భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం

ABN , First Publish Date - 2022-07-01T07:04:02+05:30 IST

జాతీయ వాద రాజకీయ కార్యకర్తలతో ఒక అఖిల భారత సంస్థను స్థాపించాలన్న భారతీయుల ఆలోచనకు..

భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం

జాతీయ వాద రాజకీయ కార్యకర్తలతో ఒక అఖిల భారత సంస్థను స్థాపించాలన్న భారతీయుల ఆలోచనకు అలన్ ఆక్టేవ్ హ్యూమ్ (1829–1912) ఒక నిర్దిష్టమైన తుది రూపు నిచ్చాడు. 1885 డిసెంబర్‌లో బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల నుంచి 72 మంది ప్రతినిధులతో భారత జాతీయ కాంగ్రెస్ భారత ప్రజా జీవితంలోకి ప్రవేశించింది.


భారత స్వాతంత్ర్య లక్ష్య సాధనకు అంకితమైన తరాల వారు ‘స్వభాష, స్వవేషం, స్వదేశీ, స్వరాజ్యం’ను తమ కొత్త చతుర్వేదాలుగా భావించేవారు. ఆ ఉదాత్త ఆశయాల, ముఖ్యంగా స్వరాజ్య సాధనకు యావద్భారతీయులను పురిగొల్పడంలో అనుపమాన పాత్ర భారత జాతీయ కాంగ్రెస్‌దే. 1905లో గోపాలకృష్ణ గోఖలే (1866–1915) బెనారస్‌లో కాంగ్రెస్ వార్షిక మహాసభకు అధ్యక్షత వహించనున్న సందర్భంలో భారత భీష్మాచార్యుడు దాదాభాయి నౌరోజీ (1825–1917) లండన్ నుంచి ఆ యువ రాజనీతిజ్ఞునికి రాసిన ఒక లేఖలో కాంగ్రెస్ మహా సంస్థ ఆవిర్భావం గురించి ఇలా గుర్తు చేసుకున్నారు: ‘యాభై రెండు సంవత్సరాల పుటలు వెనుకకు తిప్పగా 1853 సంవత్సరం మొదటి మజిలీగా నిలిచినది.


బెంగాల్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్, బొంబాయి అసోసియేషన్ మొట్టమొదట వెలుగు చూచిన మూడు రాజకీయ సంస్థలు. ఆ రోజులలో మన రాజకీయోద్దేశ్యములు, గమ్యములు ఎంత పరిమితములుగా ఉండెడివి! భారతదేశంలో బీదరికము తిష్ఠవేయుచున్నదని గుర్తించితిమికాని దాని నిజస్వరూపము అంతుపట్టకుండెను. స్వతంత్ర బ్రిటిష్ పౌరులముగా మన హక్కులు, బాధ్యతలు అవగాహనము కాకుండెను. అన్ని ప్రారంభముల వలెనే అవి కూడ అల్పమైనవి. అప్పటి పరిస్థితులలో అవి ఆ మాత్రమైన నిలదొక్కుకొన్నవి. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ నిరాఘాటముగ తీగెలు సాగినది. బొంబాయి అసోసియేషన్ మధ్యలో మూతపడినను బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌గా మరల సిరి ఎత్తుకొన్నది. మద్రాస్ అసోసియేషన్ బాలారిష్టములకులోనైనను మహాజన సభ పేర ఒళ్లు చేసినది. పూనా సార్వ జనిక సభ వంటి స్థానిక సంస్థలు కూడ అక్కడక్కడ తలయెత్తినవి. ఈ మొదటి యూపులో మనము ఏమి సాధించగలిగితిమి? ఆ సంస్థలు నాటిన బీజములు మొలకెత్తి పూచి ఫలించుటకు ముప్పది రెండేండ్లు పట్టినది.


