Advertisement
Advertisement
Abn logo
Advertisement

శనగ పంటకు పచ్చ పురుగు

  1. ఆందోళనలో రైతులు


ఓర్వకల్లు, డిసెంబరు 4: మండలంలో రబీలో సాగుచేసిన శనగ పంటపై పచ్చపురుగు, వేరుకుళ్లు తెగుళ్లు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.  ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. పురుగు ఆకులను తినేస్తుండటంతో పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఓర్వకల్లు, హుశేనాపురం, గుట్టపాడు, ఎన్‌.కొంతలపాడు, నన్నూరు, ఉయ్యాలవాడ, లొద్దిపల్లె, కన్నమడకల, హుశేనాపురం, పూడిచెర్ల తదితర గ్రామాల్లో దాదాపు 10వేల ఎకరాల్లో శనగ పంటను సాగు చేశారు. ఈ పంటను  పచ్చపురుగు  ఆశించింది. పంటపై క్రిమిసంహారక మందులు పిచికారి చేసినా ప్రయోజనం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు సాగు చేసినప్పటి నుంచి వర్షాలు అధికం కావడంతో పంటపై తెగుళ్లు అధికమయ్యాయి. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి ఆశించినంత మేరకు రాలేదు. పంట ఏపుగా పెరిగినా పురుగు ఉధృతి వల్ల నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 


తీవ్రంగా నష్టపోతున్నాం 

శనగ పంటపై పచ్చ పురుగు సోకింది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాం. పంటపై పెట్టుబడి అధికంగా ఖర్చుపెట్టాం.   ఎన్ని మందులు పిచికారి చేసినా పురుగు తగ్గడం లేదు. వర్షాలు అధికంగా కురవడంతో తెగుళ్లు అధికమయ్యాయి. 

- గోవిందరెడ్డి, రైతు


సస్యరక్షణ చర్యలు చేపట్టండి 

పురుగు నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. లీటరు నీటికి 3 మి.మీల ఎండో సల్ఫాన్‌ ద్రావణం, దీంతో పాటు వేపనూనె 5 మి.మీలు, లేదా ఫాస్ఫేట్‌ లీటరు నీటితో తడిపి మొక్కలపై ఉదయం, సాయంకాలం వేళల్లో పిచికారి చేయాలి. లేదా క్లోరోఫైరిపాస్‌ 2 సె.మీల ద్రావణం లీటరుకు నీటితో కలిపి పిచికారి చేసి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు, 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి.  

- సుధాకర్‌, ఓర్వకల్లు, ఏవో 


Advertisement
Advertisement