అత్యవసర వైద్యసేవలేవీ..?

ABN , First Publish Date - 2020-04-10T10:21:45+05:30 IST

గుణదలలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అత్యవసర సేవలు అందక రోగులు లబోదిబోమంటున్నారు.

అత్యవసర వైద్యసేవలేవీ..?

గుణదల ఈఎస్‌ఐలో అందని వైద్యం

అత్యవసర సేవలకు అన్నీ కొరతే

రోగులను వెనక్కి పంపేస్తున్న వైనం

ఓపీ చీటీ కావాలన్నా గంటలకొద్దీ ఎదురుచూపులు

మందుల కోసం మరో ప్రహసనం


విజయవాడ : గుణదలలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అత్యవసర సేవలు అందక రోగులు లబోదిబోమంటున్నారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పటికే కొవిడ్‌ ఆసుపత్రిగా ప్రకటించగా, ఈనెల 3వ తేదీ నుంచి గుణదలలోని ఈఎస్‌ఐలో ఓపీ సేవలను ప్రారంభించారు. సర్జరీ, మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌ విభాగాలతో పాటు అత్యవసర వైద్యసేవలను కూడా అందించేందుకు 24 గంటలూ పనిచేసే క్యాజువాలిటీ, రెండు మైనర్‌ ఆపరేషన్‌ థియేటర్లను ఈఎస్‌ఐ ఆసుపత్రిలోనే తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేశారు.


తగినంతమంది వైద్యులు, సిబ్బంది, ఫార్మాసిస్టులను కేటాయించారు. కరోనా పుణ్యమా అని అన్ని వ్యవస్థలూ మూతపడటం, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేసిన ఈ తరుణంలో నిరుపేదలు అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు పొందేందుకు ఒక భరోసా ఉంటుందని అందరూ ఆశించారు. కానీ, ఆశించిన స్థాయిలో ఇక్కడ వైద్యసేవలు అందడం లేదు. ఒళ్లు నొప్పులు, చిన్నచిన్న దెబ్బలు తగిలితే కట్లు కట్టడం, కుట్లు వేయడం, నొప్పులు తగ్గడానికి మాత్రలు ఇవ్వడం మినహా ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో వైద్యసేవలందడం లేదని రోగులు వాపోతున్నారు.


అర్థరాత్రి అత్యవసరంగా వెళ్తే ఆక్సిజన్‌ లేదన్నారు

మొగల్రాజపురానికి చెందిన ఒక వృద్ధురాలికి బుధవారం రాత్రి శరీరంలో చక్కెర స్థాయి తగ్గిపోవడంతో ఊపిరాడక ఇబ్బంది పడింది. దీంతో కుటుంబ సభ్యులు అత్యవసర వైద్యం కోసం నగరంలోని నాలుగైదు ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రులకు తీసుకువెళ్లారు. ఎవరూ ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి అంగీకరించలేదు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో చివరికి అర్థరాత్రి ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఓపీ విభాగానికి తీసుకువెళ్లారు. అక్కడ జూనియర్‌ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలి పరిస్థితి చూసి వెంటనే ఆక్సిజన్‌ అందించాలని చెప్పారు. ఇక్కడ ఆక్సిజన్‌ సిలిండర్లు లేవని, వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని జూనియర్‌ డాక్టర్లు చెప్పారు.


అర్థరాత్రి గుంటూరుకు తీసుకెళ్లే మార్గం లేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ వృద్ధురాలు బంధువులు తెలిసిన వారందరినీ సంప్రదించారు. చివరికి నగర శివారులోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి వైద్యులను వేడుకుంటే ఆ వృద్ధురాలిని ఐసీయూలో ఉంచి అత్యవసర వైద్యసేవలందించారు. ప్రస్తుతం ఆమె ఆ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. ఇలాంటి పరిస్థితే ఏ దిక్కూలేని అభాగ్యులు, నిరుపేదలకు ఎదురైతే ప్రభుత్వ వైద్యం పరిస్థితి ఏమిటీ..? అంటే జవాబు దొరకదు. 


ఓపీ చీటీ ఇవ్వడానికీ ఇబ్బందే..

గుణదల ఈఎస్‌ఐలో పగటి పూట ఓపీ చీటీ ఇవ్వడానికి తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో రోగులు గంటల తరబడి వరుసలో నిలబడాల్సి వస్తోంది. ఎలాగోలా పడిగాపులు పడి వైద్యుడికి చూపించుకుని మందుల కోసం వెళ్తే అక్కడా పెద్ద క్యూ ఉంటోంది. 

Updated Date - 2020-04-10T10:21:45+05:30 IST