అలక వీడిన సుచరిత

ABN , First Publish Date - 2022-04-13T22:47:16+05:30 IST

రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్‌తోనే ఉంటానని మాజీమంత్రి సుచరిత స్పష్టం చేశారు. గురువారం జగన్‌తో సుచరిత భేటీ అయ్యారు.

అలక వీడిన సుచరిత

అమరావతి: మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో స్థానం దక్కకపోవడంతో అలిగిన మాజీమంత్రి సుచరిత ఎట్టకేలకూ అలక వీడారు. ఆమెతో తొలుత మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ చర్చలు జరిపినా సుచరిత పట్టువీడలేదు. ఈ నేపథ్యంలోనే సుచరితకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. గురువారం ఆమె జగన్‌తో భేటీ అయ్యారు. జగన్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత అలక వీడారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు.  వైఎస్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. జడ్పీటీసీ నుంచి హోం మంత్రిగా వైసీపీ అవకాశం ఇచ్చిందన్నారు. సర్జరీ కారణంగా ఈ మధ్యకాలంలో బయటకు రాలేదని తెలిపారు. 2009లో ప్రతిపాడు నుంచి గెలిచానని చెప్పారు. పార్టీ కోసం పనిచేయాలని జగన్‌ చెప్పారని పేర్కొన్నారు. పదవి ఆశించి రాకపోవడంతోనే ఎమోషన్‌కు గురయ్యానని, జగన్‌ కుటుంబంలో మనిషిగా తనను ఆదరిస్తారని చెప్పారు. కొంతమందిని మారుస్తానని సీఎం ముందే చెప్పారని, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. థ్యాంక్స్‌ చెబుతూ లేఖ రాస్తే రాజీనామా అంటూ ప్రచారం చేశారని సుచరిత విమర్శించారు. 


మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో సుచరిత స్థానం దక్కకపోవడంతో ఆమె అనుచరులు ఆందోళనలు చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, తన వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదన్నారు. నేతలంతా సంయమనం పాటించాలని, తాను పదవిలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని సుచరిత తెలిపారు. సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, తమకు కూడా పదవులు అవసరం లేదంటూ గుంటూరు, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, కాకుమాను, పెదనందిపాడు మండలాల పరిధిలోని వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు గుంటూరు నగర పాలక సంస్థకు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు రాజీనామా చేస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. పాత కేబినెట్‌లో ఐదుగురు ఎస్సీ మంత్రుల్లో నలుగురిని కొనసాగించి సుచరితను తొలగించడం ఏం న్యాయమంటూ వారు ప్రశ్నించారు. 



Updated Date - 2022-04-13T22:47:16+05:30 IST