1885 నాటికి మన రాజకీయ పరిజ్ఞానము పరిణతమైనది. జాతి మత వర్గ విభేదములు సర్దుబాటు చేసుకొని భారతీయులు ఒక్క త్రాటి మీద నిలవవలసిన ఆవశ్యకత గుర్తించిరి. కొత్తశక్తులు సాంఘిక సంస్కరణములను చేపట్టి తమ ప్రభావములు ఒండింటిపై ప్రసరింపచేసుకొని నూతన చైతన్యమును కలిగించుచున్నవి. ముప్పది రెండు సంవత్సరముల కృషి బంగరు ఫలమందించినది. అదే మన భారత జాతీయ కాంగ్రెస్. రాజకీయాభ్యుదయమునకు వారసత్వం సృష్టించి ముందు తరముల వారికి పాలు పంచగలిగినది. 1853 నాటి బీజావాపకులు చాల మంది ఇప్పుడు లేరు. కొత్త తరముల వారికి బాధ్యతలు అప్పగించి కనుమరుగైనారు. సర్ అలన్ ఆక్టేవ్ హ్యూమ్, సర్ విలియమ్ వెడ్డర్ బర్న్, మార్టిన్ వుడ్, సర్ హెన్రీ కాటన్– ఈ నలుగురు బెంగాల్ బ్రిటిష్ కమిటీకి నాలుగు స్తంభాలు. వారి సేవ నిస్వార్థమైనది. వారి సలహాలు మన స్వాతంత్ర్య జ్యోతికి దీప్తి కలిగించినవి. వారికి కృతజ్ఞతలు పలుకుట అప్రస్తుతము కాదు’.


సర్ హ్యూమ్ 1883 మార్చి 1న కలకత్తా విశ్వవిద్యాలయ పట్టభద్రుల నుద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశాడు. అందలి సందేశమిది: ‘విద్యా విజ్ఞానములకు ప్రతినిధుల మనుకొన్న వారు కూడ ఇంత చేతగాని దద్దమ్మలా? స్వార్థమున కంతగా అమ్ముడు పోయినారా? దేశముకొరకు దెబ్బ తీయలేరా? అయితే మీరు కాళ్ల క్రింద పడి నలగిపోవుట తప్పు కాదు. అదే మీకు తగిన శాస్తి. ప్రతి జాతి తన వికాసమునకు తగినట్లు సుపరిపాలన సాధించుకొనును. మీరు విద్యావేత్తలు. మీ ప్రతిభ జాతికి గర్వకారణము. మీ ఇల్లు చక్కదిద్దుకొనుటకు మీకు దేవిడిమనా చెప్పబడినది. ప్రభుత్వం పక్షపాతములతో నిండిపోయినది. ప్రజలు స్వాతంత్ర్యం గోల్పోయినారు. ఈ వైపరీత్యాన్ని నిరోధించుటకు పోరాటము సాగింపలేరా? అభ్యుదయంపై ఆశలేదా? ఇంతకంటె మంచి ప్రభుత్వానికి అర్హులము కాము అనేదే మీ నిశ్చితాభిప్రాయమా? ఐనచో బ్రిటిష్ వారిపై ఫిర్యాదు చేయకుడు. చైతన్యము కలవాడే జీవి. స్వార్థ త్యాగమే స్వాతంత్ర్య సౌఖ్యములకు కరదీపిక’. భారతీయులను మేల్కొలిపేందుకు హ్యూమ్ మహాశయుడు కవితా ప్రబోధము కూడా చేశాడు. శతావధాని యన్.సి. యస్.పార్థ సారథి అనుసృజనలో ఆ ప్రబోధ గీతంలోని కొన్ని చరణాలు: ‘భరత పుత్రులు! ఏల యీ పగటి కలలు/ స్వర్గమది ఆకసము నుండి జారిపడదు/కాసెలు బిగించి కార్యదీక్షను గొనుండు/ జాతులు తమంత తీగెలు సాగవలయు’; ‘భరతపుత్రులు! రంగాన కురికి రండు/ మడమత్రిప్పకు డే ‘విషఘడియ’ నైన/ అదె నవోషస్సు–తూర్పున ఉదయమందె/ జాతులు తమంత తీగెలు సాగవలయు’.

Updated Date - 2022-07-01T07:04:02+05:30 IST