దాచుకున్న ఎమోషన్స్‌ సంగీతంలో పెడతా!

ABN , First Publish Date - 2021-11-29T09:01:35+05:30 IST

త్రివిక్రమ్‌ను కలిసినప్పుడల్లా కొత్తగా కనిపిస్తూ ఉంటారు. ఊరికే ఏదీ ఆయన మాట్లాడరు. కానీ మాట్లాడేది కొత్తగా ఉంటుంది..

దాచుకున్న ఎమోషన్స్‌  సంగీతంలో పెడతా!

ఆర్కే: వెల్‌కమ్‌ టు ఓపెన్‌ హార్ట్‌...

తమన్‌: నమస్కారం సార్‌.


 ఆర్కే: ఎలా ఉన్నారు? 

 తమన్‌: వెరీగుడ్‌ సర్‌


 ఆర్కే: సంగీత ప్రపంచాన్ని ఊపేస్తున్నారుగా... 

తమన్‌: అవకాశం దొరికింది సార్‌... దాన్ని ఉపయోగించుకుంటున్నా...


 ఆర్కే: ఎవర్నీ ఇక దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు కదా... మ్యూజిక్‌ డైరెక్టర్‌ అంటే తమనే, అంతే ఇక..

తమన్‌: అది డైరెక్టర్లు ఇచ్చే స్పేస్‌... వాళ్ళిచ్చే ఆ ఫ్రీడమ్‌ సర్‌.. మనలో ఏం ఉంటుంది? 


 ఆర్కే: మణిశర్మ మీకు గురువు. కానీ ఇప్పుడు శిష్యుడు ఆయన్ని దాటిపోయారు.

తమన్‌: ఆయన దగ్గర నేర్చుకున్న విద్యే సార్‌... 


 ఆర్కే: అంటే గురువుకి గర్వకారణమే. కానీ ఆయన్ని డామినేట్‌ చేశారు కదా...

తమన్‌: అలా ఏం లేదు సార్‌. ఆయన వెరీ హ్యాపీ. మొన్న బర్త్‌డే పార్టీలో కలిసినప్పుడు కూడా ఆయన వెరీ హ్యాపీ. నాకు మణిగారంటే మ్యూజిక్‌ డైరెక్టర్‌ కన్నా ఎక్కువ. అప్పుడాయన సౌతిండియాలో బెస్ట్‌ ప్రోగ్రామర్‌. మేము రాజ్‌-కోటి దగ్గిర శిష్యులుగా ఉండేవాళ్ళం.... రెహమాన్‌ గారూ, హారిస్‌ జయరాజ్‌ గారూ... మణిశర్మగారూ... తరువాత ఒక్కొక్కరం మ్యూజిక్‌ డైరెక్టర్లయ్యాం.


 ఆర్కే: ఆయన నుంచి మీకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఎప్పుడు, ఏ ట్యూన్‌కి... 

తమన్‌: ‘దూకుడు’కి ఆ సినిమాలో అన్ని పాటలూ ఆయనకుచాలా ఇష్టం. ‘నీ దూకుడు’ పాట ఆయనకు బాగా నచ్చింది. అలాగే ఆర్కెస్ట్రైజేషన్‌ కూడా. అప్పటి వరకూ నా గురించి ఆయన పెద్దగా ఆలోచించలేదు. ఆ తరువాత నన్ను అభినందించారు. ఇక వాళ్ళున్నప్పుడు అంత కాపింటేషన్‌ లేదు. మణిగారు ఉన్నప్పుడు రెహమాన్‌, దేవీశ్రీ ప్రసాద్‌, హారిస్‌... ఇలా నలుగురు మ్యూజిక్‌ డైరెక్టర్లు చేసేవారు. ఇప్పుడలా కాదు. పొజిషన్‌ ప్రొటెక్ట్‌ చేసుకోవాలంటే మ్యూజిక్‌ చెయ్యడం మాత్రమే కాదు. ఇంకా చాలా పనులు చెయ్యాలి. సో, బీజీయంలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగా చేస్తామనే సరికి... ఒక కంపోజర్‌ ‘రౌండ్‌ అబౌట్‌’ అనే పేరొచ్చింది.


