టూరిజానికి పచ్చజెండా

ABN , First Publish Date - 2020-06-05T11:12:14+05:30 IST

టూరిజానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈనెల 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించుకోవచ్చని ..

టూరిజానికి పచ్చజెండా

హోటల్‌, రెస్టారెంట్లు ఓపెన్‌

త్వరలో కంట్రోలు రూమ్‌లు ప్రారంభం?

పాపికొండలకు బోటింగ్‌కు ఇంకా అనుమతి లేదు

ప్రారంభంలో రెండు బోట్లు నడిచే అవకాశం

ప్రైవేటు బోట్లకు ఇప్పటి వరకూ అనుమతి లేదు.

రాజమహేంద్రి అఖండ గోదారిలో త్వరలో బోటింగ్‌


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): టూరిజానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈనెల 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టూరిజం శాఖలో హడావుడి కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడడంతో టూరిజం ఆగిపోయిన సంగతి తెలిసిందే. అవి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక  ఆయా పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. కానీ అతి ముఖ్యమైన పాపికొండల బోటు యాత్రపై ఇంకా స్పష్టత లేదు. గత ఏడాది సెప్టెంబర్‌ 28న దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద  బోటు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదులు, రిజర్వాయర్లలో బోటింగ్‌ పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తర్వాత అనేక నిబంధనలు తయారు చేసి రాష్ట్రంలో 9 కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం నుంచి, పాపికొండల వరకూ ఉభయగోదావరి జిల్లాల్లో కూడా కొన్ని కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.


వీటిని త్వరలో ముఖ్యమంత్రి  జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇవి ప్రారంభమైన తర్వాతే నదుల్లో బోటింగ్‌ ప్రారంభమవుతుంది.   ఈనెలలోనే ఇవి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇవి ప్రారంభిస్తే మొదట పాపికొండలకు టూరిజం శాఖకు చెందిన రెండు బోట్లలో ఒకటైనా నడిపే అవకాశం ఉంది. మిగతా ప్రైవేటు బోట్లకు పోర్టు నుంచి అనుమతి రాలేదు. వాటికి కూడా త్వరలోనే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి గత డిసెంబరులోనే నడపాల్సి ఉండగా, బోట్లకు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ వల్ల వాటి జోలికి ఎవరూ పోలేదు. ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు పైన బోట్లు నడవడానికి అవసరమైన నీరు కూడా ఉంది.


ఇక హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి ఇవ్వడం మంచిదే కానీ కరోనా నేపథ్యంలో అక్కడ ఆంక్షలు అమలు చేయవలసి ఉంది. కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు అన్నీ అమలు చేయాలి. రాజమహేంద్రవరం అఖండగోదావరిలో టూరిజానికి గ్రీన్‌సిగ్నల్‌ రావలసి ఉంది. బోట్లకు ఇప్పటికే అనుమతి ఉంది. ఇక్కడ బోటింగ్‌ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇక్కడ స్పీడ్‌ బోట్లతోపాటు ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌  కూడా సిద్ధంగా ఉంది. 


దివాలా తీసిన బోటు టూరిజం

గోదావరి పాపికొండల టూరిజాన్ని నమ్ముకుని అనేకమంది బోట్లను కొనుగోలు చేశారు. రాజమహేంద్రవరం కేంద్రంగా టూరిజం పాయింట్లు అనేకం ఉన్నాయి.  ప్రభుత్వ టూరిజంతోపాటు, ప్రైవేట్‌ వ్యక్తులు ఎక్కువమంది టూరిజం మీద పెట్టుబడి పెట్టారు. బోట్లను కొనుగోలు చేశారు. కానీ కచ్చులూరు ప్రమాదం తర్వాత ఇవన్నీ మూలనపడ్డాయి. దీంతో నిర్వాహకులు, వాటిపై ఆధారపడిన ఉద్యోగులు కూడా ఉపాధి కోల్పోయారు. సుమారు పది నెలల నుంచి ఇదే పరిస్థితి. పాపికొండ యాత్రకు తెలుగు రాష్ర్టాల నుంచేకాక, ఇతర రాష్ర్టాల నుంచీ పర్యాటకులు వస్తుంటారు. గతంలో బోటు ప్రమాదం, ఇప్పుడు కరోనాతో టూరిజం ఆగిపోయింది.

Updated Date - 2020-06-05T11:12:14+05:30 IST