ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-04-21T06:17:22+05:30 IST

ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రార్థనా స్థలాల వద్ద కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నూజివీడు సబ్‌కల్టెర్‌ ప్రతిష్టా మంగైన్‌ అన్నారు.

ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి
మత పెద్దల సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌కల్టెర్‌ ప్రతిష్టా మంగైన్‌

 మత పెద్దలతో సబ్‌ కలెక్టర్‌ ప్రతిష్ఠా మంగైన్‌ సమీక్ష 

 నూజివీడు డివిజన్‌లో రోజుకు 50 కరోనా పరీక్షలు 

 53,116 మందికి వ్యాక్సినేషన్‌ : డిప్యూటీ డీఎంహెచ్‌వో


నూజివీడు, ఏప్రిల్‌ 20 : ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రార్థనా స్థలాల వద్ద కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నూజివీడు సబ్‌కల్టెర్‌ ప్రతిష్టా మంగైన్‌ అన్నారు.  సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో డివిజన్‌లోని వివిధ దేవాలయాలు, చర్చిలు, మసీదులకు చెందిన మత పెద్దలతో కొవిడ్‌ నియంత్రణపై మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతంగా వ్యాపిస్తుండటంతో దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రస్తుతం వివిధ పండుగలు సందర్భంవగా భక్తులు ఎక్కువగా ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు మాస్క్‌లు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. అన్ని ప్రార్థనా మందిరాల వద్ద నిఘాను ఏర్పాటు చేశామని, మతపెద్దలు కూడా సహకరించాలని ఆమె కోరారు. 


కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం 

డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో దయాల ఆశ

నూజివీడు డివిజన్‌లోని 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజూ 50కి తగ్గకుండా కరోనా టెస్టులు చేస్తున్నట్లు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో దయాల ఆశ తెలిపారు. ఇప్పటి వరకు మొదటి విడతలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు 5,624 మందికి వ్యాక్సిన్‌ వేశామన్నారు. రెండో విడతలో భాగంగా 7,589 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు ఉండగా, వారిలో 6,780 మందికి వ్యాక్సిన్‌ అందిచామన్నారు. 45 సంవత్సరాలు నిండిన వారికితో కలిపి మొత్తం 53,116 మందికి డివిజన్‌లో వ్యాక్సిన్‌ వేమడం జరిగిందన్నారు.  మే ఒకటి నుంచి 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సిన్‌ అందించడం జరుగుతుందన్నారు. టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ బాధ్యత ఆరోగ్య శాఖ, అవగాహన కల్పించాల్సింది రెవెన్యూ శాఖ, పారిశుధ్య పనులు మున్సిపాలిటీ, పంచాయితీలదే అని స్పష్టం చేశారు.


ఫిర్యాదులు వస్తే చర్యలు

ప్రైవేటు ఆసుపత్రుల్లో, ల్యాబ్‌ల్లో టెస్టులకు అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వస్తే సంబంధిత ఆసుపత్రులు, ల్యాబ్‌లపై చర్యలు తీసుకుంటానని  డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో దయాల ఆశ హెచ్చరించారు.  డివిజన్‌లో ఎక్కడా టెస్టులు చేసేందుకు ప్రైవేటు ల్యాబ్‌లు, ఆసుపత్రుల వారు అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. కొవిడ్‌ చికిత్స చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు. నూజివీడు డివిజన్‌ పరిధిలో ఇప్పటివరకు 73,464 కరోనా టెస్టులు చేయగా 7,054 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. వాటిలో యాక్టివ్‌ కేసులు 189 ఉన్నాయన్నారు. అత్యధికంగా నూజివీడులో 35, గన్నవరం మండలంలోని ముస్తాబాదలో 51, బాపులపాడులో 26 కరోనా కేసులు ఉన్నట్లు ఆమె తెలిపారు.


Updated Date - 2021-04-21T06:17:22+05:30 IST