడికి తరలివచ్చిన వేలాదిమంది 


చిత్తూరు(సెంట్రల్‌), జనవరి 20: అధికారంలోకి వస్తే సీపీఎ్‌సను వారం రోజుల్లో రద్దు చేస్తానని..... ఉద్యోగోపాధ్యాయులకు అన్ని విషయాల్లో న్యాయం చేస్తానని చెప్పిన జగన్‌ చివరకు రివర్స్‌ పీఆర్సీ ఇచ్చి నమ్మకద్రోహానికి పాల్పడ్డారంటూ ఫ్యాప్టో నాయకులు ధ్వజమెత్తారు. వేతన సవరణ ద్వారా తమకు జరుగుతున్న అన్యాయ్యాన్ని నిరసిస్తూ ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గురువారం కలెక్టర్‌ కార్యాలయ ముట్టడికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది టీచర్లు చిత్తూరుకు తరలివచ్చారు. సీఎం డౌన్‌ డౌన్‌..కలెక్టర్‌ బయటకు రావాలి.... అనే నినాదాలతో కలెక్టరేట్‌ ప్రాంగణం మార్మోగింది. ముట్టడిని అడ్డుకునే వ్యూహరంలో భాగంగా బుధవారం సాయంత్రమే పోలీసులు జిల్లావ్యాప్తంగా ఉపాధ్యా య సంఘాల నాయకులను కట్టడి చేశారు.కొంతమందిని గృహ నిర్బంధం చేశారు.గురువారం ఉదయం కలెక్టరేట్‌ ముట్టడికి బయల్దేరిన ఫ్యాప్టో నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.కలెక్టరేట్‌ చుట్టుపక్కల పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ నుంచి పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాల వైపుగా 200 మీటర్లుకు ఒకచోట బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.అయినప్పటికీ గురువారం ఉదయం 9 గంటలకల్లా వేలాదిమంది ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ వద్దకు చేరుకోవడంతో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.దాదాపు మూడున్నర గంటల పాటు టీచర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదాలు, తోపులాట చోటుచేసుకున్నాయి. బ్యారికేడ్లను దాటుకుని ఉపాధ్యాయులు 11గంటల సమయానికి కలెక్టరేట్‌  గేట్‌ వద్దకు చేరుకుని ముట్టడికి యత్నం చేశారు. మహిళా టీచర్లు సైతం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అడ్డుకున్న పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేము పోరాటాలు చేస్తే వాటి ఫలితం మీకు కూడా వస్తుందని తెలిసి కూడా కలెక్టరేట్‌ ముట్టడిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు కూడా కలెక్టరేట్‌కు చేరుకుని ఉద్యమానికి ఊపందించారు.మధ్యాహ్నం 12 గంటల సమయంలో మహిళా టీచర్లు కలెక్టరేట్‌ గేటు ముందు బైఠాయించారు. ఆపై మిగిలిన వారు సైతం బ్యారికేడ్లు దాటుకుని ముందుకువచ్చారు.గేటు ఎక్కడానికి ప్రయత్నించిన యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణకు గాయమవడంతో ప్రధమ చికి త్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా రెండు కుట్లు పడ్డాయి.వడదెబ్బ ధాటి కి శాంతిపురం మండల ఉపాధ్యాయుడొకరు సొమ్మసిల్లి పడిపోయారు.ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్‌, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌ తదితరులు మాట్లాడుతూ వేతన సవరణ కారణంగా జీతం తగ్గే దుస్థితిని రాష్ట్రంలోనే చూస్తున్నామని విమర్శించారు. ఈ పీఆర్సీతో పెన్షనర్లకు కూడా నష్టం జరుగుతుందన్నారు. పీఆర్సీ తమకు అవసరం లేదని, పాత జీతాలనే కొనసాగించాలని, కరువు భత్యం బకాయిలు మొత్తం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అర్థరాత్రి విడుదల చేసిన జీవోలు రద్దు చేయకుంటే సమ్మెకైనా వెనకాడబోమని హెచ్చరించారు.ఉపాధ్యా య సంఘాల నాయకులు పురుషోత్తం, హేమచంద్రారెడ్డి, నిర్మల, రామచంద్రయ్య, మదన్‌ మోహన్‌, రఘుపతి, ముక్తార్‌, ప్రకాష్‌, ప్రసూన, కుసుమ, దక్షిణామూర్తి, నాయుడు, హేమలత, కడియాల మురళి, హైదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