 ఆర్కే: సో, పట్టేశారు కిటుకు...

తమన్‌: అది ఇంపార్టెంట్‌ సార్‌.


 ఆర్కే:  టాప్‌ హీరోల సినిమాలన్నీ మీకున్నాయ్‌... రాబోయేది ‘భీమ్లానాయక్‌’ కదా... మొగిలయ్యను మీరే ఐడెంటిఫై చేశారా...

తమన్‌: లేదు, పవన్‌ కళ్యాణ్‌ గారు చేశారు. ఆయన త్రివిక్రమ్‌ గారితో చెబితే... త్రివిక్రమ్‌ గారు పిలిపించమన్నారు. మొగిలయ్యగారికేం అర్థం కాలేదు. సినిమాకి ఆయన చాలా దూరం. వాళ్ళందరూ మట్టిలో పెరిగిన మంచి మనుషులు. వాళ్ళకి అలవాటు కావడానికి మూడు నాలుగు రోజులు పట్టింది. మాతో చెన్నైకి షూటింగ్‌కి వచ్చారు. ఆ పాట లిరికల్‌ వీడియోని మేం షూట్‌ చేసేం. ఆయన గొంతే కాకుండా ఆయన రూపం కూడా బయటకు రావాలనుకున్నాం. ఇరవై ముప్ఫై లక్షలు ఖర్చు కూడా అయింది. ఇదంతా పాట షూటింగ్‌ కాకుండానే... ఆ ప్రమోషన్‌ వీడియో చెయ్యడానికి. సో, శివమణి గారు, నేను, ఆయన ఆ వీడియోలో ఉన్నాం. ఆ వీడియో అద్భుతంగా వచ్చింది.


 ఆర్కే: కానీ ఎక్కువ ప్రెజర్‌ ఉంటుంది కదా మీకు... స్టార్‌ డైరెక్టర్‌, స్టార్‌ హీరో అన్నప్పుడు...

తమన్‌: మీరు నమ్మరు కానీ, అసలు ప్రెజరే ఉండదు సార్‌. త్రివిక్రమ్‌ గారితో అలా జరిగిపోతుంటుంది. 


 ఆర్కే:  మిమ్మల్ని చూస్తే తెలుగబ్బాయని ఎవరూ అనుకోరు.  అసలు మీ నేపథ్యం ఏంటి?

తమన్‌: మా తాతగారు ఘంటసాల బలరామయ్యగారు. ఆయన ప్రొడ్యూసర్‌. కానీ మా నాన్నగారికి ప్రొడ్యూస్‌ చెయ్యడం ఇష్టం లేదు. ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం. చక్రవర్తిగారి దగ్గిర డ్రమ్మర్‌ గా ఒక వెయ్యి సినిమాల వరకూ పని చేశారు. రాజ్‌-కోటి గారి దగ్గర, మాధవపెద్ది సురేష్‌ గారి దగ్గిర... వీళ్ళందరూ ఆ సీజన్‌ బ్యాచ్‌ అన్నమాట. మా నాన్నగారు నెంబర్‌ వన్‌ డ్రమ్మర్‌... టాప్‌ ఫైవ్‌లో ఆయనొకరు. ఆ డ్రమ్మింగ్‌ నాక్కూడా చిన్నప్పట్నించీ బై బ్లడ్‌ వచ్చేసింది.  నాన్న రికార్డింగ్‌కు వెళ్ళాక డ్రమ్సే నా ఆట వస్తువులు. ఇంట్లో ఉన్న మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ వినడం, డ్రమ్స్‌ వాయించడం... శివమణిగారు, కోటిగారు, రాజుగారు, వాసూరావుగారు మా ఇంటికి భోజనానికి వచ్చేవారు. నన్ను బాగా ప్రోత్సహించేవారు. నేను డ్రమ్స్‌ వాయించడం చూసి, వీడు మంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుతాడనేవారు. మా అమ్మ కూడా సింగర్‌. మా పెద్దమ్మగారు బి. వసంతగారు.


