ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫాపై నిలబడి.. ఓ ఎయిర్ హోస్టెస్ అరుదైన ఫీట్

ABN , First Publish Date - 2021-08-12T19:21:26+05:30 IST

యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ‘మరీ ఇంత పిచ్చేంటిరా’ బాబూ అంటూ కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా నాలుగు అంతస్థుల భ

ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫాపై నిలబడి.. ఓ ఎయిర్ హోస్టెస్ అరుదైన ఫీట్

దుబాయి: యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ‘మరీ ఇంత పిచ్చేంటిరా’ బాబూ అంటూ కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా నాలుగు అంతస్థుల భవనం మీదకు ఎక్కి.. కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి కదా. అలాంటిది.. ఏకంగా ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం మీద నుంచి కిందకు చూస్తే ఎలా ఉంటుందో ఓ సారి ఆలోచించండి. తలచుకుంటేనే కాళ్లలో వణుకొస్తుంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సరిగ్గా ఇదే చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో బ్రిటన్ చాలా దేశాలను రెడ్‌లిస్ట్‌లో చేర్చి.. ప్రయాణ ఆంక్షలను విధించింది. ఈ జాబితాలో యూఏఈ కూడా ఉంది. ప్రస్తుతం పరిస్థులు మెరుగవడంతో తాజాగా బ్రిటన్.. భారత్ సహా యూఏఈని కూడా రెడ్‌లిస్ట్ నుంచి తప్పించి.. అంబర్ లిస్ట్‌లో చేర్చింది. దీంతో యూఏఈ-బ్రిటన్ మధ్య తిరిగి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. 



ఈ క్రమంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ బ్రిటన్‌కు కృతజ్ఞతలను, తమ సంతోషాన్ని వినూత్నంగా తెలపాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఓ భారీ సాహసానికి శ్రీకారం చుట్టుంది. ఎయిర్ హోస్టెస్ డ్రెస్‌లో ఉన్న ఓ మహిళను 828 మీటర్ల ఎత్తైన బుర్జ్ ఖలీఫా‌ భవనం చిట్టచివరకు పంపించి వీడియోను షూట్ చేసింది. ఈ వీడియోలో ‘యూఏఈని యూకే రెడ్ లిస్ట్ నుంచి తప్పించి.. అంబర్ లిస్ట్‌లో చేర్చింది. ఇది మాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఆకాశం అంచున ఉన్నట్టుంది’ అని రాసి ఉన్న ప్లకార్డును సదరు మహిళ ప్రదర్శించడాన్ని చూడవచ్చు. అనంతరం కెమెరా మహిళ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. దీంతో ఆ మహిళ.. బుర్జ్ ఖలీఫాపై ఉన్నట్టు అర్థమవుతుంది. 33 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వినూత్న ఆలోచన చేసిన ఎమిరేట్స్‌ను కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరేమో ‘మరీ ఇంత పిచ్చేంటిరా’ బాబూ అని కామెంట్ చేస్తున్నారు. 




Updated Date - 2021-08-12T19:21:26+05:30 IST