హెచ్‌సీఏలో ఈ-మెయిల్స్‌ అలజడి

ABN , First Publish Date - 2021-04-20T10:53:20+05:30 IST

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో అధ్యక్షుడు అ జరుద్దీన్‌, కార్యదర్శి విజయానంద్‌ వర్గాల మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి

హెచ్‌సీఏలో ఈ-మెయిల్స్‌ అలజడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో అధ్యక్షుడు అ జరుద్దీన్‌, కార్యదర్శి విజయానంద్‌ వర్గాల మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. కాగా, సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ దీపక్‌ వర్మ.. అజరుద్దీన్‌, విజయానంద్‌ న్యాయ సలహాదారులకు పెట్టిన రెండు ఈ-మెయిల్స్‌ అలజడి సృష్టించాయి. ‘ఊహించని విధంగా వివాదాలు చెలరేగుతున్న తరుణంలో దయచేసి వాటిలోకి నన్ను లాగవద్దు. అక్కడి రెండు వర్గాల మధ్య జరుగుతున్న రాజకీయాల్లో తలదూర్చడం నాకిష్టం లేదు. నాకున్న ఇబ్బందులను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ జస్టిస్‌ వర్మ ఉదయం ఒక మెయిల్‌ పెట్టారు. దీంతో అజర్‌ వ్యతిరేక వర్గం అతడికి ఎదురు దెబ్బ తగిలిందంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే, సాయంత్రానికల్లా పరిస్థితులు మారిపోయాయి.


‘హెచ్‌సీఏ ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. అంబుడ్స్‌మన్‌గా దీపక్‌వర్మ తప్పుకున్నాడనే ఆరోపణలు నిరాధారమైనవి’ అని అజర్‌ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ కొద్దిసేపటికే వర్మ నుంచే మరో ఈ-మెయిల్‌ వచ్చింది. ‘ఉద యం పంపిన మెయిల్‌ను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఇరు వర్గాల రాజకీయాల్లోకి నన్ను లాగవద్దని స్పష్టం చేశానే కానీ అంబుడ్స్‌మన్‌గా తప్పుకుంటున్నట్టు నేనెక్కడా చెప్పలేదు. నా పదవీకాలం ఉన్నంతవరకు అంబుడ్స్‌మన్‌గా కొనసాగుతా. అభ్యంతరాలు ఉన్నవాళ్లు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు’ అనేది రెండో మెయిల్‌ సారాంశం. దీంతో ఉదయం మొదలైన హెచ్‌సీఏ అలజడి సాయంత్రం తీరం చేరినట్టయింది.

Updated Date - 2021-04-20T10:53:20+05:30 IST