పిల్లల వైద్యులేరీ?

ABN , First Publish Date - 2022-07-05T17:43:35+05:30 IST

యూపీహెచ్‌సీలు, మెటర్నిటీ ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన పిల్లలకు సరైన వైద్యం అందడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో

పిల్లల వైద్యులేరీ?

నవజాత శిశువులకు అందని అత్యవసర చికిత్స   

కొన్ని ఆస్పత్రుల్లో పిల్లల విభాగాలు కరువు 

నిలోఫర్‌కు తరలింపు  


హైదరాబాద్‌ సిటీ: యూపీహెచ్‌సీలు, మెటర్నిటీ ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన పిల్లలకు సరైన వైద్యం అందడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో పిల్లల విభాగాలు కూడా లేవు. వైద్యులు లేరు. ఉన్న ఆస్పత్రుల్లో  కొంత సమయం వరకే ఉంటున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు దేవుడిపై భారం వేస్తూ నిలోఫర్‌కు తరలిస్తున్నారు. 


ప్రాథమిక ప్రసూతి ఆస్పత్రుల్లో.. 

హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో యూపీహెచ్‌సీకి సంబంధించి తొమ్మిది ప్రసూతి కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ  నెలకు 15 నుంచి 20 వరకు ప్రసవాలు జరుగుతాయి. ఇక మలక్‌పేట, కింగ్‌కోఠి, గోల్కొండ, శాలిబండ, బార్కస్‌, నాంపల్లి, మలక్‌పేటలోని ఏరియా ఆస్పత్రుల్లో కూడా నిత్యం 20 నుంచి 30 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఎక్కడా పిల్లల వైద్యులు లేరు. 


మధ్యాహ్నం 2 దాటిందంటే..

పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో మధ్యాహ్నం రెండు గంటలు దాటిందంటే పిల్లల వైద్యులు దొరకరు. ఆ సమయంలో ఎమర్జన్సీ కేసులు వస్తే నిలోఫర్‌, గాంధీ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిందే. ఈ ఆస్పత్రిలో రోజుకు 30 నుంచి 40 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఒక ప్రొఫెసర్‌, మరో ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పిల్లలకు వైద్యం అందిస్తున్నారు. వీరు కేవలం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆస్పత్రిలో అందుబాటులో ఉంటున్నారు. ఆ తరువాత వారు కనిపించరు. 


సుల్తాన్‌బజార్‌ మెటర్నిటీ ఆస్పత్రిలో..

సుల్తాన్‌బజార్‌ మెటర్నిటీ ఆస్పత్రిలో శిశువులకు వైద్యం అందించేందుకు ఒక మహిళా డాక్టర్‌ను నియమించారు. ఆమె కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఆస్పత్రిలో అందుబాటులో ఉంటారు. ఈ ఆస్పత్రిలో ప్రతి రోజూ 40 నుంచి 50 వరకు డెలివరీలు అవుతున్నాయి. ఇక్కడ పిల్లలకు సరైన వైద్యం లభించపోవడం వల్ల నిలోఫర్‌కు తరలిస్తున్నారు.


ఎక్కువ మంది నిలోఫర్‌కే..

ఆరోగ్య సమస్యలు ఉన్న అప్పుడే పుట్టిన శిశువుల్లో ఎక్కువ మందిని నిలోఫర్‌ ఆస్పత్రికే రెఫర్‌ చేస్తున్నారు. ఇంకొందరిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సుల్తాన్‌బజార్‌ నుంచి ప్రతి నెలా కనీసం 10 మందిని, పెట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి నుంచి నిత్యం కనీసం 15 మందిని, స్థానిక మెటర్నిటీ, ఏరియా ఆస్పత్రుల నుంచి ప్రతి రోజూ 25 మంది పిల్లలను నిలోఫర్‌కు పంపిస్తున్నారు. 


పలు సమస్యలతో జననం.. 

కొందరు పిల్లలు పుట్టుకతోనే పలు సమస్యలను ఎదుర్కొంటారు. ఉమ్మనీరు మింగడం, పచ్చకామెర్లు, తక్కువ బరువు, గుండె, కళ్లు తెరవకపోవడం, శరీర అవయవాలు సరిగా లేకపోవడం, కాళ్లు చేతులు ఆడించకపోవడం, మెడలో పేగు అతుక్కోవడం వంటి సమస్యలు ఉంటాయి. వీటిని పిల్లల వైద్యులు మాత్రమే పసిగట్టగలరు. ఇక ప్రసూతి ఆస్పత్రుల్లో అర్ధరాత్రి జన్మించే పిల్లలకు వైద్యం అందడం చాలా కష్టం. ఈ సమయంలో వారిని కనీసం నిలోఫర్‌కు తీసుకుపోయేందుకు కూడా సదుపాయాలు ఉండవు. సీరియస్‌ అయితే దేవుడి మీద భారం వేసి తల్లిదండ్రులు జాగరణ చేయాల్సిందే. 

Updated Date - 2022-07-05T17:43:35+05:30 IST