 ఆర్కే:  మొత్తానికి అంతా సంగీత ప్రపంచమే

తమన్‌: నాకు చదవమనీ, డాక్టర్‌ అవమనీ, ఇంజనీర్‌ అవమనీ.... అలాంటి మాటలేం ఇంట్లో వినిపించేవి కావు. ఎప్పుడూ పాటలే.మా నాన్న ఎన్టీఆర్‌ గారికి, ఎమ్జీఆర్‌ గారికీ పెద్ద అభిమాని. ఏ సినిమా రిలీజైనా థియేటర్‌కి  వెళిపోయేవాళ్ళం. చిన్నప్పట్నుంచి సినిమాయే నా ప్రపంచమైపోయింది. నాకు స్కూల్‌ చాలా కొత్తగా ఉండేది. ‘ఎప్పుడు ఇంటికి వెళ్తానా?’ అని వెయిట్‌ చేస్తూ ఉండేవాణ్ణి. నాన్నతో, అమ్మతో గడపాలని కాదు. ఆ డ్రమ్స్‌... ఈ పాట ఎలాగైనా వాయించెయ్యాలి, ఈ రోజు మొత్తం ప్రిపేరైపోవాలి... అడ్వాన్సుడ్‌గా ఉండేవాణ్ణి. మా నాన్న వాయించేవన్నీ నేను వాయించేసేవాణ్ణి. ‘‘ఇంత తొందరగా ఎలా నేర్చుకున్నాడు వీడు?’’ అని మా అమ్మని అడిగేవారు. ‘‘పొద్దున్నే కూర్చున్నాడు. ఈ పాట పూర్తి చేసి కాని క్రికెట్‌కి వెళ్ళలేదు’’ అనేది. క్రికెట్‌ నాకు మరో పిచ్చి. సో, నా జీవితంలో మ్యూజిక్‌, క్రికెట్‌ మాత్రమే ఉండేవి. నాగపూర్‌ నుంచి చెన్నై వస్తూండగా మా నాన్నగారికి హార్ట్‌ అటాక్‌ వచ్చింది. ఆ తరువాత ఒక రోజు మాత్రమే ఉన్నారు. అమ్మా, చెల్లీ... నా కుటుంబం. ఆరో తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైపోయేను. మా దగ్గిర సేవింగ్స్‌ లేవు. ఎల్‌ఐసి డబ్బు వచ్చింది. దాన్ని మా చెల్లికి కూడా దాచకుండా మా అమ్మ డ్రమ్స్‌ కొనిచ్చింది. బాలుగారు, శివమణి, సురేష్‌, రాజ్‌కోటి గారు బాగా ఆదుకున్నారు.  


ఆర్కే:  సినీ లెజెండ్‌ అక్కినేని నాగేశ్వరరావుగారికి లైఫ్‌ ఇచ్చింది మీ తాతగారు బలరామయ్యగారే కదా? 

తమన్‌:  అవును


 ఆర్కే: నాగేశ్వరరావు గారు కూడా చాలా సార్లు ప్రస్తావించారు... ఆయన వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని. ఏ సినిమా అది...

తమన్‌:  ‘బాలరాజు’,


 ఆర్కే: ఆ సినిమా బాగా హిట్టయింది. ఆయన ఏదో రూపంలో మీకు సాయం చెయ్యడానికి ఆసక్తి చూపారా? చెయ్యాలనీ, చేస్తాననీ కూడా అన్నారట... 

