- శ్రీలంకలో ఆందోళనలకు అడ్డుకట్ట
- ప్రజలను అడుగు బయట పెట్టనివ్వని బలగాలు
- అధ్యక్షుడి నివాసం ముట్టడి.. 54 మంది అరెస్టు
- లంకకు చేరుకున్న 40 వేల టన్నుల భారత్ డీజిల్
- ఎల్వోసీ అందాక ఆహారం, నిత్యావసరాల సాయం
న్యూఢిల్లీ/కొలంబో, ఏప్రిల్ 2: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడి నివాసం ముట్టడి హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం.. దాంతోపాటు 36 గంటలపాటు కర్ఫ్యూను కూడా విధించింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం (ఈ నెల 4) ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనున్నట్లు పేర్కొంది. ఈ సమయంలో ఇంటినుంచి ప్రజలు అడుగు బయట పెట్టకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అత్యవసరమైన సేవలు మినహా ఎవరినీ అనుమతించడంలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ప్రజా భద్రత, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, పౌరులకు అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా చూసేందుకే ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు రాజపక్స ప్రకటించారు.
అయితే రాజపక్స నిర్ణయాన్ని మేధావులు సహా పలు వర్గాలు ఖండించాయి. ఎమర్జెన్సీ విధించడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరించడమేనని వారు అన్నారు. శ్రీలంకలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండడం, కాగితం కొరత కారణంగా పరీక్షలను వాయిదా వేయడం, డీజిల్ విక్రయాలను నిలిపివేయడం, రోజులో 13 గంటలపాటు విద్యుత్ కోతతో శ్రీలంక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడం తెలిసిందే. ఈ పరిస్థితికి అధ్యక్షుడు రాజపక్సనే కారణమంటూ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన నివాసాన్ని ముట్టడించగా.. అది హింసాత్మకంగా మారింది. ఐదుగురు పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో 54 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 21 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరుగురికి ఈ నెల 4 వరకు రిమాండ్ విధించింది.
లంకకు చేరిన భారత్ డీజిల్..
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు సాయంగా భారత్ ప్రకటించిన 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ శనివారం కొలంబోకు చేరుకుంది. ఓడ ద్వారా చేరిన ఈ డీజిల్‌ను వెంటనే దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆహార ధాన్యాలు, మందులు, నిత్యావసరాల కోసం ప్రభుత్వం నుంచి లైన్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ) అందాక సాయం చేసేందుకు వ్యాపార వర్గాలు
కాగా, ప్రజల నిరసనను ప్రభుత్వం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ప్రతిపక్ష పార్టీలు అతివాద శక్తులతో సంబంధాలు పెట్టుకొని తన నివాసంపై దాడికి పాల్పడ్డాయని అధ్యక్షుడు రాజపక్స ఆరోపించారు. అయితే తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంఽధం లేదని నిరసనకారులు అంటున్నారు. ప్రజల కష్టాలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలన్న లక్ష్యంతోనే తాము పోరాడుతున్నామని తెలిపారు.
ఉక్రెయిన్ పర్యాటకులకు వీసా పొడిగింపు
ఓవైపు దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. తమ పౌరులకే ఆహారాన్నందించలేని పరిస్థితిని శ్రీలంక ఎదుర్కొంటోంది. అయినా.. ఉక్రెయిన్, రష్యా నుంచి పర్యాటకులుగా వచ్చి, ఆ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా వెళ్లలేని స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా నుంచి సుమారు 15 వేల మంది, ఉక్రెయిన్ నుంచి 5 వేల మంది దాకా పర్యాటకులు శ్రీలంకకు వచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో వీరంతా శ్రీలంకలోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారి వీసా గడువును శ్రీలంక పొడిగించింది. వారు బస చేసిన హోటళ్ల యజమానులు వారికి ఉచిత సౌకర్యం కల్పిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.