Emirates Airline: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం.. చివరికి

ABN , First Publish Date - 2022-07-05T15:24:59+05:30 IST

విమానం గాల్లో ప్రయాణిస్తుండగా పెద్ద రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రంతోనే ఆ విమానం దాదాపు 14 గంటల ప్రయాణం చేసింది.

Emirates Airline: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం.. చివరికి

ఇంటర్నెట్ డెస్క్: విమానం గాల్లో ప్రయాణిస్తుండగా పెద్ద రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రంతోనే ఆ విమానం దాదాపు 14 గంటల ప్రయాణం చేసింది. అనంతరం ఎయిర్‌పోర్టులో (Airport) ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయం బయటపడింది. ఎమిరేట్స్‌కు (Emirates) చెందిన ఎయిర్‌బస్ ఏ380 విమానం జులై 1న దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు బయల్దేరింది. అయితే, గమ్యస్థానంలో ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందు పైలట్స్ అక్కడి ఏయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC)ను సంప్రదించారు. టేకాఫ్‌ సమయంలో విమానం టైరు పేలిందనే అనుమానంతో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ల్యాండ్ అయిన తర్వాత విమానాన్ని పరిశీలించగా దాని ఎడమ రెక్క కింది భాగంలో ఓ రంధ్రాన్ని గుర్తించారు.


కాగా, విమానం టేకాఫ్ అయినా కొద్దిసేపటికే ఈ ఘటన జరిగి ఉండవచ్చని కొందరు ప్రయాణికులు తెలిపారు. ఆ సమయంలో విమానంలో పెద్ద శబ్దం వినిపించిందని, దాదాపు 45 నిమిషాలపాటు అది కొనసాగిందని వారు పేర్కొన్నారు. కానీ, క్యాబిన్ సిబ్బంది ప్రశాంతంగా ఉండడంతో తమకు ఎలాంటి అనుమానం రాలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విమానం ఇంకా బ్రిస్బేన్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉందని ఎమిరేట్స్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. విమానాన్ని అధికారులు తనిఖీ చేశారు. విమానం లోపలి భాగం, ఫ్రేమ్‌, నిర్మాణంపై ఎలాంటి ప్రభావం పడలేదని ఆయన చెప్పారు. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడినట్లు సమాచారం లేదు. 


Updated Date - 2022-07-05T15:24:59+05:30 IST