తమన్‌:  మేం అటువైపు నుంచి అప్రోచ్‌ కాలేదు సార్‌. చేసి ఉండేవారేమో... కచ్చితంగా. మేం ప్రాబ్లమ్‌లో ఉన్నామని తెలిసేదేమో కానీ అప్పటికే ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయిపోయింది. చెన్నైలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలిసేది కాదు. మా ఫాదర్‌... అంటే బలరామయ్యగారి అబ్బాయి పోయాడు లాంటివేవీ తెలిసి ఉండకపోవచ్చు. ఆయనకు ‘రగడ’ సినిమా ఫంక్షన్లో... అదీ బాలుగారు చెబితేనే తెలిసింది. అప్పుడు ఏఎన్‌ఆర్‌ నాతో మాట్లాడారు. నేను ఇంటిపేరు పెట్టుకోకపోవడం కూడా ఒక కారణం కావచ్చేమో. 


 ఆర్కే: ఆర్థిక సంక్షోభంతో గడ్డు కాలం ఎన్నాళ్ళు సాగింది?

తమన్‌: ఒక అయిదారేళ్ళు ఉంది. పదకొండు నుంచి పదహారేళ్ళ వరకూ. మా అమ్మనీ, సిస్టర్నీ ఏ పనికీ వెళ్ళనిచ్చేవాణ్ణి కాదు. నేనే వెళ్ళిపోయేవాడ్ని. డ్రమ్స్‌ వాయించడం నా డ్రీమ్‌. రోజుకి మూడు ప్రోగ్రామ్స్‌ చేస్తే నూట ఇరవై రూపాయలు వచ్చేది. మా అమ్మకి నెలకి నాలుగు వేలు వచ్చేది. ‘వీడ్ని బాగా చూసుకోవాల’ని మా అమ్మ మా చెల్లిని పుట్టపర్తి స్కూల్లో జాయిన్‌ చేసింది. నాతో ప్రోగ్రామ్స్‌కు వచ్చి, డబ్బు పొదుపు చెయ్యాలనుకుంది. నేనొక్కడ్నే ఆవిడ ప్రపంచం. ఇప్పుడు అమ్మ నాతోనే ఉంది. చెల్లికి పెళ్ళయింది. ఆమె మా ఇంటికి దగ్గర్లోనే ఉంటుంది. ఆమె ఇప్పుడే పాడడం మొదలెట్టింది. అయితే నేను అవకాశం ఇవ్వదల్చుకోలేదు. ‘ఇండస్ర్టీ కష్టమేంటో తెలుసుకొని రా’ అని చెబుతున్నా.


 ఆర్కే:  మీ మిసెస్‌ కూడా సింగరే కదా...

తమన్‌: అవును. నిజానికి మా కుటుంబంలోనే ఆమె మోస్ట్‌ టాలెంటెడ్‌. 


 ఆర్కే:  మీది ప్రేమ వివాహమా? అరేంజ్డ్‌ మ్యారేజా?

తమన్‌:  అరేంజ్డ్‌ మ్యారేజే. ఎందుకంటే నాకు లవ్‌ చెయ్యడానికి జీవితంలో టైమ్‌ లేదు సార్‌. మా ఇంట్లో పెద్దమ్మా వాళ్ళూ ప్రెజర్‌ పెట్టారు. వాళ్ళ ఇళ్ళల్లో పిల్లలందరికీ పెళ్ళిళ్లయిపోయాయి. నేనొక్కడ్నే మిగిలిపోయాను. దాంతో అందరూ నా మీద పడ్డారు. నన్ను అర్థం చేసుకొనే అమ్మాయి కావాలని చెప్పాను. వాళ్ళొక సింగర్‌ను చూశారు. ఆమె చాలా అర్థం చేసుకొనే మనిషి. 


 ఆర్కే: ఆవిడకు కూడా అవకాశాలు ఇవ్వడం లేదా?

తమన్‌: అయిదారు పాటలు పాడారు నాకు. 


