Abn logo
Mar 26 2020 @ 03:00AM

సకలం బంద్‌!

అత్యవసర సర్వీసులు తప్ప మిగతావన్నీ మూత

వీలైనంత వరకు వర్క్‌ ఫ్రం హోం

కేంద్ర ఆదేశాల అనుగుణంగా రాష్ట్రం ఉత్తర్వులు


అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కోవిడ్‌-19 కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని ఏయే కార్యాలయాలు పనిచేస్తాయి, ఏవి పనిచేయకూడదో సూచిస్తూ సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటి అటానమస్‌ సంస్థలు, సబార్డినేట్‌ సర్వీసులు, పబ్లిక్‌ కార్పొరేషన్లన్నింటిని మూసేయాలని సూచించారు. రక్షణ, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, ట్రెజరీ, ప్రజా సర్వీసులైన పెట్రోలియం, సీఎన్‌జీ, ఎల్‌పీజీ, పీఎన్‌జీ, విపత్తు నిర్వహణసంస్థ, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా కేంద్రాలు, పోస్టు ఆఫీసులు, ఎన్‌ఐసీ, ఎర్లీ వార్నింగ్‌ ఏజెన్సీలను మినహాయించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటి అటానమస్‌ సంస్థలు, కార్పొరేషన్లు మూసేయాలన్నారు.


పోలీసు, హోంగార్డులు, సివిల్‌ డిఫెన్స్‌, ఫైర్‌ ఇతర అత్యవసర సర్వీసులైన విపత్తుల నిర్వహణ సంస్థ, ఖైదీలు, జిల్లా ట్రెజరీ కార్యాలయం, విద్యుత్‌, తాగునీరు, పారిశుధ్యం, మున్సిపల్‌సంస్థల్లో పనిచేస్తున్న శానిటేషన్‌, తాగునీటి సరఫరా సిబ్బంది విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. కనీస సిబ్బందితో పనులు నిర్వహించాలని, మిగిలిన కార్యాలయాలన్నీ వర్క్‌ ఫ్రం హోం నిర్వహించాలన్నారు. ఆసుపత్రులతో పాటు వాటి అనుబంధ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ మందులు తయారీ యూనిట్లు, వైద్యశాలలు, వైద్య పరికరాల షాపులు, లేబరేటరీలు, క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు, అంబులెన్స్‌లన్నీ పనిచేస్తాయన్నారు. వ్యాపార, వాణిజ్య విభాగాలన్నీ మూసేయాలని ఆదేశించారు. పౌరసరఫరాలశాఖ నిర్వహిస్తున్న రేషన్‌షాపులు, ఆహారానికి సంబంధించినవి, దుకాణాలు, పండ్లు, కూరగాయల షాపులు, పాలు, డైరీ బూత్‌లు, మాంసం, చేపల షాపులు, పశుదాణాలకు డోర్‌ డెలివరీ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కార్యాలయాలు, ఏటీఎంలు, ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా, టెలీకమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్‌ సర్వీసులు, బ్రాడ్‌కాస్టింగ్‌ అండ్‌ కేబుల్‌ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు వీలైనంత వరకు వర్క్‌ ఫ్రంహోంలో జరిగేట్లు చూడాలన్నారు. పెట్రోల్‌ పంపులు, ఎల్పీజీ, ప్రెట్రోలియం, గ్యాస్‌ రీటైల్‌ స్టోరేజ్‌ ఔట్‌లెట్‌లు, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ యూనిట్లు, సర్వీసులు, కేపిటల్‌ అండ్‌ డెబిట్‌ మార్కెట్‌ సర్వీసులు, కోల్డ్‌ స్టోరేజ్‌, వేర్‌ హౌసింగ్‌ సర్వీసులు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సర్వీసులన్నీ వర్క్‌ ఫ్రం హోం ద్వారా చేపట్టాలన్నారు. 


పరిశ్రమలకు సంబంధించిన సంస్థలన్నీ మూసేయాలంటూ.... నిత్యావసరాల తయారీ, ఉత్పత్తి యూనిట్లు, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొంది ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న యూనిట్లకు మినహాయింపునిచ్చారు. విమానాలు, రైళ్లు, రోడ్డు సర్వీసులను రద్దు చేశారు. నిత్యావసరాలు చేరవేసే రవాణా వ్యవస్థ, ఫైర్‌, శాంతి భద్రతలు, అత్యవసర సర్వీసులకు మినహాయింపునిచ్చారు. హోటళ్ల సేవలను రద్దు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న వ్యక్తులకు, మెడికల్‌ ఎమర్జెన్సీ సిబ్బంది, నావికా విభాగంలో పనిచేసే సిబ్బందికి బస చేసేందుకు వెసులుబాటు కల్పించారు. వాటిని కరోనా క్వారంటైన్‌ సౌకర్యాలకు వినియోగించుకోవాలన్నారు. అన్నీ విద్యాసంస్థలు, ట్రైనింగ్‌, రీసెర్చి, కోచింగ్‌ సెంటర్లు మూసేస్తారు. అన్నీ ప్రార్థనాస్థలాలు ఎలాంటి మినహాయింపులు లేకుండా మూసేయాలని ఆదేశించారు. అన్నీ సామాజిక, రాజకీయ, స్పోర్ట్సు, ఎంటర్‌టైన్‌మెంట్‌, అకడమిక్‌, కల్చరల్‌, మతపరమైన కార్యక్రమాలు, జనసమూహాల కార్యక్రమాలను రద్దు చేశారు. ఎవరైనా మరణించి  అంత్య క్రియలు చేయాల్సి వస్తే 20 మందికంటే ఎక్కువ గ్రూపు కాకుండా కార్యక్రమాలు జరిగేలా అనుమతి ఇచ్చారు. 

Advertisement
Advertisement
Advertisement