నేడే తిరుపతి జిల్లా ఆవిర్భావం

ABN , First Publish Date - 2022-04-04T08:04:38+05:30 IST

తిరుపతి జిల్లా కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న తాత్కాలిక కలెక్టరేట్‌ కోసం శ్రీపద్మావతి నిలయం సిద్ధమైంది. సోమవారం ఉదయం సీఎం జగన్‌ వర్చువల్‌గా కొత్త జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కలెక్టర్‌ చాంబర్లు, వీడియో కాన్ఫరెన్పు హాల్‌, సమావేశ మందిరాలు ముస్తాబయ్యాయి.

నేడే తిరుపతి జిల్లా ఆవిర్భావం
విద్యుద్దీపాల అలంకరణలో తిరుపతి జిల్లా కలెక్టరేట్‌

-ఉదయం 9.05 - 9.45గంటల మధ్య ముహూర్తం

- వర్చువల్‌గా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం

-తర్వాతే బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి

-ప్రారంభోత్సవానికి మంత్రుల హాజరుపై అస్పష్టత


తిరుపతి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి):జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా నేడు ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం తిరుచానూరు సమీపంలోని పద్మావతీ నిలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఉదయం 9.05 గంటల నుంచీ 9.45 గంటల నడుమ ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచీ కొత్త జిల్లాను ప్రారంభిస్తారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సు హాలులో సీఎం ప్రసంగం ప్రసారమవుతుంది. దీనికి ప్రజాప్రతినిధులను, జిల్లాస్థాయి అధికారులను మాత్రమే అనుమతిస్తున్నారు. సీఎం ప్రసంగం పూర్తయ్యాక తిరుపతి జిల్లా కలెక్టర్‌గా కె.వెంకట్రమణారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారమే తిరుపతికి చేరుకున్న ఆయన తొలుత పద్మావతీ నిలయంలో జరుగుతున్న కలెక్టరేట్‌ పనులను పరిశీలించారు. అనంతరం తిరుమల బయల్దేరి వెళ్ళారు. సోమవారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకుని 8.30 గంటలకల్లా పద్మావతీ నిలయం చేరుకుంటారు.సీఎం వర్చువల్‌గా ప్రారంభించినప్పటికీ స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య అతిధిగా ఎవరు పాల్గొంటారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. జిల్లాలో ఇద్దరు మంత్రులుండగా సాంకేతికంగా వారు తిరుపతి జిల్లాకు చెందిన వారు కారు. అనధికారిక సమాచారం మేరకు సోమవారం ఉదయాన్నే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడ బయల్దేరి వెళుతున్నారు. దీంతో  కార్యక్రమానికి ఆయన రావడం లేదని సమాచారం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కూడా పెద్దిరెడ్డి విజయవాడ వెళ్ళే అవకాశముందని కూడా మంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికీ మంత్రులిద్దరూ లేదా కనీసం ఏ ఒకరైనా వస్తారా లేదా అన్నదానిపై ఽఅధికారులకు ఆదివారం రాత్రి 8.30 గంటల వరకూ కూడా సమాచారం లేదు. దానికి తోడు ప్రారంభోత్సవానికి సంబంధించి రాష్ట్ర సెక్రటేరియట్‌లో జీఏడీ నుంచీ ఎలాంటి మార్గదర్శకాలూ రాలేదని సమాచారం. దీంతో అధికారులు కూడా జీఏడీ నుంచీ సమాచారం కోసం వేచిచూస్తున్నట్టు తెలిసింది.


తిరుపతి జిల్లా కలెక్టరేట్‌ సిద్ధం : నేడు ప్రారంభం


 తిరుపతి జిల్లా కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న తాత్కాలిక కలెక్టరేట్‌ కోసం శ్రీపద్మావతి నిలయం సిద్ధమైంది. సోమవారం ఉదయం సీఎం జగన్‌ వర్చువల్‌గా కొత్త జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కలెక్టర్‌ చాంబర్లు, వీడియో కాన్ఫరెన్పు హాల్‌, సమావేశ మందిరాలు ముస్తాబయ్యాయి. ప్రభుత్వశాఖలకు సంబంధించి ఏర్పాటుచేసిన దాదాపు 30కార్యాలయాల్లో చిన్నచిన్న పనులు మినహా పాలనకు సిద్ధమయ్యాయి. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌తోపాటు కొత్త కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదివారం కలెక్టరేట్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా హరినారాయణన్‌తోపాటు అన్నమయ్య జిల్లాకు కలెక్టర్‌గా వెళుతున్న గిరీష, శ్రీకాళహస్తి ఆర్డీవోగా వెళుతున్న హరిత, ఆర్డీవో కనుకనరసారెడ్డి కొత్త కలెక్టర్‌కు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. 


 తొలి కలెక్టర్‌ కావడం .. అదృష్టంగా భావిస్తున్నా :  కలెక్టర్‌ వెంకటరమణా రెడ్డి


తిరుపతి జిల్లాకు తొలి కలెక్టర్‌గా నియమితులవడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెంకటరమణా రెడ్డి అభిప్రాయపడ్డారు.ఆదివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.‘తిరుపతిలోని ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ చేశా.ఈ ప్రాంతంతో నాకు మంచి అనుబంధం ఉంది. చదువుకున్న ప్రాంతానికే కలెక్టర్‌గా రావడం ఆనందంగా ఉంది.వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి జిల్లా  అన్ని రకాలుగా  అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తా.’ అన్నారు.కొత్త జిల్లాకు కోస్తాతీరం వచ్చిందని, దానిని ఎలా ఉపయోగించుకోవాలో పరిశీలిస్తామన్నారు. గతంలో కోస్తా తీరంలో పనిచేసిన అనుభవం కూడా తనకుందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏరకంగా అభివృద్ధి చేయాలో పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా పరిశ్రమలు, ఎస్‌ఈజడ్‌లు కూడా తిరుపతి జిల్లాలో భాగంగా ఉన్నాయని వాటికి కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పించి అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. కొన్నిసార్లు టీటీడీతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సి ఉంటుందన్నారు. 



Updated Date - 2022-04-04T08:04:38+05:30 IST