 ఆర్కే: అంతేనా?

తమన్‌:  అంతే. తమన్‌ అంటే ప్యాకేజీ కాకూడదని...


 ఆర్కే:  ప్యాకేజీ కాకూడదు. బ్యాగేజీ కాకూడదు.

తమన్‌:  ఎగ్జాట్లీ. అనుకుంటారు కానీ నా వైఫ్‌ బాగా పాడుతుందని డైరెక్టర్లకి చెప్పడం చాలా కష్టం. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 


ఆర్కే: మీకు అవకాశాలొచ్చింది మొదట తమిళ్‌లోనే కదా!

తమన్‌:  తమిళ్‌, తెలుగు కూడా. మొదట సైన్‌ చేసిన సినిమా ‘కిక్‌’. కానీ అయిదో సినిమాగా రిలీజ్‌ అయింది. ‘బుజ్జిగాడు- మేడిన్‌ చెన్నై’కి పూరీగారు ఆఫర్‌ ఇచ్చేశారు.  కానీ ఆయనతో ‘‘పోకిరి’ చేసిన మా గురువుగారు మణిగారికి అవకాశం పోతుందనుకున్నాను. తరువాత సురేందర్‌ రెడ్డి... ‘‘నువ్వు చెయ్యి. నేను చూసుకుంటాను’’ అన్నారు. తమిళ్‌లో శంకర్‌ గారు కూడా ‘వైశాలి’ సినిమాకి అవకాశం ఇచ్చారు.


 ఆర్కే: ముందు ముందు సింగర్స్‌ అవసరం కూడా ఉండదేమో. అంతా సాఫ్ట్‌వేర్‌తోనే...

తమన్‌: అలా కచ్చితంగా అవదు. ఇప్పుడు మళ్ళీ లైవ్‌ మ్యూజిక్‌ పాపులర్‌ అవుతోంది.


ఆర్కే: ఇది సైకిల్‌ కదా...

తమన్‌: అవును. దాన్ని వదులుకోలేం. లైవ్‌ లైవే. కీబోర్డుతో ఎంత వాయించినా లైవ్‌ సౌండ్‌ విషయానికి వచ్చేటప్పటికి... దాన్ని మేం ఎలా డిజిటలైజ్‌ చేసి, కొత్తగా ఎలా ప్రొడ్యూస్‌ చెయ్యాలనే దాంట్లోనే ఇప్పుడు రేస్‌ నడుస్తోంది. 


 ఆర్కే: ఇప్పటివరకూ మీరెన్ని సినిమాలకి మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా పని చేశారు?

తమన్‌:  నూట ఇరవై ఏడు. 


ఆర్కే: వీటిలో బాగా కష్టపడింది ఏ పాటకి?

తమన్‌: ‘అల వైకుంఠపురం’ టైటిల్‌ సాంగ్‌కి. సినిమా రిలీజ్‌కి నెలరోజుల ముందు చేశాం ఆ పాట. ‘సామజ వరగమనా’, ‘రాములో రాములా’, ‘బుట్ట బొమ్మ’, ‘ఓ మై గాడ్‌ డాడీ’ లాంటి మిగతా పాటలు జనాల్లోకి బలంగా వెళ్ళాయి. అల్లు అర్జున్‌ పాత్ర సొంత ఇంటికి వెళ్ళేటపుడు ఒక పాట రావాలి. నేను కష్టపడిన పాటల్లో నా బ్రెయిన్‌ బాగా పిండిన పాట ఇది. మా భయమేమిటంటే, అన్ని పాటలూ మిలియన్స్‌ మిలియన్స్‌ కొట్టేస్తున్నాయ్‌... ఇదేమౌతుందోనని..


ఆర్కే: మీకు అదో సమస్యేమో. ఒక పాట చేస్తే దానికి టెన్‌ మిలియన్స్‌ వ్యూస్‌ వచ్చేయని...అంతకంటే ఎక్కువ చెయ్యాలని... ఇదో పరుగు పందెమే. 

