భారతీయతకు నవీన చిహ్నం అయోధ్య: మోదీ

ABN , First Publish Date - 2020-08-05T20:46:53+05:30 IST

భారతీయ సంస్కృతికి నవీన చిహ్నం అయోధ్య రామాలయమని, మన భక్తి, మన జాతీయ మనోభావాలకు గుర్తు..

భారతీయతకు నవీన చిహ్నం అయోధ్య: మోదీ

అయోధ్య: భారతీయ సంస్కృతికి నవీన చిహ్నం అయోధ్య రామాలయమని, మన భక్తి, మన జాతీయ మనోభావాలకు గుర్తు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోట్లాది మంది ప్రజల సమష్టి తీర్మానానికి ఉన్న శక్తికి కూడా రామాలయం ప్రతీక అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు సైతం ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ అనంతరం 'జై శ్రీరామ్' నినాదంతో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జైశ్రీరామ్ నినాదం ఇవాళ అయోధ్యలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తోందని మోదీ అన్నారు.


'ప్రతి గుండె ఉప్పొంగుతోంది. ఇది యావద్దేశం భావోద్వేగంతో పులకిస్తున్న వేళ. సుదీర్ఘ నిరీక్షణ ఈరోజుతో ముగిసింది. రామ్‌ లల్లా కోసం భవ్య రామాలయం నిర్మాణం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా రామ్ లల్లా ఆలయం టెంట్‌లోనే కొనసాగింది' అని మోదీ అన్నారు. ఇవి  చారిత్రక క్షణాలని, కన్యాకుమారి నుంచి క్షీర్‌భవాని వరకు, కోటేశ్వర్ నుంచి కామాఖ్య వరకు, జగన్నాథ్ నుంచి కేథార్‌నాథ వరకూ, సోమ్‌నాథ్ నుంచి కాశీవిశ్వనాథ్ వరకూ అంతటా రామనామం ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు.


నూతనాధ్యాయం...

రామాలయ నిర్మాణంతో చరిత్ర రాయడమే కాదు, చరిత్ర పునరావృతం కానుందని ప్రధాని మోదీ అన్నారు. పడవ నడిపే వ్యక్తి నుంచి గిరిజనుల వరకూ శ్రీరాముడికి ఏ విధంగా సాయపడ్డారో, కృష్ణ భగవానుడు గోవర్ధన గిరి ఎత్తడానికి పిల్లలు ఏ విధంగా సహకరించారో, మన అందరి సహాయ సహకారాలతో భవ్య రామాలయ నిర్మాణం పూర్తవుతుందని మోదీ అన్నారు.

Updated Date - 2020-08-05T20:46:53+05:30 IST