అరెస్టుల పర్వం

తిరుమల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌ ముట్టడికి బయల్దేరిన ఉపాధ్యాయ సంఘాల నేతలను, ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తిరుపతికి చెందిన సుమారు 50మంది ఉపాధ్యాయులను యాదమరి పోలీసులు వరిగపల్లె బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.ఏపీటీఎఫ్‌ ఉపాఽధ్యాయ పత్రిక సంపాదకుడు తులసీనాథ నాయుడిని పలమనేరులో ఉదయమే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని పీలేరు పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.రివర్స్‌ పీఆర్సీని నిరసిస్తూ పుంగనూరు మండలంలోని ఊడిగపల్లి హైస్కూల్‌ ఉపాధ్యాయుడు ఈశ్వరయ్య పాఠశాలలో తలకిందులుగా నిలబడ్డారు.కుప్పం నియోజకవర్గం నుంచి బయల్దేరిన ఉపాధ్యాయులను శాంతిపురం, పలమనేరు, బంగారుపాళ్యం చెక్‌పోస్టుల్లో పోలీసులు అడ్డుకున్నారు. పలమనేరు నుంచి బయలుదేరిన ఉపాధ్యాయులను చిత్తూరు సమీపంలోని టోల్‌గేట్‌ వద్ద బస్సు నుంచి దింపి స్టేషన్‌కు తరలించారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మునిరత్నాన్ని నగరిలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు.ఎ్‌సఆర్‌పురం మండలం కొత్తపల్లిమిట్ట వద్ద ఉపాధ్యాయ సంఘం నాయకులను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. శాంతిపురం మండల ఉపాధ్యాయులను పోలీసులు  రాళ్లబూదుగూరు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఎర్రావారిపాళ్యంలో ఉపాధ్యాయ సంఘం నాయకుడు సుబ్బరాజుతో పాటు పలువురిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కలకడ టీచర్లను పూతలపట్టు వద్ద అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.వెదురుకుప్పంలో ఉపాధ్యాయులకు మద్దతుగా జనసేన నేత యుగంధర్‌ ఆధ్వర్యంలో జనసేన , బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.  కొవిడ్‌ కారణంగా ఇంట్లోనే వున్న ఎస్టీయూ నాయకుడు గంటా మోహన్‌ కలెక్టరేట్‌ ముట్టడికి సంఘీభావం తెలుపుతూ గురువారం నిరాహార దీక్ష చేశారు. ఉదయం 8 గంటలకే దీక్షకు కూర్చున్న ఆయన  సాయంత్రం 5గంటలకు విరమించారు. 


ఉద్యమాలకూ వెనకాడం 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో సీఎం జగన్‌  ఉద్యోగులంతా కుటుంబసభ్యులని చెప్పారు. ఇప్పుడందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను పున:సమీక్షించాలి. సీపీఎస్‌ రద్దుపై సానుకూల నిర్ణయం ప్రకటించాలి.లేకుంటే ఉద్యమాలకు దిగడంతో పాటు నిరవధిక సమ్మెకు వెళతాం.


చీఫ్‌ సెక్రటరీ చీప్‌ రిపోర్ట్‌ వల్లే

వేతన సవరణకు చట్టబద్ధంగా ఏర్పాటైన అశుతోష్‌ మిశ్రా కమిటీ రిపోర్టును ప్రభుత్వం బుట్టదాఖలు చేసి సీఎస్‌ కమిటీని తెరపైకి తీసుకురావడంలోనే  కుట్ర జరిగింది.ఇంటి అద్దెలు పెరుగుతుంటే అద్దెభత్యాన్ని గణనీయంగా తగ్గించడం హాస్యాస్పదం.ఇప్పటికైనా బేషజాలు పక్కన పెట్టి సీఎం సమస్యకు పరిష్కారం చూపాలి.


సీపీఎస్‌ రద్దు ఇంకెప్పుడు?

వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీసీఎస్‌ విధానం ఇంతవరకు రద్దుకాకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోది.  పీఆర్సీలో అన్యాయం జరిగిందని అందరూ ఉద్యమిస్తుంటే, అర్ధరాత్రి జీవోలు విడుదల చేయడం దారుణం. ఇప్పటికైనా సంఘాల నేతలతో చర్చించి సమస్య పరిష్కారానికి సీఎం చొరవ చూపాలి.

Updated Date - 2022-01-21T07:27:38+05:30 IST