తమన్‌: అదే చెబుతున్నా. యూట్యూబ్‌ కాదది. సైకిల్‌ ట్యూబ్‌.


ఆర్కే: మీకన్నా ముందు దేవీశ్రీ ప్రసాద్‌ కూడా ఇండస్ట్రీ కొంత డామినేట్‌ చేసేరు కదా? ఎంత? రెండు మూడేళ్ళా?

తమన్‌: చాలా. 2000 సంవత్సరం నుంచీ అతను డామినేట్‌ చేస్తున్నాడు. మేం ఆ స్థాయిని ఎంజాయ్‌ చేస్తున్నాం. ఇప్పుడు బాగుంది కదా... దేవీశ్రీ ప్రసాద్‌ ‘పుష్ప’, నా ‘భీమ్లానాయక్‌’, కీరవాణిగారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’... ఎవరూ యూట్యూబ్‌ను వదులుకోవడం లేదుగా? 


 ఆర్కే: ఇప్పుడు మీ మ్యూజిక్‌ డైరెక్టర్ల మధ్య పోటీ ఏంటంటే యూట్యూబ్‌లో వ్యూస్‌, లైక్స్‌ అంతేనా...

తమన్‌:  జనాల లైక్స్‌, కామెంట్స్‌... అన్నిటినీ చూడాలి. ప్రతిదాన్నీ ఫాలో అవాలి కదా...


ఆర్కే: యూట్యూబ్‌ నిద్ర పోనివ్వడం లేదా? 

తమన్‌:  అన్ని ప్లాట్‌ ఫారమ్స్‌ నుంచి కామెంట్స్‌.. జనం దగ్గర నుంచి రివ్యూలు కూడా వేగంగా వచ్చేస్తున్నాయ్‌. 


ఆర్కే: ఒక రోజు చాలు కదా!

తమన్‌:  వేసిన అయిదు నిమిషాల్లో తెలిసిపోతోంది. పాట బతికుందో, చచ్చిపోయిందో. 


 ఆర్కే: ఇది చాలా పోటీ ఉన్న రంగం. జెలసీస్‌ ఎక్కువ ఉంటాయ్‌. కళాకారుల మధ్య అసూయ ఉంటుంది కదా... 

తమన్‌: ఎమోషన్స్‌ అన్నీ దాచేసుకుంటాం. వాటిని మళ్ళీ మ్యూజిక్‌లోనే పెడతాం


 ఆర్కే: అసూయలు, ఈర్ష్యలతో ఎదురవుతున్న అనుభవాలను కూడా మ్యూజిక్‌ మీదే పెట్టుబడి పెడుతున్నారు. 

తమన్‌: అవును. మా కన్నీళ్ళని మేం కంట్రోల్‌ చేసుకుంటాం.


 ఆర్కే: అలాంటివి మీకు జరిగేయా?

తమన్‌: ఎన్నో, ఎన్నో ఉన్నాయ్‌.  ఇంట్లో వాళ్ళ ముందు ఏడవడం నాకు ఇష్టంలేదు. క్రికెట్‌ గ్రౌండ్‌ కి వెళ్తాను. బంతిలో వాళ్ళని ఊహించుకొని బాదడమే. 


 ఆర్కే: ఒక రంజీ ప్లేయర్‌ చెప్పేరు క్రికెట్‌లో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌కు కొంచెం తిక్క ఉండాలని. మీకుందా?

తమన్‌: నాకు చాలా ఉంది. నిజంగా చెప్పాలంటే నేను ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌నే.. వర్క్‌లో చాలా ప్రెజర్‌ ఉంటుంది. ఇరవై ఏడేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాం. ఎవరు ఎక్కడ్నించి వచ్చేరో తెలుసు. ఎవరితోనూ చెప్పుకోలేం.  


