పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-01-19T05:00:06+05:30 IST

ప్రభుత్వవం ప్రకటించిన పీఆర్సీ జీవోపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల ఆగ్రహం
మార్కాపురంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల ఆగ్రహం

ఆ కాపీలకు నిప్పుపెట్టి నిరసన

వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌

మార్కాపురం(వన్‌టౌన్‌), జనవరి 18: ప్రభుత్వవం ప్రకటించిన పీఆర్సీ జీవోపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.  మంగళవారం పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ  కాపీలను ఉద్యోగులు తగులబెట్టి నిరసన తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  యూటీఎఫ్‌, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు ఒద్దుల వీరారెడ్డి, కె.ఎర్యయ్య మాట్లాడుతు నూతన పీఆర్సీ జీవోలతో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. వెంటనే రద్దు చేయాలని, హెచ్‌ఆర్‌ఏ పాత స్లాబ్‌లను కొనసాగించాలని, 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పండిత పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి రవిచంద్ర, ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు మండ్ల రామాంజనేయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభాకర్‌, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, దండా వెంకటరెడ్డి, అల్లూరిరెడ్డి, వీరకుమార్‌, ప్రసాద్‌, రమేష్‌ నాయక్‌  పాల్గొన్నారు.

ఇది రివర్స్‌ పీఆర్సీ

పెద్దారవీడు : వైసీపీ ఏకపక్షంగా విడుదల చేసిన పీఆర్సీ జీవో రివర్స్‌లో ఉందని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జీవో కాపీలను దహనం చేశారు.  కార్యక్రమంలో నాయకులు బి.శ్రీరాములు షేక్‌ కాశింపీరా, కిశోర్‌, రహమాన్‌, పాపయ్య, యలమందారెడ్డి, కాశింసాహెబ్‌, తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది సంఘీభావం తెలిపారు.

కలిసికట్టుగా పోరాడుదాం : కర్నూల్‌ జేఏసీ చైర్మన్‌ వెంగళరెడ్డి

పొదిలి (రూరల్‌) : అందరు కలిసికట్టుగా ఉద్యమించి పీఆర్సీని  సాధించుకోవాలని కర్నూల్‌ జేఏసీ చైర్మన్‌ వెంగళరెడ్డి అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో  జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి జవహర్‌,  ఏపీ ఎన్జీవోస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి,  శ్రీనివాసరెడ్డి, నాగూర్‌ ఫ్యాప్టో నాయకులు బాలకాశిరెడ్డి, నాగార్జున, బుజ్జిబాబు పాల్గొన్నారు. 

అవి చీకటి జీవోలు

తర్లుపాడు : వైసీపీ చీకటి జీవోలను రద్దు చేయాలని ఎమ్మార్సీ వద్ద ఉపాధ్యాయులు కాపీలను తగులబెట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కృష్ణారెడ్డి, నాసరయ్య, జగన్‌బాబు, సంజీవ్‌కుమార్‌,  ఆంజనేయులు, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

ఆ జీవోలతో పింఛనర్లకు నష్టం

గిద్దలూరు : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా, నివేదికను బయటపెట్టకుండా కేవలం ముఖ్యమంత్రి సిఫార్స్‌ చేసిన జీవోలను విడుదల చేయడం వల్ల పింఛనర్లకు నష్టమని విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు జి.రవీంద్రనాథరెడ్డి ఒక ప్రకటనలో  ఆందోళన వ్యక్తం చేశారు.  

కంభంలో నిరసన

కంభం : కంభం, అర్ధవీడు మండలాల్లో పీఆర్సీపై ఉద్యోగులు నిరసన  తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట  ఉపాధ్యాయులు ఫ్యాప్టో ఆధ్వర్యంలో కాపీలను తగులబెట్టారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ కంభం మండల అధ్యక్షుడు సునీల్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నాగరాజు,  ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి రంగస్వామి, ఎస్టీయూ అధ్యక్షుడు అంకయ్య, సీపీఐ నాయకుడు ఇబ్రహీం పాల్గొన్నారు. 

ఉద్యోగుల ఆందోళన

బేస్తవారపేట   : రహస్య పీఆర్సీని రద్దు చేయాలని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద యూటీఎఫ్‌ ఉద్యోగులు నిరసన తెలిపి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో  నాయకులు రామిరెడ్డి, డి.కాశింవలి, లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వెంటనే ఉపసంహరించుకోవాలి

ఎర్రగొండపాలెం : పీఆర్సీ జీవోలను రద్దు చేసి, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీవోలు ప్రధాన సెంటర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించి, జీవో కాపీలను తగులబెట్టారు. కార్యక్రమంలో ఎన్జీవో అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి చేదూరి రవి, కోశాధికారి వెంకటేశ్వర్లు,  ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

రద్దు చేయాలి

పెద్ద దోర్నాల, జనవరి 18 : ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని యూటీఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ఎంఈవో కార్యాలయం వద్ద యూటీఎఫ్‌ నాయకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్‌ సభ్యులు సుధాకర్‌, రామకృష్ణా నాయక్‌, వర్థన్‌, మహేంద్ర పాల్గొన్నారు. 

ఫ్యాప్టో ధర్నా

గిద్దలూరు టౌన్‌ : గిద్దలూరు ఫ్యాప్టో అధ్యక్షుడు వై.శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఉపాధ్యాయులు పీఆర్సీ నల్ల జీవోలను తగులబెట్టారు. కార్యక్రమంలో  యూటీఎఫ్‌ నాయకులు రంగారెడ్డి, రమణారెడ్డి,  కబీర్‌,  మూర్తయ్య, స్కూల్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు అహమ్మద్‌ పాల్గొన్నారు. 

కొనకనమిట్ల :  యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో  మంగళవారం పీఆర్సీ కాపీలను కాల్చి నిరసన తెలిపారు.  కార్యక్రమంలో నాయకులు  రమణారెడ్డి, కృపారావు, శ్రీనివాసులు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 




Updated Date - 2022-01-19T05:00:06+05:30 IST