వేంకటేశ్వర్లుకు సర్వీస్ పొడిగింపు... ఉద్యోగుల మండిపాటు

ABN , First Publish Date - 2020-06-05T03:39:23+05:30 IST

వేంకటేశ్వర్లుకు సర్వీస్ పొడిగింపు... ఉద్యోగుల మండిపాటు

వేంకటేశ్వర్లుకు సర్వీస్ పొడిగింపు... ఉద్యోగుల మండిపాటు

హైదరాబాద్ : హైదరాబాద్ లోని జీఎల్‌ఐటీ(గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ)లో సీనియర్ లెక్చరర్‌(రసాయన శాస్త్రం)గా పనిచేస్తోన్న చింతనిప్పు వెంకటేశ్వర్లు సర్వీస్‌ను రెండేళ్ళపాటు పొడిగించడంపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో తీవ్ర అసంత‌ృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతమున్న ‘58 సంవత్సరాలకు పదవీ విరమణ’ నిబంధన మేరకు ఆయన కిందటి నెల 31 వ తేదీనే పదవీవిరమణ చేయాల్సి ఉంది.


అయితే అనూహ్యంగా... గురువారం మధ్యాహ్నం ఆయనకు మరో రెండేళ్ళపాటు ‘పొడిగింపు’నిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయన మరో రెండేళ్ళపాటు కొలువులో కొనసాగనున్నారు. కాగా ఆయన సతీమణి మమత... తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కాగా వెంకటేశ్వర్లుకు సర్వీస్ పొడిగింపు విషయం ఏమాత్రం సమంజసం కాదని తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి. హర్షవర్ధన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.


పదవీవిరమణ వయోపరిమితిని ‘60’ ఏళ్ళకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఓ వైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నప్పటికీ... ఏమాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు... వెంకటేశ్వరరావుకు మరో రెండేళ్ళు పొడిగింపునివ్వడం ఎంతవరకు సమంజసం ? అని ప్రశ్నించారు.


ఈ విషయమై తీవ్రంగా పోరాడతామని హర్షవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఉద్యోగ సంఘాల నేతలుగా చలామణి అవుతున్నందుకే వారికి, వారి కుటుంబ సభ్యులకు సర్వీస్ పొడిగింపు వెసులుబాటును కల్పిస్తారా ? అని నిలదీశారు. కాగా మరి కొద్ది రోజుల్లో పదవీవిరమణ చేయనున్న మరికొందరు ఉద్యోగ నేతల సర్వీస్‌లను కూడా పొడిగించే విషయమై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు వినవస్తోంది. 

 

                             

Updated Date - 2020-06-05T03:39:23+05:30 IST