ఆర్కే: మీరు కాపీ కొడతారనేది కూడా అలాంటిదేనా?

తమన్‌: ఎవరు ఆపగలిగేరు సార్‌ నన్ను. మరి వాళ్ళు ఓడిపోయినట్టేగా. వాళ్ళకి అది బిజినెస్‌ అయిపోయింది. కొన్ని వ్యూస్‌... దాంట్లో వాళ్ళకేదో ఆదాయం. వాళ్ళ ఆదాయం మనమెందుకు చెడగొట్టడం అని వదిలేసేను... అంతే. 


ఆర్కే: చాలా మంది మ్యూజిక్‌ డైరెక్టర్లు పాడుతున్నారు కదా ఈ మధ్య కాలంలో. మీరు కూడా మంచి సింగర్‌ కదా. 

తమన్‌: అంటే నా ట్యూన్స్‌ వరకూ నేను పాడుకుంటాను. సినిమాల్లో ఒక్క పాట పాడాను. అది బాగా హిట్టయింది. ‘సారొస్తారొస్తారా’ పాట. ఆ టైమ్‌లో పూరీ గారికి చాలా నచ్చేసింది నా వాయిస్‌. మహేష్‌ బాబుగారికి కూడా నచ్చింది. ఆ పాట ఆడియో కంపెనీకి బాగా డబ్బు తెచ్చింది.


ఆర్కే: మీ ఆవిడకి మీ మీద కోపం వచ్చినప్పుడు, ఆ కోపాన్ని వ్యక్తం చెయ్యడానికి ఏవైనా పాడతారా?

తమన్‌: కోపాలుంటే మాట్లాడకపోవడాలు ఉంటాయి తప్ప... ఈ పగలన్నీ తీర్చుకోరు. వాళ్ళకి ఆ టైమ్‌ లేదు.


ఆర్కే: ఎంతమంది పిల్లలు?

తమన్‌: ఒకే అబ్బాయి. టెన్త్‌  చదువుతున్నాడు.


ఆర్కే: మ్యూజిక్కేనా?

తమన్‌: రెండూ ఉన్నాయ్‌. ప్రతి మూడేళ్ళకీ ఈ ఫేజ్‌ మారిపోతోంది. సడన్‌గా క్రికెట్‌ అంటాడు, మ్యూజిక్‌ అంటాడు, ‘నాసా’కి వెళ్ళాలంటాడు. 


ఆర్కే: కొత్తగా చేస్తున్న సినిమాలేవి?

తమన్‌: ‘సర్కారువారి పాట’... మహేష్‌ బాబుతో. అది ఏప్రిల్‌లో వస్తుంది. ఆ పాటలు ఇంకా రిలీజ్‌ చెయ్యాలి.  


ఆర్కే: మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ... థాంక్యూ వెరీమచ్‌.

తమన్‌: థాంక్యూ. 


ఆర్కే: మీరు బాగా కష్టపడిన పాట... అంటే మీకు సంతృప్తి ఇచ్చి, జనానికి నచ్చంది... ఏదైనా ఉందా?

తమన్‌: చాలా అరుదుగా జరిగాయి. ఈ పాట నుంచి ఎంతో ఎక్స్‌పెక్ట్‌ చేసేం, ఏంటిలా అయిపోయింది అనేది... ‘ఏడపోయినాడు’ అని ‘అరవింద సమేత’లో ఒక పాటుంది. ఆ పాట చాలా కష్టం. నిఖిత అనే అమ్మాయి పాడారు. ఆ పాటకి ఆవిడ వాయిస్‌ బాగా సరిపోయింది. చూస్తే... ‘రెడ్డీ ఇక్కడ చూడు’, ‘పెనిమిటి’ పాటలు పెద్దగా వెళ్ళాయి. ఆ పాటకి ఎంతో గుర్తింపుని ఎక్స్‌పెక్ట్‌ చేసేను. దానికి ప్రతిఫలం బాగా రాలేదని నేను ఫీలయ్యేను.


