కోమాలో ఉద్యోగుల ఆరోగ్య పథకం

ABN , First Publish Date - 2022-06-14T06:18:25+05:30 IST

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఎనిమిదేళ్లు పూర్తయినప్పటికి ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, వారిపై ఆధారితులకు వర్తింపజేస్తున్న ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం (ఇ.హెచ్‌.ఎస్‌)ను ప్రభుత్వం కోమాలోకి తీసుకొని పోయింది...

కోమాలో ఉద్యోగుల ఆరోగ్య పథకం

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఎనిమిదేళ్లు పూర్తయినప్పటికి ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, వారిపై ఆధారితులకు వర్తింపజేస్తున్న ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం (ఇ.హెచ్‌.ఎస్‌)ను ప్రభుత్వం కోమాలోకి తీసుకొని పోయింది. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి పట్టిన జబ్బును వదిలిస్తేనే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న మూడు లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు, రెండు లక్షల అరవై వేల మంది పెన్షనర్లకు, వారిపై ఆధారపడిన ఎనిమిది లక్షలమందికి, మొత్తంగా సుమారు 15 లక్షల మంది ఆరోగ్య భద్రత గాడిలో పడుతుంది.


జూన్‌ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, కొత్త రాష్ట్రాన్ని సాధించుకున్న ఆనందంలో ఉద్యోగ సంఘాల అభ్యర్థనమేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులు ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీముకు తమ తరఫు నుంచి ఎంత ప్రీమియం చెల్లించాలన్న విషయాన్ని ప్రస్తావించగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మీరు ఉద్యమాలు చేస్తే వచ్చిన రాష్ట్రంలో మీరు డబ్బులు చెల్లించడం ఏమిటి? ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీముకు కావలసిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది’ అన్నారు. అంతేగాక, గరిష్ఠ పరిమితి రూ.2లక్షలను ఎత్తివేస్తామని, ఇ.హెచ్‌.ఎస్‌. స్కీము కమిటీ లేకుండా ఉచిత హెల్త్‌ కార్డులు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ కేసీఆర్ వాగ్దానం చేసిన ప్రీమియం లేని ఉచిత హెల్త్‌కార్డులు ఉత్త కార్డులే అయ్యాయి. వైద్యచికిత్సలకు ప్రభుత్వం చెల్లిస్తున్న ప్యాకేజి రేట్లు సరిపోవడం లేదనే కారణంతో ఆసుపత్రుల్లో హెల్త్‌కార్డుల ద్వారా చికిత్సలు జరపకపోవడం, వాటికి గిట్టుబాటు అయ్యే వ్యాధులకే చికిత్స చేయడం, ఆ చికిత్సలకు సైతం ప్రభుత్వం సకాలంలో సొమ్ము చెల్లించకపోవడం తదితర కారణాల వల్ల హెల్త్‌కార్డుల ద్వారా చికిత్సలు దాదాపు నిలిచిపోయాయి. ఉద్యోగులు హెల్త్‌కార్డులతో వెళ్ళితే కొన్ని ఆసుపత్రులు నిరాకరించటం, వేర్వేరు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావటం, వారిని చేర్చుకొన్న ఆసుపత్రులు చికిత్సకు హెల్త్‌ ట్రస్టు అనుమతి కోసం రోజుల తరబడి వేచి ఉండటం వంటి పరిస్థితుల మధ్య వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.


హెల్త్‌కార్డుల ద్వారా చికిత్సలు జరగడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నిధుల కొరత వల్ల చికిత్సలు జరగటం లేదంటున్నారు కాబట్టి ప్రీమియం చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చినప్పటికీ, మేము ఉచితం అన్నాం కాబట్టి ప్రీమియం వసూలు చేయమని ప్రభుత్వం నిరాసక్తిని చూపింది. హెల్త్‌ కార్డుల ద్వారా చికిత్సలు అందడం లేదు కాబట్టి దీనికి సమాంతరంగా మెడికల్‌ రీఇంబర్స్‌మెంట్ పథకాన్ని మూడు నెలలు, ఆరు నెలలు అంటూ పొడిగిస్తూ ఇప్పటికీ కొనసాగిస్తున్నది. హెల్త్‌కార్డులతో చికిత్సకు ప్యాకేజీ రెట్లు తక్కువ ఉన్న కారణంగా ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి.  ఆ సందర్భాల్లో వ్యాధిగ్రస్థులు ప్యాకేజి రేటుకు అదనంగా అయ్యే ఖర్చు భరిస్తే మాత్రమే ట్రీట్మెంట్ జరుపుతున్నాయి. వైద్య ఖర్చులు రూ.50 వేల లోపు మంజూరుకు జిల్లా మెడికల్‌ బోర్డుకు, 50 వేల పైబడిన మొత్తాలను ఆయా శాఖల ఉద్యోగుల డైరెక్టరేటు ద్వారా రాష్ట్ర మెడికల్‌ బోర్డు ద్వారా మంజూరు చేసుకోవాలి. ఇలా వివిధ స్థాయిల్లో జాప్యం వల్ల సంవత్సర కాలమైనా బిల్లు మంజూరు కావటం లేదు. ఇప్పటికైనా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉద్యోగ సంఘాల అంగీకారంతో వెలువడ్డ ఉత్తర్వుల ప్రకారం ప్రిమియం చెల్లింపుకు సిద్ధమే అంటున్న ఉద్యోగుల, ఉద్యోగ సంఘాల విన్నపాన్ని మన్నించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా చికిత్సలు అందించాలని కోరుతున్నాం. 

పులి సరోత్తంరెడ్డి

పి.ఆర్‌.టి.యు.టిఎస్‌. మాజీ రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - 2022-06-14T06:18:25+05:30 IST