ఆగస్టు 4 నుంచి ఎంసెట్‌

ABN , First Publish Date - 2021-06-22T09:05:36+05:30 IST

తెలంగాణ ఎంసెట్‌ తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడికల్‌ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఆగస్టు 4 నుంచి ఎంసెట్‌

  • 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్‌
  • 9, 10 తేదీల్లో అగ్రికల్చరల్‌, మెడికల్‌
  • 19, 20న ఐసెట్‌, 23న లాసెట్‌ 
  • ప్రకటించిన విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి


హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎంసెట్‌ తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడికల్‌ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య తుమ్మల పాపిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై సెట్‌లపై మంత్రి సమీక్షించారు. అనంతరం వివిధ సెట్‌లకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటించారు. పాలీసెట్‌ను జూలై 17న, ఈసెట్‌ను ఆగస్టు 3న, పీజీఈసెట్‌ను ఆగస్టు 11-14 మధ్య, ఐసెట్‌ను ఆగస్టు 19-20 తేదీల్లో, లాసెట్‌ను ఆగస్టు 23న, ఎడ్‌సెట్‌ పరీక్షను ఆగస్టు 24-25 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. 


కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఫైనలియర్‌ పరీక్షలను జూలై మొదటివారంలో ప్రారంభించి, నెలాఖరులోపు పూర్తిచేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులకు సూచించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకొనే విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫైనలియర్‌ పరీక్షలను వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో... జూలై 1 నుంచే ఈ పరీక్షలు జరగనున్నాయని మంత్రి తెలిపారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 



Updated Date - 2021-06-22T09:05:36+05:30 IST