ఆర్కే: అలాగే క్యాజువల్‌గా మ్యూజిక్‌ ఇస్తే, సూపర్‌ హిట్‌ అయిన సినిమా ఏదైనా ఉందా?

తమన్‌: ‘సామజవరగమనా’ పాట నేను అనుకోనేలేదు... ఆ పాట ఆ స్థాయికి వెళ్తుందని. అప్పటి నుంచే  పాటల్ని ప్రెజెంట్‌ చెయ్యడంలో మా ఆలోచనా విధానం మారిపోయింది. ఆ పాట మేం అనుకోనే లేదు. ఊరికే షూట్‌ చేద్దామనుకున్నాం. 


ఆర్కే: తమన్‌ ‘అఛీవర్‌’ కదా...

తమన్‌: లేదు సార్‌. ఇంకా చెయ్యాలి. ఇప్పుడే మొదలు పెట్టాను. ‘అల వైకుంఠపురం’ మొదటి సినిమా అనుకుంటున్నాను. నూట ఇరవై సినిమాలు దాటాక మ్యూజికల్‌ బ్లాక్‌ బస్టర్‌ రావడం... ఇది అరుదుగా జరిగే విషయం. వంద సినిమాల తరువాత ఫేడ్‌ అయ్యేవాళ్ళుంటారు. కాబట్టి దీన్ని దీన్ని బెంచ్‌ మార్క్‌గా పెట్టుకున్నా.


 త్రివిక్రమ్‌ను కలిసినప్పుడల్లా కొత్తగా కనిపిస్తూ ఉంటారు. ఊరికే ఏదీ ఆయన మాట్లాడరు. కానీ మాట్లాడేది కొత్తగా ఉంటుంది. ఆయన ఏం చెప్తారో అని మేం ఆత్రుతగా వింటూ ఉంటాం. ఆయన చెప్పే మాటలన్నీ విలువైనవి. డ్రైవింగ్‌ ఇష్టం. చెన్నై నుంచి తిరుపతికి నేనే డ్రైవ్‌ చేస్తూ వెళ్ళిపోతాను.త్రివిక్రమ్‌ గారు ఇంకో మంచి మాట చెప్పేరు. కుకింగ్‌ చేస్తే నీ ఎమోషన్‌ తగ్గుతుందన్నారు.

  ‘బాయ్స్‌’ అనే సినిమాలో నటించాను. అప్పుడు రెహమాన్‌ గారితో పని చేస్తుండగా, శంకర్‌ గారు తన సినిమాకి ఒక ప్రొఫెషనల్‌ డ్రమ్మర్‌ కావాలని అడిగారు. ఆ సినిమాకు చాలా గొప్పవాళ్ళు పని చేస్తున్నారు. కాబట్టి సినిమా గురించి తెలుసుకోవాలని ఒక ఇనిస్టిట్యూట్‌కు వెళ్ళినట్టే వెళ్ళాను. నాకు నటనేం రాదు. వెరీ బ్యాడ్‌. కానీ ఆ సినిమాలో పాత్ర నా వయసుకి సరిపోయింది.  దానికోసం సంగీతానికి ఓ ఏడాది విరామం ఇచ్చాను. నటన ఎంత కష్టమో, ఎండల్లో నటులు ఎంత కష్టపడతారో, ఒక షాట్‌ తియ్యడం ఎంత కష్టమో తెలిసింది. వెనక్కి వచ్చి మణిగారి దగ్గర చేరాను. అక్కడ్నించి ఎనిమిదేళ్ళ పాటు 94 సినిమాలు ఆయనతో నాన్‌స్టా్‌పగా చేశాను. ‘ఒక్కడు’ నుంచి ‘బిల్లా’ దాకా. అది నా కెరీర్లో చాలా ముఖ్యమైన దశ.



Updated Date - 2021-11-29T09:01:35+05:30 IST