ఆరోగ్య శాఖలో ‘ఎమర్జెన్సీ’!

ABN , First Publish Date - 2022-08-02T08:54:49+05:30 IST

ఆరోగ్య శాఖలో బోధనాస్పత్రులు చాలా కీలకం. రాష్ట్రంలోని 80 శాతం వైద్య సేవలు వాటిలోనే అందుతున్నాయి.

ఆరోగ్య శాఖలో ‘ఎమర్జెన్సీ’!

  • డీఎంఈ ఆస్పత్రుల్లో సిబ్బంది ఖాళీ..
  • అత్యవసర సేవలు నిలిచిపోయే ముప్పు
  • గైనిక్‌, లేబర్‌ వార్డులు మూతబడే చాన్సు
  • బోధనాస్పత్రులు, పీహెచ్‌సీల్లో సిబ్బంది తరలింపు
  • డీఎంఈ నుంచి ఏపీవీవీపీకి 300 మంది వైద్యులు
  • అధికారుల నిర్ణయాలపై డాక్టర్లలో తీవ్ర వ్యతిరేకత


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఆరోగ్య శాఖలో బోధనాస్పత్రులు చాలా కీలకం. రాష్ట్రంలోని 80 శాతం వైద్య సేవలు వాటిలోనే అందుతున్నాయి. జ్వర పీడితుల నుంచి ప్రధాన సర్జరీల వరకూ అవే దిక్కు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయాల్లో బోధనాస్పత్రులు అందించే సేవలతో వేల మంది రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు నిలుస్తున్నాయి. రాష్ట్రంలో ఇలా రోగుల పాలిట సంజీవనిగా ఉన్న బోధనాస్పత్రుల ఎమర్జెన్సీ సేవలకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎసరు తెచ్చారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలో ఉన్న ఎమర్జెన్సీ వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో 80 శాతం మందిని వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ)కి తరలించబోతున్నారు. ఈ మేరకు జీవోలు 198, 197లను జారీచేశారు. పరిషత్‌లో సెకండరీ హెల్త్‌ కేర్‌ విభాగం బలోపేతానికి.. బోధనాస్పత్రుల్లో ఎమర్జెన్సీ విభాగాలను చంపేయడంపై వైద్య వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 బోధనాస్పత్రులు అందుబాటులో ఉన్నాయి. వాటిలోని ఎమర్జెన్సీ వార్డులు, గైనిక్‌, లేబర్‌ వార్డులు, బ్లడ్‌ బ్యాంకులతో పాటు అడ్మినిస్ట్రేషన్‌ బాధ్యతలు మొత్తం సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు (సీఎఎస్‌), ట్యూటర్లు చూస్తున్నారు.


 బోధనాస్పత్రుల్లో సుమారు 500 మంది సీఎఎ్‌సలు, ట్యూటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో పీజీ, డిప్లమో కోర్సులు చేసిన వైద్యులను ఏపీవీవీపీకి బదలాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే బోధనాస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు దాదాపు మూతపడినట్లే! బోధనాస్పత్రుల నిబంధనల ప్రకారం సీఎఎ్‌సలు ఎమర్జెన్సీ మెడికల్‌ ఆఫీసర్లుగా విధులు నిర్వహించాలి. కానీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చేసే పనులన్నీ వారే చేస్తుంటారు. వైద్య సేవలందించడంలో పీజీ విద్యార్థులను గైడ్‌ చేస్తుంటారు. గైనిక్‌, లేబర్‌ వార్డుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌, ప్రొఫెసర్ల కంటే ట్యూటర్లు చేసే పని ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కీలక పోస్టుల్లో విధులు నిర్వహించే వైద్యులను ఏపీవీవీపీకి తరలిస్తే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. 


ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 1,100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిల్లో 30 నుంచి 40 శాతం పీహెచ్‌సీల్లో స్పెషలిస్ట్‌ కోర్సులు పూర్తిచేసిన వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. వీరివల్ల ఆయా ప్రాంతాల్లో రోగులు స్పెషలిస్ట్‌ వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానిక పీహెచ్‌సీల్లోనే నాణ్యమైన వైద్య సేవలు పొందుతున్నారు. ఇప్పుడు వీరందరికి ఏపీవీవీపీకి తరలిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల వైద్యులకు ఉపయోగమే గానీ.. రోగులు నష్టపోతారు. జ్వరం వచ్చినా సుదూర ప్రయాణం చేసి నగరాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


ఏపీవీవీపీలో ఏం జరుగుతోంది..?

అసలు ఏపీవీవీపీలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక అధికారి తీసుకున్న నిర్ణయానికి వందల మంది వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. అయినా ఉన్నతాధికారులు గుడ్డిగా సదరు అధికారినే సమర్థిస్తూ, ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఏపీవీవీపీలో కొన్నేళ్ల నుంచి సిబ్బంది కొరత ఉంది. జగన్‌ ప్రభుత్వం వందల మంది వైద్యుల నియామకానికి అనుమతిచ్చింది. చివరికి ఏపీవీవీపీలో విధులు నిర్వహించే వైద్యులు జీతాలను కూడా అనూహ్యంగా పెంచింది. గతంలో సీఎఎ్‌సకు రూ.53,300 మాత్రమే వేతనంగా అందేది. తక్కువ జీతం కావడంతో వైద్యులెవరూ ఏపీవీవీపీలో విధులకు ముందుకొచ్చేవారు కాదు. ప్రభుత్వం అనూహ్యంగా సీఎఎ్‌సల జీతం రూ.80 వేలకు పెంచేసింది. చేసింది. ఆ తర్వాత ఏపీవీవీపీ అధికారులు 600 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు.  అనేక దరఖాస్తులు వచ్చాయి. మెరిట్‌ లిస్ట్‌ కూడా సిద్ధం చేశారు. చివరగా కౌన్సెలింగ్‌ సమయంలో నియామకాల ప్రక్రియను నిలిపివేశారు. రీస్ట్రక్చరింగ్‌ పేరుతో వైద్యుల సర్వీసుపై పడ్డారు. ఈ మధ్య కాలంలో ఏపీవీవీపీ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాల వల్ల వేల మందికి ఇబ్బందులు గురవుతున్నారు. మొన్నటికి మొన్న 1,712 పోస్టులు రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు వందల మంది వైద్యులను డీగ్రేడ్‌ చేసేందుకు ఫైలు పెట్టారు. ఇప్పుడు బోధనాస్పత్రులు, పీహెచ్‌సీల్లో స్పెషలిస్ట్‌ వైద్యులు లాక్కునేందుకు రెడీ అయ్యారు. అసలు ఏపీవీవీపీలో ఏం జరుగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Updated Date - 2022-08-02T08:54:49+05:30 IST